‘నేను మారిపోయాను.. ఇది వరకటిలా లేను’ అంటున్నారు రాజశేఖర్. ఇప్పుడాయన క్యారెక్టర్ యాక్టర్ గా టర్న్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ‘బైకర్’లో శర్వానంద్ తండ్రిగా నటిస్తున్నారు. ‘రౌడీ జనార్థన’ లో కూడా ఆయన విలన్ గా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇవి కాకుండా రెండు మూడు సినిమాలు చేతిలో ఉన్నాయి.
రాజశేఖర్ లాంటి నటుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాలన్న ఆలోచన మంచిదే. కొన్ని రొటీన్ రోల్స్ ఆయన రాకతో కొత్త కాంతిని సంతరించుకొంటాయి. మురళీ శర్మ, ప్రకాష్ రాజ్, రావు రమేష్…ఈ స్థాయి నటులు చేయగలిగే పాత్రలకు రాజశేఖర్ కొత్త ఆప్షన్ గా మారే అవకాశం వుంది. రాజశేఖర్ కంప్లీట్ విలన్ గా మారినా చూడ్డానికి బాగుంటుంది. ఇదివరకెప్పుడో ఆయన్ని క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలకు సంప్రదించారు. కానీ అప్పట్లో ఆయన ‘నో’ చెప్పారు. పైగా రాజశేఖర్ ని భరించడం కష్టం అన్నది టాలీవుడ్ జనాల మాట. ఆయన టైమ్ కి షూటింగ్ కి రారన్న కామెంట్లు గట్టిగా వినిపిస్తుంటాయి. కానీ ‘బైకర్’ విషయంలో నిర్మాతల్ని ఆయన ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదని తెలుస్తోంది. చెప్పిన టైమ్‌కి ఆయన సెట్లో వచ్చేసేవార్ట. ఈ మార్పు మున్ముందు కూడా కొనసాగితే మంచిదే. పైగా రాజశేఖర్ కూడా ‘నన్ను క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలకు తీసుకోండి’ అని మీడియా ముఖంగానే అడిగేస్తున్నారు. సో… ఆయన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త పాత్రలు సృష్టించుకోవొచ్చు.
పవన్ సాధినేని దర్శకత్వంలో ‘మగాడు 2’ అనే సినిమా తయారవుతోంది. ఇందులో రాజశేఖర్ హీరో. ‘బైకర్’ రిలీజ్ అయ్యాక.. ఆ సినిమా ప్రమోషన్లు మొదలెడతారు. పవన్ సాధినేని ‘ఆకాశంలో ఒక తార’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ లేదా జులైలో ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ వుంది.


