ఇండియన్ క్రికెటర్ ఎం.ఎస్. ధోనీ జీవిత కథతో తెరకెక్కుతున్న‘ధోనీ’ సినిమా తెలుగు వెర్షన్ కోసం చేస్తున్న ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఆడియో రిలీజ్ ప్రోగ్రాం చూస్తూ ఉన్నప్పుడు ‘ఎంతవారుగానీ….భజనదాసులే’ అని కూడా ఓ పాట రాసెయ్యొచ్చనిపించింది. ఎం.ఎస్.ధోనీ, రాజమౌళీలు ఇద్దరూ అద్భుత విజయాలు సాధించినవాళ్ళే. వాళ్ళిద్దరూ కూడా భజన తక్కువ, విషయం గురించి ఎక్కువగా మాట్లాడి ఉంటే ఇంకా గౌరవంగా ఉండేది. కానీ ధోనీని ఆకాశానికెత్తేయడం కోసం భారీ స్పీచ్ తయారు చేసుకున్నాడు రాజమౌళి. ఏకంగా కర్మయోగి అని సర్టిఫికెట్ ఇచ్చేశాడు. వచ్చే వరల్డ్ కప్‌లో కూడా ధోనీనే కెప్టెన్‌గా ఉంటాడని కన్ఫామ్ చేసేశాడు.
ఆ విషయం పక్కన పెడితే మహాభారతాన్ని తెరకెక్కించడమే తన డ్రీమ్ అని చెప్పుకునే రాజమౌళికి కర్మయోగి అంటే ఎవరో తెలుసా అన్న అనుమానం వచ్చేలా ఉంది ఆయన స్పీచ్. క్రికెట్లో ధోనీ ప్రావీణ్యం ఎంత అన్న విషయం పక్కన పెడితే డబ్బు సంపాదన విషయంలో మాత్రం ధోనీపైన అనేక బలమైన ఆరోపణలే వచ్చాయి. అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ కూడా అవినీతి విషయాల్లో ధోనీ పాత్రను ప్రశ్నించింది. అలాగే టీం సెలక్షన్ విషయాల్లో కూడా ధోనీ చేసిన రాజకీయాలు మామూలుగా లేవు. వ్యక్తిగత పేరు కోసం పాకులాడకుండా నిజాయితీగా టీం ఇండియా గెలుపు కోసం ఎంతో కష్టపడిన వి.వి.ఎస్. లక్ష్మణ్ లాంటి సీనియర్ ఆటగాడిని ధోనీ అవమానించాడు. చివరి స్టేజ్‌లో రిటైర్మెంట్ డెసిషన్ గురించి అప్పటి టెస్ట్ టీం కెప్టెన్ అయిన ధోనీతో డిస్కస్ చేయాలనుకున్నాడు లక్ష్మణ్. కోల్‌కతా టెస్ట్ ఇన్నింగ్స్‌తో భారత క్రికెట్ గతిని మార్చిన లక్ష్మణ్ ఫోన్కాల్కి స్పందించాలన్న మినిమం కామన్సెన్స్ కూడా ధోనీకి లేకుండా పోయింది. అదీ కర్మయోగి ధోనీ క్యారెక్టర్. అలాగే ఇండియన్ క్రికెటర్స్తోపాటు, ఫిట్‌గా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని ఆలోచించే ఎవ్వరూ కూడా కూల్ డ్రింక్స్ తాగమని ఎవ్వరినీ ప్రోత్సహించరు. కానీ యువతకు బోలెడన్ని సందేశాలు ఇస్తూ ఉండే మన ధోనీవారు మాత్రం డబ్బు కోసం ఏం చేయడానికైనా రెడీ అనేలా అన్ని రకాల కూల్ డ్రింక్స్‌ని ప్రమోట్ చేయడానికీ రెడీగా ఉంటారు.
ఇండియన్ క్రికెటర్స్ అందరిలోకి కూల్ డ్రింక్స్ యాడ్స్‌లో నటించడానికి నిరాకరించిన ఒకే ఒక్కడు, మన తెలుగు వాడు లక్ష్మణ్. కోట్లాది రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్నా… డాక్టర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన లక్ష్మణ్… కూల్ డ్రింక్స్ తాగమని యువతను ఎంకరేజ్ చేయడానికి ఇష్టపడలేదు. అలా చూస్తే అసలు సిసలు కర్మయోగిగా లక్ష్మణ్‌ని చెప్పుకోవచ్చేమో. డబ్బు కోసం, పేరు కోసం, టీం ఇండియాలో సుస్థిర స్థానం కోసం ఎలాంటి రాజకీయాలు చేయకుండా టీం ఇండియాను గెలిపించడం కోసమే క్రికెట్ ఆడాడు లక్ష్మణ్.
వికెట్ కీపింగ్, బ్యాటింగ్‌లలో మంచి టాలెంట్ ఉన్న క్రికెటర్ ధోనీ. కెప్టెన్‌గా కూడా రాణించాడు. అంత వరకూ ఒకె. అంతే కానీ కర్మయోగి, వీరాధి వీరుడు, యోధుడు లాంటి సినిమాటిక్ డైలాగ్స్‌తో భజన చేయాల్సినంత అవసరమైతే లేదు. రాగద్వేషాలకు అతీతుడేమీ కాదు. అలాగే మనవాడి డబ్బు సంపాదన, స్వార్థం గురించి కూడా ప్రపంచానికి తెలిసిన కథలే బోలెడున్నాయి. ఒక సాధారణ కుటుంబం నుంచి, అది కూడా వెనుకబడిన రాష్ట్రం నుంచి వచ్చి ఈ స్థాయి విజయాలు సాధించిన ధోనీ కచ్చితంగా అభినందనీయుడే. కానీ కర్మయోగి అని పిలిపించుకునే అర్హత మాత్రం ధోనీకి అస్సలు లేదు. ఆ విషయం పక్కన పెడితే రాజమౌళి భజనకు మురిసిపోయిన ధోనీ కూడా బాహుబలి-2 సినిమా కోసం నేను వెయిట్ చేస్తున్నానని చెప్పి ఆయనను ఖుషీ చేశాడు. వీళ్ళిద్దరి భజన విషయం పక్కన పెడితే అసలు ఈ సినిమా సెలబ్రిటీస్ గురించి, క్రికెట్ స్టార్స్ గురించి మరీ ఎక్కువ భజన చేసే అలవాటును మన మీడియా వారు కొంచెం తగ్గించుకుంటే కొన్ని కోట్ల మంది యువతకు మంచి చేసినవాళ్ళు అవుతారు.
ఇప్పుడు క్రికెట్ కూడా జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంతే. మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఆ ఎంటర్టైన్మెంట్కి దేశభక్తి ట్యాగ్‌ని తగిలించడం కాస్త తగ్గిస్తే దేశాభివృద్ధికి తోడ్పడిన వారవుతారు.