ప్రొ.నాగేశ్వర్ : భారత రైతులపై పెప్సీకో పెత్తనం ఏమిటి..?

గుజరాత్‌కు చెందిన కొంత మంది రైతులపై.. పెప్సీకో కంపెనీ కేసు పెట్టింది. తమ కంపెనీ తయారు చేస్తున్న లేస్ బ్రాండ్ చిప్స్‌ను.. ఏ బంగాళా దుంపలతో అయితే తయారు చేస్తారో… అలాంటి రకం బంగాళాదుంపలను… గుజరాత్ రైతులు సాగు చేస్తున్నారని.. వాటిని సాగు చేసే హక్కు తమకు మాత్రమే ఉందని పెప్సీకో వాదన. మొత్తంగా తొమ్మిది రైతులకు.. ఈ కేసులు పెట్టడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

గుజరాత్‌లో చిన్న రైతులపై పెప్సీ కో కంపెనీ దావా..!

పెప్సీకో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఉన్న సంస్థ. ఆ సంస్థ గుజరాత్‌లోని తొమ్మిది మంది రైతులపై కేసులు పెట్టింది. వీరందరూ.. మూడు, నాలుగు ఎకరాలున్న రైతులే. వీరి వల్ల కానీ.. వీరు వేసే పంట వల్ల కానీ.. పెప్సీకో ఆర్థిక ప్రయోజనాలకు వచ్చే నష్టం ఏమీ లేదు. అదే సమయంలో… వీరు… ఓ మల్టినేషనల్ కంపెనీపై.. న్యాయపోరాటం చేయడం సాధ్యం కాదు. పెప్సీకో కంపెనీ భారతీయ కంపెనీ కాదు. అయినప్పటికీ… భారత్‌లో .. భారత్‌లో భూయజమాని అయిన రైతులపై దావా వేయడం ఏమిటి..?. అహ్మదాబాద్‌లో… దాఖలైన ఈ పిటిషన్‌పై అక్కడి కోర్టు కూడా… సానుకూలంగా స్పందించింది. రైతులు ఆ పంటను పండించడంపై స్టే విధించింది.

తమ సొంతమైన “బంగాళాదుంప” పంటను ఆ రైతులు వేశారట..!

పెప్సీకో లేస్ అనే చిప్స్‌ను అమ్ముతుంది. ఈ చిప్స్‌ను ప్రత్యేకరకానికి చెందిన బంగాళాదుంపలతో తయారు చేస్తామని ఆ కంపెనీ చెబుతోంది. దీని మేథోసంపత్తి హక్కుల పేరుతో.. డబ్యూటీవో ఒప్పందంలో చేసుకున్నారు. ఈ చట్టం ఆధారంగా… తమకు మాత్రమే.. హక్కులు ఉన్నాయని పెప్సీకో వాదిస్తోంది. నిజానికి… బంగాళాదుంపలు ఆదిమకాలం నుచి పండిస్తున్నారు. వీటిని పెప్సీకో కనిపెట్టలేదు. కానీ.. ఉన్న బంగాళదుంపకు జెనెటిక్‌గా కొద్దిగా మార్పులు చేసి.. పండిస్తూ… హక్కులు పొందింది. హక్కులు పొందిన విధానమే నేరం. పంటలో కొద్దిగా మార్పు చేస్తేనే పెప్సీకో హక్కులు పొందితే… తరతరాలుగా ఆ పంటల్ని పండిస్తున్న వారికి ఇంకెంత హక్కు ఉండాలి..!?. అయినా పెప్సీ కో మాత్రం.. అంతర్జాతీయంగా కుదుర్చుకున్న ఒప్పందాలను.. సాక్ష్యాలుగా చూపిస్తూ.. తాము సృష్టించుకున్న బంగాళా దంపలను సాగు చేస్తున్నారనే కారణంతో.. ఏకంగా.. ఒక్కొక్క రైతు నుంచి రూ. కోటి ఐదు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తూ…పెప్సీకో కోర్టుకు ఎక్కింది. వాళ్లంతా.. మూడు, నాలుగు ఎకరాల రైతులు. బంగాళాదుంపలు పండిస్తే.. నాలుగు ఎకరాలకు రూ. కోటి రూపాయల ఆదాయం వస్తుందా..?.

వ్యవసాయానికే గండం తెచ్చిన పెప్సీకో..! లేస్ ను బహిష్కరించాలి..!

భారతీయ చట్టాల ప్రకారం.. రైతులకు ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. రైతులు తమ అవసరాల కోసం… విత్తనాలను తయారు చేసుకున్నా… ఇతర రైతులకు పంచుకున్నా… అది తప్పేం కాదు. కానీ బ్రాండింగ్ చేసి మాత్రం అమ్ముకోకూడదు. గుజరాత్ రైతులు ఎక్కడా బ్రాండింగ్ చేసి అమ్ముకోలేదు. అదే సమయంలో పెప్సీకో పరిశోధన చేసి కొంత ఖర్చు పెట్టి.. రీసెర్చ్ చేసి.. కొత్త వంగడాన్ని సృష్టించారు కాబట్టి.. వారికి కొన్ని హక్కులు ఉంటాయి. అయితే… పొటాటో అనేది.. తరతరాలుగా ఉన్న పంట. దానిపై సమాజానికి హక్కు లేదా..?. అంటే.. రైతుల హక్కులకు రక్షణ ఉంది. కానీ.. ఇప్పుడా… రక్షణ లేనట్లుగా.. వ్యవహరిస్తున్నారు. పెప్సీకో కంపెనీకి మాత్రమే రక్షణ ఉన్నట్లు చెబుతున్నారు. విషాదం ఏమిటంటే.. రైతులకు బహుళజాతి కంపెనీల నుంచి ఓ రకమైన ప్రమాదం ఏర్పడినట్లు స్పష్టం చేస్తున్న ఈ ఘటనను.. తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. రేపు పెప్సీ కో.. తెలుగు రాష్ట్రాల రైతులపై దావాలు వేసినా ఆశ్చర్యం లేదు. ఇది.. ఒక్క గుజరాత్ రైతుల సమస్య కాదు. ఇప్పుడు… పెప్సీకోకు అనుకూలంగా తీర్పు వస్తే… అది అనేక రకాల సమస్యలకు కారణం అవుతుంది. పండించే ప్రతి పంటలో… మేథోసంపత్తి హక్కుల పేరుతో కంపెనీలు రైతులపై దావా వేసిన ఆశ్చర్యం ఉండదు. రైతులను బెదిరించడానికే పెప్సీకో ఈ పని చేస్తోంది. ఈ బెదిరింపులకు పాల్పడుతున్న లేస్ చిప్స్ ను బహిష్కరించాలి. ఇంకా అదే స్టాండ్ పై ఉంటే.. పెప్సీకో ఉత్పత్తులను బహిష్కరించాలి. న్యాయపోరాటం విషయంలో… ఆ రైతులకు సాయం అందాలి. ఇప్పుడే దీన్ని ప్రశ్నించకపోతే.. రైతులు సాగు చేసే హక్కును కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.