రఘురామకృష్ణరాజు మత మార్పిడుల నిరోధం అనే అంశాన్ని తన రాజకీయ ఎజెండాలో ప్రధానాంశంగా మార్చుకుంటున్నారు. గతంలో ఎంపీగా ఉన్న సమయం నుంచే ఈ విషయంపై గళమెత్తిన ఆయన, ఇప్పుడు క్షేత్రస్థాయిలో హిందూ ధర్మ రక్షణ, మత మార్పిడుల అడ్డుకట్ట దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. పెదపాడు రామాలయ నిర్మాణ వివాదం ఆయనకు మంచి అవకాశంగా మారింది. ఈ ఆలయ నిర్మాణాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
మత మార్పిడి మాఫియాపై సమరం
రాష్ట్రంలో వ్యవస్థీకృతంగా జరుగుతున్న మత మార్పిడులను రఘురామకృష్ణరాజు మాఫియాగా అభివర్ణిస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా పేదరికాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సాగుతున్న మార్పిడులపై ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉండి నియోజకవర్గంలో ఆయన ప్రారంభించిన ఈ పోరాటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్త చర్చకు దారితీసింది. మత మార్పిడులకు పాల్పడే వారిని చట్టపరంగా ఎదుర్కోవడమే కాకుండా, సామాజికంగా వారిని నిలదీయాలని ఆయన పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు పాస్టర్లు ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఆయన తన మరింత గట్టిగా ముందుకెళ్తున్నారు.
మత మార్పిడి నిరోధక చట్టం – ప్రభుత్వంపై ఒత్తిడి
ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా మత మార్పిడి నిరోధక చట్టం తీసుకురావాలనే డిమాండ్‌ను రఘురామకృష్ణరాజు బలంగా వినిపిస్తున్నారు. బలవంతపు, ప్రలోభాలకు గురిచేసి చేసే మత మార్పిడులను అరికట్టేందుకు కఠినమైన చట్టం అవసరమని ఆయన వాదిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న ఆయన, రాబోయే రోజుల్లో అసెంబ్లీ వేదికగా, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఈ చట్టం దిశగా అడుగులు వేయించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
రాజకీయ సమీకరణాలు
రఘురామకృష్ణరాజు తీసుకుంటున్న ఈ ధార్మిక నిర్ణయాలు రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తున్నాయి. హిందూ ఓటు బ్యాంకును ఏకీకృతం చేయడంలో ఆయన పోషిస్తున్న పాత్ర కూటమికి కలిసొచ్చే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు. దేవాలయాల పరిరక్షణ, ధర్మ ప్రచారం వంటి అంశాలను ఎత్తుకోవడం ద్వారా ఆయన ఒక బలమైన హిందూత్వ వాది గా తన ముద్రను స్థిరపరుచుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఎదుర్కొంటున్న వ్యతిరేకతను సైతం తన రాజకీయ బలంగా మార్చుకోవడంలో ఆయన విజయవంతమవుతున్నారు. మత మార్పిడుల అంశం ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడూ సున్నితమైనదే. ఆయన ఉండిలో ప్రారంభించిన పోరాటం .. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తమవుతోంది. ఎన్నికల నాటికి అది ఎన్నికల ఇష్యూ అయితే ఆయన ప్లాన్ సక్సెస్ అయినట్లే.
