సోషల్ మీడియాలో రేకెత్తే పుకార్లు భలే వెరైటీగా ఉంటాయి. కొన్ని కొన్ని జనాలు గుడ్డిగా నమ్మేస్తారు కూడా. ‘రాజశేఖర్‌కి గోళీల ఫ్యాక్టరీ ఉంది’ అనేది కూడా చాలా కాలంగా సోషల్ మీడియాలో గట్టిగా సర్క్యులేట్ అవుతూ వస్తోంది. ఈ గోళీల ఫ్యాక్టరీ ద్వారా రాజశేఖర్ బాగా సంపాదిస్తున్నారని, అందుకే ఆయన సినిమాలు తగ్గించుకొన్నారని ప్రచారం జరిగింది. దీనిపై రాజశేఖర్ స్పందించారు.
”గోళీల ఫ్యాక్టరీ ద్వారా నెలకు మూడు కోట్ల ఆదాయం వస్తుందని అంతా అంటున్నారు. ఆ ఫ్యాక్టరీ ఎక్కడ ఉందో చెబితే వెళ్లి డబ్బులు తెచ్చుకొంటా…” అని సరదాగా నవ్వేశారు రాజశేఖర్. ”అసలు ఇప్పుడు గోళీలే ఎవరూ ఆడుకోవడం లేదు, అలాంటప్పుడు గోళీల ఫ్యాక్టరీ ఎందుకు పెట్టుకొంటారో నాకు అర్థం కాలేదు, చదువుకొన్నవాళ్లు కూడా అమాయకంగా మీకు గోళీల ఫ్యాక్టరీ ఉందా? అని అడుగుతున్నారు. నాకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు” అని క్లారిటీ ఇచ్చారు రాజశేఖర్. తాను ఎప్పుడూ ఎలాంటి వ్యాపారాల జోలికీ వెళ్లలేదని, సినిమాలు తీసి డబ్బులు పోగొట్టుకోవడం మాత్రం నిజం అని, భవిష్యత్తులో బాగా డబ్బులు సంపాదించినా, అప్పుడు కూడా సినిమాలు తీస్తానని, ఈసారి మాత్రం పోగొట్టుకొన్న చోటే సంపాదిస్తానని చెప్పుకొచ్చారు రాజశేఖర్. అలా.. చాలా కాలంగా ఉన్న గోళీల ఫ్యాక్టరీ పుకారుకి రాజశేఖర్ ఆన్సర్ చెప్పినట్టైంది. మరి ఆ పుకారు ఎలా పుట్టిందో.. ఎలా వ్యాప్తి చెందిందో?
