గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజకీయ ప్రస్థానం మళ్లీ సొంత గూటికి చేరే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. గతంలో పార్టీ రాష్ట్ర నాయకత్వంతో విభేదించి, ఆవేశంతో రాజీనామా చేసిన ఆయన.. ఇప్పుడు తన తప్పును సరిదిద్దుకుని మళ్లీ కమలం గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఆవేశం వెనక్కి.. క్రమశిక్షణ ముందుకు
గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజాసింగ్ తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే, ఆ సమయంలో పార్టీ ఆయనను బుజ్జగించకుండా తక్షణమే రాజీనామాను ఆమోదించి షాక్ ఇచ్చింది. దాదాపు ఎనిమిది నెలలుగా రాజకీయంగా ఏకాకి అయిన రాజాసింగ్, ఇటీవల తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ద్వారా ఢిల్లీలోని అగ్రనేతలకు రాయబారం పంపినట్లు సమాచారం. యోగితో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా, ఆయన సిఫార్సుతోనే ఢిల్లీ పెద్దలు రాజాసింగ్‌ను మళ్లీ చేర్చుకోవడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
బీజేపీ విధించిన గోషామహల్’ కండిషన్
అయితే, ఈసారి రాజాసింగ్ రాకకు బీజేపీ అధిష్టానం కొన్ని కఠినమైన షరతులు విధించినట్లు తెలుస్తోంది. “గోషామహల్ నియోజకవర్గ అభివృద్ధి, స్థానిక సమస్యలకే పరిమితం అవ్వాలి.. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగానో లేదా ఇతర వివాదాస్పద అంశాలపై అనవసర వ్యాఖ్యలు చేయకూడదు అనేదే ఆ ప్రధాన షరతు. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర నాయకత్వంపై పబ్లిక్‌గా విమర్శలు చేయకూడదని, కేవలం తన నియోజకవర్గానికే ప్రాధాన్యత ఇవ్వాలని హైకమాండ్ గట్టిగా చెప్పినట్లు సమాచారం. ఈ షరతులకు రాజాసింగ్ కూడా అంగీకరించడంతోనే ఆయన రీ-ఎంట్రీకి మార్గం సుగమమైందని తెలుస్తోంది.
ఇతర పార్టీల నో ఎంట్రీ
రాజాసింగ్ బీజేపీని వీడిన తర్వాత ఇతర పార్టీల్లో చేరాలని ప్రయత్నించినా, ఆయనకున్న కరుడుగట్టిన హిందుత్వ ఇమేజ్ వల్ల ఎవరూ సాహసించలేదు. చివరకు తన మనుగడ కోసమైనా, తన అస్తిత్వం కోసమైనా బీజేపీయే సరైన వేదిక అని ఆయన గుర్తించారు. రాజాసింగ్ ఇప్పుడు తగ్గేదేలే అన్నట్లు కాకుండా, పార్టీ గీసిన గీత దాటను అనే హామీతో వెనక్కి వస్తున్నారు. అయితే, ఢిల్లీ పెద్దలు విధించిన షరతుల ప్రకారం ఆయన తన దూకుడును ఎంతవరకు నియంత్రించుకుంటారనేది ఆసక్తికరం.


