అంబటి రాంబాబు క్యాంప్ రాజమండ్రి జైలు నుంచి గుంటూరు జైలుకు మారింది. గతంలో ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నప్పుడు పోలీసులు పెట్టిన బారికేడ్లను తోసేసి..పోలీసులపై చిందులు తొక్కారు. ఈ అంశంపై నమోదు అయిన కేసులో రాజమండ్రి జైల్లో ఉన్న ఆయనను పీటీ వారెంట్ కింద గుంటూరు కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది.
గుంటూరు కోర్టుకు తీసుకు వచ్చేటప్పుడు పోలీసులు అంబటి రాంబాబుకు రక్షణగా నిలిచారు. ఆయనపై కోడిగుడ్లు, టమాటాలు విసిరుతారన్న అనుమానంతో చుట్టూ సేఫ్ గార్డులు పట్టుకుని నిలబడ్డారు. వాటి మధ్య నుంచి అంబటి రాంబాబు కోర్టుకు వెళ్లారు. కొత్త కేసులో రిమాండ్ విధించడంతో గుంటూరు కోర్టుకు తరలించారు. ఇక నుంచి ఆయనను పరామర్శించాలనుకున్న వారు.. గుంటూరు కోర్టులోనే పరామర్శించవచ్చు.
అంబటి రాంబాబుపై కేవలం చంద్రబాబును దూషించిన అంశంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. వాటిని కొట్టి వేయాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఒక వేళ కోర్టు క్వాష్ చేయకపోతే అన్ని కేసుల్లో పీటీ వారెంట్లు జారీ చేస్తే.. కనీసం మరో ఏడాది పాటు బయటకు వచ్చే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఆయనపై ఇతర కేసులు కూడా ఉన్నాయి. పలుమార్లు పోలీసులపై రుబాబు చేసి.. దమ్ముంటే అరెస్టు చేసుకోండి అని సవాళ్లు చేసిన కేసులు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది.