ఎస్.ఎస్.రాజమౌళి దగ్గర ఓ కంప్లైంట్ ఉంది. ఆయన అమర శిల్పి జక్కన్న టైపు. సినిమాల్ని చెక్కుతూపోతుంటారు. అందుకే ఏ సినిమా కూడా ఓ పట్టాన పూర్తవదు. ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆ ప్రభావం రిలీజ్ డేట్ పై పడుతుంది. అనుకొన్న సమయానికి సినిమాలు రిలీజ్ అవ్వవు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులూ ఇవన్నీ పెండింగ్ లో పడుతుంటాయి. అభిమానులకు ఈ విషయంలో చాలా అసహనం ఉంటుంది. ‘బాహుబలి’, ‘ఆర్.ఆర్.ఆర్’ లాంటి సినిమాలు ఆలస్యం అవ్వడానికి కారణం ఇదే.
అయితే ‘వారణాసి’ విషయంలో మాత్రం రాజమౌళి సూపర్ ఫాస్ట్ గా వర్క్ చేస్తున్నారు. 2027లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఏప్రిల్ 27న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. రాజమౌళి సినిమా అంటే రిలీజ్ డేట్ అటూ ఇటూ మారుతూ ఉంటుంది. కాకపోతే ఈసారి ఆ ఛాన్స్ లేదు. అంత ప్రీ ప్లాన్డ్ గా వర్క్ చేస్తున్నారు రాజమౌళి. ఇప్పటికి 80 శాతం షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. ఈ యేడాది చివరి నాటికి ఫస్ట్ కాపీ కూడా చేతికి వచ్చేస్తుందని తెలుస్తోంది. మరోవైపు వీఎఫ్ఎక్స్ కి సంబంధించిన పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి.
సాధారణంగా వీఎఫ్ఎక్స్ విషయంలో సినిమాలు లేట్ అవుతుంటాయి. ఈ విషయం గ్రహించిన రాజమౌళి ‘వారణాసి’తో రాజమౌళి తన పంథా మార్చారు. ముందు వీఎఫ్ఎక్స్ అవసరమైన సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఆ సీన్లు అవ్వగానే వీఎఫ్ఎక్స్ స్టూడియోలకు అప్పగించారు. అవన్నీ ఎప్పటికప్పుడు వీఎఫ్ఎక్స్ పూర్తి చేసేశాయి. దాంతో కరక్షన్లకు కావల్సినంత సమయం దొరికింది. ఇప్పుడు తెరకెక్కిస్తున్నవన్నీ వీఎఫ్ఎక్స్ అవసరం లేని సన్నివేశాలే. అందుకే రిలీజ్ డేట్ మారే ప్రసక్తే లేదు.
ప్రస్తుతం హైదరాబాద్ లోని శంకర పల్లిలో తీర్చిదిద్దిన ఓ సెట్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ అవ్వగానే టీమ్ బ్రేక్ తీసుకుంటుంది. మహేష్ 15 రోజుల పాటు విదేశాలకు వెళ్తారు. రాజమౌళి కూడా తన ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్ వేయబోతున్నారు. వచ్చాక.. లాస్ట్ షెడ్యూల్ మొదలు కానుంది.
