తన మంత్రి పదవిని అడ్డుకుంటున్నది రేవంత్ రెడ్డేనని గట్టి అభిప్రాయంతో ఉన్న రాజగోపాల్ రెడ్డి ఎవరేం చెప్పినా.. చూశారా.. తనకు అడ్డుపడుతుంది ముఖ్యమంత్రేనని చెప్పి నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా భట్టి విక్రమార్క్ ఓ టీవీ చానల్ కు ఇంటర్యూ ఇచ్చారు. అందులో యాంకర్ రాజగోపాల్ రెడ్డి గురించి అడిగారు. అప్పుడు భట్టి నిజమే.. ఆయనకు మంత్రి పదవి ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చింది.. కానీ కొన్ని సామాజిక సమీకరణాల వల్ల ఇవ్వలేకపోయాం అని చెప్పారు. ఆ పేపర్ కటింగ్‌ను ట్వీట్ చేసిన రాజగోపాల్ రెడ్డి.. ఇందులో ఎక్కడా రేవంత్ అంశం లేకపోయినా తీసుకు వచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు మంత్రి పదవి ఇస్తామన్న హామీని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్య నేతలు అడ్డుకుంటూ, అవమానిస్తున్న వాస్తవాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించిన మీకు ధన్యవాదాలు అని భట్టి గురించి ట్వీట్ చేశారు. నిజమా.. భట్టి అలా అన్నారా అని చాలా మంది పేపర్ కటింగ్ చదివారా.. ఎందుకైనా మంచిదని ఆ వీడియో ఇంటర్యూ చూశారు. కానీ ఎక్కడా ఆ మాట లేదు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం భట్టి తెలుగులో చెప్పిన మాటల్ని అలాగే అర్థం చేసుకుని ట్వీట్ చేశారు.
పైగా తన కు మంత్రి పదవి ముఖ్యం కాదు. ప్రజలు తమకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు అమలు చేయాలని, అవినీతి రహిత పాలన అందించాలని కోరుతున్నారు. తెలంగాణ సమాజ ఆకాంక్షలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉండాలని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చారు. తనకు మంత్రి పదవి ఇస్తేనే అవన్నీ చేసినట్లని.. లేకపోతే లేదని ఆయన అలా కవరింగ్ చేశారన్నమాట. రాజగోపాల్ రెడ్డి స్టైలే వేరు.