ప్రతీ హీరో పేరుకి ముందు ఓ ట్యాగ్ లైన్ ఉండడం కామన్ అయిపోయింది. కొంతమంది అభిమానులు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్లే పెట్టేసుకొంటున్నారు. ఇంకొకరు.. ట్యాగ్ లైన్ పెట్టుకొని మరీ… హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. హీరో రామ్ ని అభిమానులంతా ‘ఉస్తాద్’ అని పిలుస్తున్నారు. ఇది వరకు ‘ఎనర్జిటిక్ స్టార్’ అనేవారు. అయితే అంతకంటే ముందు ఓ ట్యాగ్ లైన్ ఉండేదట. అభిమానులంతా ఆ పేరుతో ముద్దుగా పిలుచుకొనేవార్ట. కానీ… ఓ హీరో ఆ ట్యాగ్ లైన్ తీసేసుకొనేసరికి.. ఫ్యాన్స్ బాగా హర్టయ్యార్ట. ఈ విషయాన్ని రామ్ స్వయంగా చెప్పాడు.
”వచ్చిన కొత్తలో ఫ్యాన్స్ నన్ను ఓ ట్యాగ్ లైన్ తో పిలిచేవారు. అది నేను చెప్పను. కానీ ఆ ట్యాగ్ లైన్ వేరే హీరో పెట్టేసుకొన్నాడు. ఆ తరవాత.. ఫ్యాన్స్ బాగా హర్టయ్యారు. మీరు ఏదోటి పెట్టుకోవాల్సిందే అని.. ‘ఎనర్జిటిక్ స్టార్’ తగిలించారు. ఉస్తాద్ కూడా ఫ్యాన్స్ రూపంలో వచ్చిందే. ఇస్మార్ట్ శంకర్ నాకు ఆ బిరుదు తీసుకొచ్చింది. నార్త్ లో ఒక అభిమానిని మీకు నచ్చిన హీరో ఎవరు? అని అడిగితే.. ‘ఉస్తాద్… రామ్’ అన్నాడు. అప్పటి నుంచీ అదే ట్యాగ్ లైన్ అయిపోయింది` అని చెప్పుకొచ్చాడు.
దాంతో రామ్ ట్యాగ్ లైన్ ని పెట్టేసుకొన్న ఆ హీరో ఎవరు? అనే ఆసక్తికరమైన చర్చ సోషల్ మీడియాలో మొదలైపోయింది. రామ్ సినిమా `ఆంధ్రా కింగ్ తాలుకా` గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఓవర్సీస్లో ప్రీమియర్ షోల హడావుడి మొదలైపోతుంది. రామ్ ప్రస్తుతం యూఎస్‌లో ఉన్నాడు. అక్కడ తన అభిమానులతో ప్రీమియర్ షో చూడడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ హిట్ రామ్ కి చాలా అవసరం. వరుస పరాజయాలకు బ్రేక్ ఇవ్వాలంటే.. ‘ఆంధ్రా కింగ్’ హిట్ అవ్వడం ఒక్కటే మార్గం.