బాడీ డబుల్… ఈమధ్య తరచూ వినిపిస్తున్నమాట. ప్రతీ హీరోకీ ఓ డూప్ ఉండడం, రిస్కీ షాట్స్ అన్నీ తనతోనే లాగించేయడం, ఆ తరవాత హీరో క్లోజప్స్ తో సీన్ మ్యాచ్ చేయడం… ఈ తతంగం ఈమధ్య బాగా జరుగుతోంది. తెరపై కనిపిస్తోంది హీరోనా? ఆయన డూపా? అనే విషయం ప్రేక్షకులూ తేల్చుకోలేకపోతున్నారు. అసలు బాడీ డబుల్ తోనే సగం సినిమాలు తీసేస్తున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. హీరోలు కూడా మాకు బాడీ డబుల్ ఉంటే తప్పేంటి? అన్నట్టే మాట్లాడుతున్నారు.
అయితే… రాజమౌళి మాత్రం `బాడీ డబుల్` అనే విధానానికి స్వస్తి పలికే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనూ భారీ యాక్షన్ సీన్లు ఉన్నాయి. వాటన్నింటిలోనూ మహేష్ మాత్రమే కనిపించాలన్నది రాజమౌళి తాపత్రయం. హీరో కోసం అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకొంటూ, ఆయా సన్నివేశాల్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగితే, బాడీ డబుల్ అవసరం లేదన్నది రాజమౌళి మాట. అందుకు మహేష్ ని కూడా ఒప్పించాడని, ఈ సినిమాలోని ప్రతీ సీన్లో.. ప్రతీ షాట్ లో మహేష్ మాత్రమే కనిపించబోతున్నాడని తెలుస్తోంది.
నిజానికి ఇది మంచి పరిణామం. అభిమానులు టికెట్ కొనేది తమ హీరోల్ని తెరపై చూడాలని. వాళ్ల డూప్‌ల కోసం కాదు. హీరోలు కూడా కష్టపడి, రిస్క్‌లు చేస్తే – ఫ్యాన్స్ మరింత థ్రిల్ ఫీల్ అవుతారు. ఆ హీరోలకూ సంతృప్తి ఉంటుంది. మరి ఇదే విధానం మిగిలిన హీరోలూ ఫాలో అవుతారో, లేదో చూడాలి.