అధ్యక్షుడి లేని కాంగ్రెస్‌కి రాహులే టాస్క్ మాస్టర్..!

రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కానీ నాడు అధ్యక్షుడిగా తాను ప్రారంభించిన కార్యక్రమాల విషయంలో మాత్రం ఎలాంటి ఉదాసీనతను ప్రదర్శించడం లేదు. చివరకు ఆర్సెస్సెస్ – బీజేపీ కలిసి తనపై దాఖలు చేసిన 20 పరువు నష్టం దావాలకు సంబంధించి వ్యక్తిగతంగా కోర్టులకు హాజరవుతున్నారు. ముంబై, పట్నా, అహ్మదాబాద్ అన్ని చోట్ల ఆయన కోర్టులకెళ్లారు. ఓటమి తర్వాత రాహుల్ మాట్లాడిన మాటలు కూడా ఒంటి చేత్తో మళ్లీ పార్టీని నడిపిస్తానన్న ధోరణిని బైటపెట్టాయి. ఆరెస్సెస్ – బీజేపీపై తాను ఒంటరి పోరాటం సాగించానని రాహుల్ చెప్పుకున్నారు. గతం కంటె పది రెట్లు ఎక్కువగా పార్టీ కోసం పనిచేస్తానని చెప్పడం ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా వారికి సరికొత్త అనుమానాలను కూడా కలిగించారు. నిజానికి రాహుల్ వైదొలిగారా., లేక ఊరికే అలా చెబుతున్నారా అని సామాన్య కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

కొత్త అధ్యక్షుడు ఎనరైనా సరే పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రయత్నించాల్సిందేనని వాదిస్తున్న వారే.. ఎలాగూ తెరవెనుక మంత్రాంగం నడిపేది గాంధీలే కదా అని చెబుతున్నారు. ముగ్గురు గాంధీలు లేని నాయకత్వంపై ఇలాంటి చర్చే కొనసాగుతోందని విశ్లేషణలు కూడా వినిపిస్తున్నారు. సోనియా, రాహుల్, ప్రియాంక ముగ్గురు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నప్పుడు కొత్త నాయకుడికి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఉంటుందా అనేది కూడా పెద్ద ప్రశ్నే. ఎందుకంటే గాంధీల కుర్చీలో కూర్చునేందుకు కొందరు పాత తరం నాయకులు వెనుకాడుతున్నారు. ఎలాగూ గాంధీలు చెప్పిన మాట వినాల్సిందే కదా…అలాంటి సందర్భాల్లో మనకెందుకా పదవి అంటూ మరికొందరు వెనుకాడుతున్నారు. సాధారణ కార్యకర్తలమని చెప్పుకుంటూనే రాహుల్, ప్రియాంకా క్రియాశీల పాత్ర పోషిస్తారని, పెత్తందారీతనాన్ని వదిలిపెట్టుకోబోరని పార్టీ నేతల అనుమానం.పైగా కొత్త నాయకుడు సొంత నిర్ణయాలు ప్రారంభిస్తే గాంధీలకు ఆయనకు మధ్య సంఘర్షణ ఖాయమన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

గాంధీ కుటుంబ నాయకత్వం లేకపోతే ఏమవుతుందో కూడా పార్టీలో కొందరు పెద్దలకు బాగానే తెలుసు. సామంత రాజులుగా మౌనంగా పనిచేసుకుపోతున్న ప్రాంతీయ నేతలు స్వాతంత్రాన్ని ప్రకటించుకునే అవకాశం ఉంది. అందుకే వాళ్లు సీనియర్ నేతలు కావాలంటూ ప్రచారం ప్రారంభించారని పార్టీలోనే కొందరు వాదిస్తున్నారు. ఇలాంటి రాజీ ధోరణులకు దూరంగా ఉండాలనే రాహుల్ రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు. ఆ సంగతి అర్థమైన వాళ్లు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com