స్టార్ హీరోతో సినిమా అంటే ఈరోజుల్లో ఆషామాషీ వ్యవహారం కాదు. అనుకొన్న సమయానికి షూటింగ్ పూర్తి చేయడం అంటే అది కత్తిమీద సామే. కానీ ‘పెద్ది’ విషయంలో మాత్రం పనులన్నీ చక చక సాగిపోతున్నాయి. 2026 మార్చి 27న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు. అనుకున్న సమయానికే ఈ సినిమా రాబోతోంది. ఎందుకంటే ఇప్పటికే 60 శాతం షూటింగ్ అయిపోయింది. ఫస్టాఫ్ ఆల్రెడీ లాక్ చేసేశారని టాక్. ఫస్టాఫ్ అవుట్ పుట్ పై రామ్ చరణ్ సంతృప్తిగా ఉన్నాడని, ఇదే జోష్తో సినిమాని పూర్తి చేయాలని భావిస్తున్నాడని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.
గురువారం నుంచి పుణెలో ఓ పాట తెరకెక్కించబోతున్నారు. చరణ్ – జాన్వీ కపూర్లపై ఓ పాటని తెరకెక్కిస్తారు. ఈ పాటకు జానీ మాస్టర్ నృత్య రీతులు సమకూరుస్తున్నాడు. రెహమాన్ అందించిన బాణీ అదిరిపోయిందని, ఇది ఇన్స్టెంట్ హిట్ గా నిలిచే పాట అవుతుందని టీమ్ గట్టిగా నమ్ముతోంది. `పెద్ది` ఫస్ట్ సింగిల్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దసరా సందర్భంగా ‘పెద్ది’ తొలి పాట వస్తుందని భావించారు. అయితే… ఇప్పుడు దీపావళికి ఖాయం అంటున్నారు. రెహమాన్ ఈమధ్య ఫామ్ లో లేడు. ఆయన అందించిన పాటలేవీ హిట్ కావడం లేదు. తెలుగులో ఆయన రికార్డు ఏమంత గొప్పగా లేదు. కాకపోతే.. బుచ్చిబాబు ఏరి కోరి రెహమాన్ దగ్గరకు వెళ్లాడు. ఈసారి రెహమాన్ తెలుగు ప్రేక్షకుల్ని నిరుత్సాహ పరచడని, పెద్దిలో ప్రతీ పాటా.. అభిమానులకు నచ్చుతుందని టీమ్ బలంగా నమ్ముతోంది. అది నిజమా, కాదా అనేది దీపావళికి తెలిసిపోతుంది.