ఏపీ హోదాపై తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో రాహుల్ ప్ర‌క‌ట‌న‌..!

తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ హైద‌రాబాద్ వచ్చారు. శేర్లింగంప‌ల్లిలో ఏర్పాటుచేసిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఏపీ ప్ర‌త్యేక హోదా గురించి ఆయ‌న ప్రత్యేకంగా ప్ర‌స్థావించారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విభ‌జ‌న సంద‌ర్భంగా ఏపీ, తెలంగాణ‌కు ఇచ్చిన హామీల‌న్నింటినీ వెంట‌నే పూర్తి చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఎవ‌రున్నా.. ఈ రెండు రాష్ట్రాల‌కు ఇస్తామ‌న్న‌వి ఇచ్చి తీరాల్సి ఉంద‌నీ, కానీ ఆ పని మోడీ స‌ర్కారు చెయ్య‌లేక‌పోయింద‌ని విమ‌ర్శించారు.

ఆంధ్రాకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని మొదటిసారిగా ప్ర‌తిపాదించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు రాహుల్ గాంధీ. మిగ‌తా పార్టీలేవీ ముందుగా హోదా గురించి మాట్లాడలేద‌న్నారు. ఆంధ్రాకు ఇచ్చిన మాట‌ను తాము నెర‌వేరుస్తామ‌నీ, అది ఆంధ్రుల హ‌క్కు అని అభిప్రాయ‌ప‌డ్డారు. భార‌త ప్ర‌భుత్వం ఆంధ్రాకి కొన్ని హామీలు ఇచ్చింద‌నీ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ‌తోపాటు ఆంధ్రాకి పెండింగ్ ఉన్న అన్ని హామీలూ పూర్తి చేస్తుంద‌ని ఒకటికి రెండుసార్లు స్ప‌ష్టం చేశారు. తాను దాదాపు ప‌దేళ్ల‌కు పైగా రాజ‌కీయాల్లో ఉంటున్నాన‌నీ, ఆచ‌ర‌ణ సాధ్యం కాని హామీలు ఎప్పుడూ ఇవ్వ‌లేద‌నీ, ఇచ్చిన హామీకి క‌ట్టుబ‌డి ఉంటున్నాన‌ని రాహుల్ చెప్పారు. మోడీ పెద్దపెద్ద మాట‌లు మాట్లాడ‌తార‌నీ, తాను నేరుగా క‌ళ్ల‌లోకి చూస్తే, ఆయ‌న దిక్కులు చూస్తుంటార‌నీ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. సూటుబూటు వేసుకున్న‌వారికే మోడీ పాల‌న‌లో న్యాయం జ‌రిగింద‌నీ, బ్యాంకుల‌ను దోచుకున్న‌వారికే రుణ‌మాఫీలు ఇచ్చారంటూ మ‌రోసారి విమ‌ర్శించారు.

ఏపీ ప్ర‌త్యేక హోదా విష‌య‌మై కాంగ్రెస్ పార్టీ ఈ మ‌ధ్య స్ప‌ష్ట‌మైన వైఖ‌రే తీసుకుంది. గ‌డ‌చిన పార్ల‌మెంటు స‌మావేశాల స‌మ‌యంలో కూడా రాహుల్ ఇదే హామీ ఇచ్చారు, తాము అధికారంలోకి రాగానే తొలి సంత‌కం ఏపీ స్పెట‌స్ ఫైల్ మీదే ఉంటుంద‌న్నారు. అయితే, ఈ టాపిక్ మీద తెలంగాణ‌లో మాట్లాడ‌టం వెన‌క వ్యూహం కూడా తెలిసిందే. సెటిల‌ర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో.. వారిని ఆక‌ర్షించ‌డం కోసం హోదా టాపిక్ రాహుల్ తీసుకొచ్చార‌నీ అనుకోవ‌చ్చు. ప‌నిలోప‌నిగా.. ఇప్పుడిప్పుడే ఆంధ్రాలో బ‌లోపేతం కోసం కొత్త ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టిన రాష్ట్ర కాంగ్రెస్ కి కూడా ఈ వ్యాఖ్య‌లు కొంత బూస్ట్ ఇచ్చేందుకు ఉప‌యోగ‌ప‌డే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com