ప్రొ.నాగేశ్వర్ : ఎవరితోనైనా కలుస్తానంటున్న మోడీ..! సీన్ అర్థమైపోయిందా..?

భారతీయ జనతా పార్టీ.. ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. తమను ఎంత తీవ్రంగా వ్యతిరేకించిన వారు అయినా సరే.. కలుపుకుని పోవడానికి సిద్ధమని ప్రకటించారు. దీంతో.. మానసికంగా.. తాము వెనుకబడిపోతున్నామని.. మిత్రులను కలుపుకుని పోవడానికి.. సిద్ధమన్న సంకేతాలను.. మోడీ నేరుగా పంపుతున్నారు. ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో.. ఎవరినైనా కలుపుకుంటామని ప్రకటించారు. ఇదే.. అనేక చర్చలకు కారణం అవుతోంది.

బీజేపీ సీట్లు కోల్పోవడం ఖాయమేనా..?

గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హిందీ హార్ట్ ల్యాండ్‌లో దాదాపుగా 90 శాతానికిపైగా సీట్లు గెలుచుకుంది. ఈ సారి ఆ సీట్లు గెలుచుకునే పరిస్థితి లేదు. చాలా వరకు తగ్గిపోయే పరిస్థితి ఉంది. రాజకీయాలు డైనమిక్ గా ఉంటాయి. క్షణక్షణం మారుతూ ఉంటాయి. 2014 ఎన్నికల తర్వాత చాలా ఉపఎన్నికలు జరిగాయి. అనేక చోట్ల… బీజేపీ సీట్లు కోల్పోయింది. యూపీలో.. కంచుకోటల్లాంటి సీట్లను కోల్పోయింది. 2016-17 తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు తగ్గడమో…ప్రభుత్వాలు కోల్పోవడమో జరిగింది. రాజస్థాన్, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్‌లలో ప్రభుత్వాలను కోల్పోయింది. పంజాబ్ రాష్ట్రంలో అడ్రస్ లేదు. గుజరాత్ లో సీట్లు కోల్పోయింది. ఈ పరిణామాలన్నింటిని చూస్తే.. బీజేపీకి సీట్లు తగ్గుతాయి. అదే సమయంలో విపక్షాలు ఐక్యంగా మారాయి. యూపీలో… విపక్షాలన్నీ ఐక్యం కావడంతో.. కులం ఆధారంగా ఓట్లన్నీ పోలరైజ్ అయ్యాయి. బీజేపీకి వ్యతిరేంగా.. ఓ బలమైన శక్తిగా.. కూటమి ఏర్పడింది. ప్రిపోల్ సర్వేలు కూడా.. ఇదే విషయాన్ని చెబుతున్నాయి.

ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయా..?

ఆర్థికంగా వెనకుబడిన వర్గాల వారి రిజర్వేషన్లు, పుల్వామా దాడి అంశం… వంటి వాటిని… బీజేపీ… రాజకీయంగా ఉపయోగించుకుంటోంది. బ్లాక్ మనీ, ఉద్యోగాలు, అభివృద్ధి ఇలాంటి విషయాలను.. ఎవరూ ప్రచారాస్త్రాలు చేయడం లేదు. అచ్చేదిన్ గురించి… ఎక్కడా చెప్పడం లేదు. గుజరాత్ మోడల్ అభివృద్ధి గురించి ఎవరూ చెప్పడం లేదు. గత ఎన్నికల్లో గుజరాత్ మోడల్ అభివృద్ధి గురించే చెప్పారు. ఇప్పుడు ఎమోషన్స్, భావోద్వేగాలు మాత్రమే వచ్చాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్‌ లాంటి రాష్ట్రాల్లో వ్యవసాయదారులు… సంక్షోభం… బీజేపీ ఓటు బ్యాంక్‌కు గండికొట్టింది. ఈ కారణంగా… కిసాన్ సమ్మాన్ పథకం తీసుకొచ్చారు. వీటన్నింటితో పాటు.. ఇప్పుడు హిందూత్వం అంశాన్ని తీసుకొస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల .. బీజేపీ కొంత మెరుగుపడిందని చెబుతున్నారు. కానీ… గత ఎన్నికల్లో మెరుగుపడినంతగా.. మెరుగుపడే అవకాశం లేదు. పోయే సీట్లను..ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల నుంచి పొందాలని ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఈశాన్య, దక్షిణాది లో కూడా… అంత తేలికైన పరిస్థితి కాదు.

కొత్త మిత్రులు రాకపోతే కష్టమేనా..?

కేరళలో శబరిమల ఇష్యూతో బలపడే ప్రయత్నం చేసింది. కానీ ఫలితం వచ్చే అవకాశం లేదు. తమిళనాడులో అన్నాడీఎంకే పొత్తు పెట్టుకున్నా.. సీట్లు వచ్చే పరిస్థితి లేదు. అలాగే.. ఏపీ, తెలంగాణలోనూ అదే పరిస్థితి. ఇక అంతో ఇంతో బలంగా ఉన్న కర్ణాటకలో.. కాంగ్రెస్, జేడీఎస్ పొత్తు పెట్టుకోవడంతో పరిస్థితి మారిపోయింది. ఇక ఈశాన్యంలో ఉన్న ఇరవై ఐదు సీట్లలో… ఎక్కువ భాగం.. మిత్రులతో… కలిసి ఉంది. కానీ.. అక్కడ పౌరసత్వ బిల్లుపై.. వివాదంతో మిత్రులు దూరమయ్యారు. ఒడిషాపై బీజేపీకి ఆశలు ఉన్నాయి. కానీ అక్కడ నవీన్ పట్నాయక్ కు అనుకూలత ఉంది. అందుకే ఉత్తరాదిలో కోల్పోయే… సీట్లను.. మిత్రపక్షాల ద్వారా కలుపుకోవాలని అనుకుంటున్నారు. పార్టీలను కాదు.. ఎంపీలను కూడా కలుపుకుంటారు. గోవాలో మిత్రపక్ష ఎమ్మెల్యేలను తన పార్టీలోనే కలిపేసుకున్నారు. అలా… మిత్రులను కలుపుకుంటారు.. కలిపేసుకుంటారు కూడా..!. ఏపీ ఎన్నికల ప్రచారంలో.. అమిత్ షా .. టీడీపీని కలుపుకోబోమని చెప్పారు. కానీ… ఎంత వ్యతిరేకించిన వారినైనా కలుపుకుంటామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇతర పక్షాలు కలసి వస్తే.. కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో తప్పులేదు. ఒకప్పుడు బీజేపీ అంటరాని పార్టీగా ఉండేది. ఇప్పుడు.. ఏ పార్టీ అయినా బీజేపీతో కలుస్తోంది. బీజేపీ కూడా ఏ పార్టీని అయినా ఆహ్వానిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.