రివ్యూ: గ‌రుడ‌వేగ‌

తెలుగు360.కామ్ రేటింగ్ : 3/5

రాజ‌శేఖ‌ర్ క‌మ్‌బ్యాక్ కోసం ఎప్ప‌ట్నుంచో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. యాంగ్రీ మేన్ త‌ర‌హా పాత్ర‌లే కాకుండా… కుటుంబ క‌థ‌ల్లోనూ చ‌క్క‌గా ఇమిడిపోయే ఆయ‌నకి ఈమ‌ధ్య కాలంలో ఏదీ క‌లిసిరాలేదు. కానీ ప‌ట్టువ‌ద‌ల‌కుండా ప్ర‌య‌త్నాలు చేస్తూనే వ‌చ్చారు. మ‌రోసారి త‌న‌కి అల‌వాటైన పోలీసు అధికారి క‌థ‌నే న‌మ్మి `గ‌రుడ‌వేగ‌` చేశాడు. ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారుకి ఈ జోన‌ర్ పూర్తిగా కొత్త‌. కానీ ఆయ‌న ప‌నిత‌నంపై విశ్వాసంతో రాజ‌శేఖ‌ర్ చేతులు క‌లిపారు. ఈ క‌ల‌యిక గురించి పెద్ద‌గా అంచ‌నాలు లేక‌పోయినా… టీజ‌ర్ అంద‌రిలోనూ ఆస‌క్తిని రేకెత్తించింది. ట్రైల‌ర్ త‌ర్వాత సినిమాపై అంచ‌నాలు ఏర్ప‌డాయి. మ‌రి ఆ అంచ‌నాల‌కి త‌గ్గ‌ట్టుగానే సినిమా ఉందా? రాజ‌శేఖ‌ర్‌కి క‌మ్‌బ్యాక్ సినిమా అయిన‌ట్టేనా?

* కథ‌

చంద్ర‌శేఖ‌ర్ (రాజ‌శేఖ‌ర్‌) నేష‌న‌ల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఎన్‌.ఐ.ఎ)లో ఓ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్‌. విధి నిర్వ‌హ‌ణలో ప‌డి త‌న కుటుంబాన్ని కూడా నిర్ల‌క్ష్యం చేస్తుంటాడు. అది స‌హించ‌లేని భార్య స్వాతి (పూజాకుమార్‌) విడిపోవాల‌ని నిర్ణ‌యించుకొంటుంది. దాంతో చంద్ర‌శేఖ‌ర్ త‌న ఉద్యోగానికి రాజీనామా చేస్తున్న‌ట్టు ఆఫీసులో చెప్పి ఇంటికి బ‌య‌ల్దేర‌తాడు. ఇంత‌లోనే ఇద్ద‌రు అనుమానాస్ప‌ద వ్య‌క్తులు తార‌స‌ప‌డ‌తారు. వాళ్లెవ‌రని ఆరా తీస్తున్న క్ర‌మంలో పాత‌బ‌స్తీలో బాంబ్ బ్లాస్ట్ ప్లాన్‌తో పాటు, నిరంజ‌న్ (అరుణ్ ఆదిత్‌) అనే ఓ టెకీ బ‌య‌టికొస్తాడు. నిరంజ‌న్ త‌న ద‌గ్గ‌రున్న స‌మాచారాన్ని ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు ప్ర‌తాప్‌రెడ్డి (పోసాని కృష్ణ‌ముర‌ళి) ప‌ది కోట్ల‌కి అమ్మాల‌నుకొన్న విష‌యం చంద్ర‌శేఖ‌ర్ తెలుసుకుంటాడు. అస‌లు ఈ నిరంజ‌న్ ఎవ‌రు? అత‌ని ద‌గ్గ‌రున్న స‌మాచారం ఏమిటి? మ‌రి అది ప్ర‌తాప్‌రెడ్డికి చేరిందా లేదా? ఈ వ్యవ‌హారంలో జార్జ్‌(కిశోర్) పాత్ర ఏమిటి? త‌దిత‌ర విష‌యాల‌తో మిగ‌తా సినిమా సాగుతుంది.

విశ్లేష‌ణ‌

సినిమా పేరునుబ‌ట్టి చూస్తే ఇదొక సీక్రెట్ మిష‌న్ పేరులా అనిపిస్తుంది. అది నిజం కూడా. అయితే రాజ‌శేఖ‌ర్ కుటుంబం కూడా ఈ సినిమాని రాజ‌శేఖ‌ర్ క‌మ్‌బ్యాక్ మిష‌న్‌గా భావించి చేసింది. దానికి నేతృత్వం వ‌హించిన ప్ర‌వీణ్ స‌త్తారు విజ‌య‌వంతంగా మిష‌న్‌ని పూర్తి చేసిన‌ట్టే అని చెప్పొచ్చు. ప‌లు ఎన్‌.ఐ.ఎ ఆప‌రేష‌న్ల నేప‌థ్యంలో ఒక స్లిక్ యాక్ష‌న్ సినిమాగా తీర్చిదిద్దాడు. విజువ‌ల్స్ సినిమా స్థాయిని పెంచ‌డంతో పాటు, ఫీల్‌కి ప్రాణం పోశాయి. జార్జియా ఎపిసోడ్‌తోనే సినిమా ఆరంభ‌మ‌వుతుంది. అక్క‌డ డ్యామ్‌పై వ‌చ్చే స‌న్నివేశాలు, బైక్ ఛేజింగ్ ఎపిసోడ్ ఆక‌ట్టుకొంటాయి. నేరుగా క‌థ‌లోకి వెళ్లిన ద‌ర్శ‌కుడు ఫ‌స్ట్‌హాఫ్ సినిమాని మంచి ట్విస్టుల‌తో, ఆద్యంతం ఆక‌ట్టుకునేలా తీశాడు. ఒక కేసుని ప‌రిశోధించ‌డ‌మ‌నే ప్ర‌క్రియ ఎప్పుడూ ఆస‌క్తిగానే ఉంటుంది. వాటిలో ఎత్తులు పైఎత్తులు, మైండ్‌గేమ్ వంటివ‌న్నీ ఉంటాయి. వాటిపై ద‌ర్శ‌కుడు ప‌క్కాగా దృష్టిపెట్ట‌డంతో చాలా వ‌ర‌కు స‌న్నివేశాలు థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి.

క‌థ పాత‌బ‌స్తీకి మారిన త‌ర్వాత క‌థ‌లో మ‌రింత క్యూరియాసిటీ క్యారీ అయింది. అక్క‌డ బాంబ్‌ని నిర్వీర్యం చేయ‌డం, నిరంజ‌న్‌ని ప‌ట్టుకోవ‌డం వంటి స‌న్నివేశాలు చాలా బాగుంటాయి. ఇంట‌ర్వెల్ ఎపిసోడ్‌లో భాగంగా వ‌చ్చే ఆ స‌న్నివేశాలు సినిమా స్థాయినే పెంచేశాయి. అయితే ఆ త‌ర‌హాలో ద్వితీయార్థాన్ని తీర్చిదిద్ద‌డంలో ద‌ర్శ‌కుడు విఫ‌ల‌మ‌య్యాడు. మామూలు తెలుగు యాక్ష‌న్ క‌థ‌లాగా ద్వితీయార్థం సాగుతాయి. ప‌తాక స‌న్నివేశాల కోసం వాడిన స‌ముద్రం నేప‌థ్యం కొత్త‌గా అనిపిస్తుంది కానీ… అక్క‌డ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌పై మాత్రం ప్ర‌భావం చూపించ‌వు. జార్జ్ ఓ న‌రరూప రాక్ష‌సుడు అంటూ ప్ర‌చారం చేసిన చిత్ర‌బృందం ఆ పాత్ర‌ని ఆ స్థాయిలో తీర్చిదిద్ద‌లేక‌పోయారు. దాంతో విల‌నిజం అంత‌గా పండ‌లేదు. తొలి సగ భాగంలో ప్ర‌శ్న‌లన్నింటికీ ద్వితీయార్థంలో స‌మాధానాలు చెబుతూ సినిమాని న‌డిపించాడు ద‌ర్శ‌కుడు. నిరంజ‌న్ ద‌గ్గ‌రున్న స‌మాచారం గురించి తెలిశాక క‌థ మ‌రింత ఆస‌క్తిగా మారుతుంద‌నుకొంటే, ఆ స‌మాచారం గురించి తెలిసే క్ర‌మం, ఆ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల్ని కాస్త బోర్ కొట్టిస్తాయి. రాజ‌శేఖ‌ర్ మాత్రం ఎక్కువ త‌క్కువ‌లు కాకుండా క‌థ‌కి ఎంత కావాలో అంతే చేశారు. తెర‌పై ఒక నిజ‌మైన ఎన్‌.ఐ.ఎ అధికారిగానే క‌నిపించాడు.

న‌టీన‌టుల

రాజ‌శేఖ‌ర్ న‌ట‌నే సినిమాకి హైలెట్‌. ఆయ‌నలోని ఒక‌ప్ప‌టి యాంగ్రీమేన్ ఈ సినిమాతో మ‌రోసారి క‌నిపించాడు. పైగా పాత్ర‌కి ఎంత కావాలో అంతే చేస్తూ.. తెర‌పైన నిజ‌మైన ఓ ఎన్‌.ఐ.ఎ అధికారిని చూస్తున్నామ‌న్న భావ‌న క‌ల‌గ‌జేశాడు. కుటుంబ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాల్లోనూ చ‌క్క‌గా ఒదిగిపోయాడు. పూజాకుమార్ ప‌ర్వాలేద‌నిపించింది. అయితే ఆమె తెలుగు డైలాగులు చెప్ప‌డంపై మ‌రికాస్త శ్ర‌ద్ధ పెట్టుంటే బాగుండేది. ర‌వివ‌ర్మ‌, చ‌ర‌ణ్‌దీప్‌లు ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల్లో మెరిశారు. కిశోర్ పాత్ర ప‌రిధి పెంచ‌క‌పోవ‌డం సినిమాకి మైన‌స్స్ అని చెప్పాలి. అలీ, థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ అక్క‌డ‌క్క‌డ న‌వ్వులు పంచారు. అదిత్ అరుణ్‌కి మంచి పాత్ర ద‌క్కింది. త‌న న‌ట‌న కూడా బాగుంది. పోసాని ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా అల‌రించాడు. స‌న్నీలియోన్ చేసిన ప్ర‌త్యేక‌గీతం ఫ‌ర్వాలేద‌నిపిస్తుందంతే.

సాంకేతిక బృందం

టెక్నిక‌ల్ టీమ్ ప‌నితీరు గురించి చెప్పాలంటే మొద‌ట ద‌ర్శ‌కుడి నుంచే మొద‌లుపెట్టాలి. త‌న‌కో కొత్త జోన‌ర్ అయిన‌ప్ప‌టికీ ఎక్క‌డా త‌డ‌బాటు లేకుండా చాలా క్లారిటీగా సినిమాని తీర్చిదిద్దాడు. ప్లానింగ్ లేక‌పోతే ఇలాంటి సినిమాల్ని తీయ‌డం చాలా క‌ష్టం. క‌థ రాసుకొన్న విధానంలోనే కాకుండా… ఊహించిన స‌న్నివేశాల్ని తెర‌పైకి తీసుకొచ్చే విష‌యంలో ఆయ‌న చూపిన ప‌నిత‌నం అడుగ‌డుగునా క‌నిపిస్తుంటుంది. ప్ర‌థ‌మార్థంలా ద్వితీయార్థంలో క‌థ‌ని ఆస‌క్తిగా న‌డిపింటే మాత్రం ఈ సినిమా మ‌రోస్థాయికి వెళ్లేది. నిర్మాణ విలువ‌లు సినిమాకి ప్ల‌స్స‌య్యాయి. క‌థ‌లోని ఫీల్‌ని క్యారీ చేసేలా ఉంది సంగీతం. కెమెరా, ఎడిటింగ్ విభాగాల ప‌నిత‌నం కూడా మెచ్చుకోదగ్గ స్థాయిలో ఉంది. నైట్ ఎఫెక్ట్‌లో జార్జియా డ్యామ్‌పై నుంచి తీసిన స‌న్నివేశాలు మొద‌లుకొని ప‌తాక స‌న్నివేశాల వ‌ర‌కు కెమెరా ప‌నిత‌నం సూప‌ర్బ్ అనిపిస్తుంది.

ఫైన‌ల్ ట‌చ్ : ఫ‌స్ట్ హాఫ్ వ‌ర‌కు గరుడ‌వేగ‌మే…

తెలుగు360.కామ్ రేటింగ్ : 3/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.