దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంతకు ముందులా ప్రజలను ఆకట్టుకొనేలా సినిమాలు తీయలేకపోతున్నా, నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఇప్పుడు ఆయన తన సినిమా దర్శకుడుగా కంటే ట్వీటర్లో హీరోగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకొన్నారని చెప్పవచ్చును. బహుశః అదే ఆయనని ప్రజలు మరిచిపోకుండా గుర్తుంచుకొనేలా చేస్తున్నయేమో కూడా. ఇంతకు ముందు చిరంజీవితో సినిమా తీయాలని విఫలయత్నం చేసిన ఆయన ఆ తరువాత కొంతకాలం పాటు పవన్ కళ్యాణ్ వెంటపడ్డారు. కానీ అన్నదమ్ములిరువురూ ఆయనని పట్టించుకోలేదు. దానితో ఆయన వారిరువురిపై తన ట్వీటర్ అస్త్రాలను ప్రయోగించడం మొదలుపెట్టారు. రాజకీయాలలో తప్పటడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్ పై ఆయన అనేక విమర్శలు చేసారు. ఇప్పుడు ఆయన చిరంజీవిని టార్గెట్ చేసుకొన్నట్లుంది.
చిరంజీవి చేస్తున్న 150వ సినిమా ఇటీవల విడుదలయిన బాహుబలి సినిమా కంటే గొప్ప రికార్డ్స్ సాధించలేకపోతే అది మరో ప్రజారాజ్యం ప్రయోగంలా విఫలమవుతుంది కనుక రాజమౌళినే దర్శకుడిగా పెట్టుకొని సినిమా తీసుకొంటే మంచిది. రాజమౌళి తప్ప వేరెవరూ కూడా అంత గొప్పగా సినిమా తీయలేరు అంటూ ట్వీట్ మెసేజులు పెట్టారు. అంటే పూరీ జగన్నాద్ ని తొలగించి రాజమౌళిని పెట్టుకోమని సూచిస్తున్నారన్నమాట! ఒక దర్శకుడిగా సాటి దర్శకుడి గురించి ఇంత చులకనగా మాట్లాడటం, ఒక సినిమాను మరొక సినిమాతో సరిపోల్చి ఇటువంటి ఉచిత సలహాలు ఇవ్వడం చూస్తుంటే రామ్ గోపాల్ వర్మ తనను తాను మార్కెట్/ప్రమోట్ చేసుకోవడానికి ఎంత దిగజారిపోయారో స్పష్టంగా కనబడుతోంది.
ఒకవేళ చిరంజీవి సినిమా హిట్ అయినా అది బాహుబలి సినిమా అంత కలెక్షన్లు రాబట్టలేకపోతే చిరంజీవి నవ్వులపాలవుతారని చెప్పడమే ఒక వెర్రి సిద్దాంతం. తెలుగు సినీపరిశ్రమలో హేమాహేమీలనదగ్గ అనేకమంది హీరో హీరోయిన్ల, దర్శకుల సినిమాలు వచ్చేయి. వాటిలో చాలా గొప్ప చిత్రాలు ఉన్నాయి. ఎవరేజ్ గా ఆడినవున్నాయి. ఫ్లాప్ అయినవీ కూడా ఉన్నాయి. కానీ అంతమాత్రన్న వారి పేరు ప్రతిష్టలు కోల్పోలేదు. ప్రజలను రంజింపజేయగలిగితే ‘హ్యాపీ డేస్’ వంటి చిన్న సినిమాలు కూడా ఆదరణకు నోచుకొంటాయని జగమెరిగిన సత్యం. సినిమా ప్రధాన ఉద్దేశ్యం ప్రజలను రంజింపజేయడం, ఇంకా వీలయితే ఆలోచింపజేయడమే కానీ బాహుబలితోనో మరొక సినిమాతోనో పోటీ పడటం కాదు.
ఒకవేళ బాహుబలి కూడా ప్రజలను రంజింప జేయలేకపోయుంటే దానిని ఎన్నేళ్ళు షూటింగ్ చేసారు? దాని కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు? అందులో హీరో చిన్నవాడా లేక పెద్దవాడా? అని పట్టించుకోకుండా ప్రజలు దానినీ నిర్దాక్షిణ్యంగా తిప్పికొట్టేసేవారు. గత రెండు దశాబ్దాలుగా అటువంటి చేదు అనుభవాలు చాలానే రుచి చూసిన రామ్ గోపాల్ వర్మకి కూడా ఆ సంగతి బాగానే తెలుసు. అయినా కూడా చిరంజీవి సినిమా ఏ స్థాయిని చేరుకోవలసి ఉంటుందో, అందుకోసం ఆయన ఎవరెవరిని పెట్టుకోవాలో చెప్పడం చూస్తుంటే పిచ్చి ముదిరింది రోకలి తలకి చుట్టమని అడుగుతున్నట్లుంది. ఆయన లెక్కన ఇక పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి పెద్ద హీరోలు అందరూ కేవలం రాజమౌళితోనే సినిమాలు తీసుకోవలసి ఉంటుంది. తీసిన ప్రతీ సినిమా కూడా బాహుబలి కంటే ఎక్కువ కలెక్షన్లు సంపాదించవలసి ఉంటుంది. లేకుంటే వారు, వారి సినిమాలు వృధా అని భావించాలేమో?ఈ కోణంలో నుండి చూస్తే రామ్ గోపాల్ వర్మ ఆలోచన ఎంత అసంబద్దంగా ఉందో అర్ధమవుతుంది.
ఆయన తనేదో తెలుగు సినిమా పరిశ్రమలో అందరి కంటే గొప్ప మేధావినని భావిస్తుంటారు. తన గొప్పదనం నిరూపించుకోవడానికి కేవలం ఐదు రోజులోనే ఆయన తీసిన ‘దొంగల ముఠా’ సినిమా సరిగ్గా ఐదు రోజులు కూడా ఆడలేదు. ఇతరులకు సుద్దులు చెప్పే ముందు ఆయన తన గొప్పదనం నిరూపించుకొని ఉండి ఉంటే అందరూ హర్షించేవారు. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన కంటే హేమాహేమీలన దగ్గ దర్శకులు, నిర్మాతలు, కళాదృష్టి గలవారెందరో ఉన్నారు. కానీ వారెవరూ ఈవిధంగా నోరు పారేసుకోలేదు. కానీ రామ్ గోపాల్ వర్మలో ఇదివరకు ఉన్న స్పార్క్ తగ్గిపోవడంతో గొప్ప సినిమాలు చేయలేక ప్రజలు తనను మరిచిపోకుండా ఉండేందుకో లేకపోతే (కుహానా) మేధావినని నిరూపించుకోవడానికో ఆయన ఈ ట్వీటర్ మార్గాన్ని ఎంచుకొన్నట్లు కనబడుతున్నారు. అందరికీ ఈవిధంగా ఉచిత సలహాలు ఇచ్చే బదులు ఆయన స్వయంగా బాహుబలిని మించిపోయే ఒక గొప్ప సినిమాతీసి తన సత్తా చాటుకోవచ్చును కదా? అని ప్రభాస్, చిరంజీవి అభిమానులు ప్రశ్నిస్తే అయన ఏమని జవాబు చెపుతారు?