పార్ట్ 2, సీక్వెల్ జాడ్యం ఇండియన్ సినిమాని పట్టి పీడిస్తోంది. ప్రతీ ప్రాజెక్ట్ ‘టు బి కంటిన్యూడ్’ అంటూ ఓ ఎండ్ కార్డ్ వేసుకొంటోంది. అయితే ఎస్.ఎస్.రాజమౌళి మాత్రం ఈ హంగామాకు దూరం. `బాహుబలి`తో సీక్వెల్ మొదలు పెట్టింది ఆయనే. అప్పటి నుంచే పార్ట్ 2 దందా మొదలైంది. కాకపోతే బాహుబలి స్పెషల్. ఓ కథని ఆయన రెండు భాగాలుగా చేశారు. ఓ సినిమాని కాదు. ఒక భాగంలో కథంతా చెప్పడానికి కుదరదు కాబట్టి పార్ట్ 2ని ఎంచుకొన్నారు. పార్ట్ 1 కంటే పార్ట్ 2నే ఎఫెక్టీవ్ గా తీయగలిగారు. ఆ తరవాత ఎప్పుడూ పార్ట్ 2 గురించి కానీ, సీక్వెల్ గురించి కానీ మాట్లాడలేదు. ఈగ 2 చేస్తానని చాలా సందర్భాల్లో చెప్పారు రాజమౌళి. కానీ దాన్ని ఎప్పుడో పక్కన పెట్టేశారు. ఆర్.ఆర్.ఆర్ కీ రెండో భాగం ఉంటుంది అనుకొన్నారు. కానీ రాజమౌళి మాత్రం ఆ ఊసెత్తలేదు.
ఇప్పుడు ‘వారణాసి’ కూడా సింగిల్ పార్టే. ఈసినిమాని రెండు భాగాలుగా విడుదల చేస్తారని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ వార్తలకు రాజమౌళి చెక్ పెట్టారు. ఈసినిమాని ఒక పార్ట్ గానే విడుదల చేస్తామని ప్రకటించారు. కాకపోతే రన్ టైమ్ మాత్రం 3 గంటలు. రాజమౌళి, మహేష్ బాబు సినిమా 3 గంటలు తీస్తే.. చూడ్డానికి ప్రేక్షకులు రెడీనే. కాబట్టి రన్ టైమ్ పెద్ద ఇబ్బంది కాదనే అనుకోవాలి.
పార్ట్ 2, సీక్వెల్ అంటే చెప్పిన కథనే మరో కోణంలో చెప్పడం. లేదంటే ఆ క్యారెక్టర్ని, ఆ కథని పొడిగించడం. ఇవి రాజమౌళికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన దగ్గర చెప్పాలనుకొన్న కథలు, చూపించాలనుకొన్న అద్భుతాలు చాలా ఉన్నాయి. సీక్వెల్ కి బదులు ఓ కొత్త కథ చెప్పడం ఎప్పుడూ బాగుంటుంది. రాజమౌళి కూడా ఆ దిశగానే ఆలోచిస్తున్నారనుకోవాలి.
