“సరిహద్దుల్లో కాల్పులు ఆపండి. మీతో చర్చలకు మేం సిద్ధం”… ఇలాంటి హెచ్చరికను భారత్ ఇప్పటికి లక్షల సార్లు చేసి ఉంటుంది. నిన్న మరోసారి చేసింది. ఈ తాటాకు చప్పుళ్లకు పాక్ బెదురుతుందా? ముదరు పాకిస్తాన్ గూబ గుయ్యిమనే జవాబిస్తేనే తిక్క కుదురుతుంది. లెక్క సరి అవుతుంది. కేంద్రం మాత్రం పైపై మాటలతో సరిపుచ్చుతోంది.
చేతగాని మంచితనం కన్నా, సత్తా ఉన్న దూకుడే మేలని రక్షణ రంగంలో కొందరు చెప్పే మాట. భారత్ కు దీన్ని అన్వయించి చూస్తే, మన మంచితనాన్ని చేతగాని తనంగా భావించే పాకిస్తాన్ కు చేతలతోనే బుద్ధి చెప్పాలనే స్పృహ కేంద్ర ప్రభుత్వానికి కలగడం లేదు. నేరుగా యుద్ధం చేసే పరిస్థితులు ప్రస్తుతం లేవు. నిజమే. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఉల్లంఘించిన పాక్ జవాన్లను తరిమికొట్టడం కూడా మనకు చేతకాదా? ఈంట్ కా జవాబ్ పత్థర్ సే దేతే (ఇటుకతో కొడితే రాయితో జవాబిస్తాం) అని ఆ మధ్య పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ వ్యాఖ్యానించాడు. శత్రదేశంతో మన వైఖరి అలాగే ఉండాలి.
రష్యాలో మోడీ, నవాజ్ షరీఫ్ భేటీ వృథా అని కాంగ్రెస్ మొన్ననే విమర్శించింది. అయినా మోడీ భేటీ అయ్యారు. 24 గంటలు తిరగకుండానే పాక్ వైఖరి మారిపోయింది. బుధ, గురువారాల్లో 24 గంటల్లో నాలుగు సార్లు పాక్ సైన్యం కాల్పులు జరిపింది. ఒక మహిళ మరణించింది. మరో ఇద్దరు పౌరులు, ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. మరోవైపు, ఉగ్రవాది లఖ్వీ వాయిస్ శాంపిల్స్ తో పాటు నవాజ్ షరీఫ్ ఇచ్చిన ఏ హామీనీ పాక్ అమలు చేయదని తేలిపోయింది. రష్యాలో మోడీ చేసిన ప్రయత్నం వృథా అని ముందే చాలా మందికి తెలుసు. చివరకు అదే జరిగింది.
సార్వభౌమాధికారం గల దేశానికి తన సరిహద్దులను కాపాడుకునే హక్కు ఉంటుంది. దానివైపు కన్నెత్తి చూసిన వారిని నామరూపాల్లేకుండా చేసే హక్కూ ఉంటుంది. చైనా సంగతే చూద్దాం. తన సరిహద్దుల దగ్గరికి కాదు, ఫర్లాంగు దూరం వరకూ పొరుగు దేశ సైనికులు వస్తే అది కర్కశంగా స్పందిస్తుంది. పొరుగు దేశ సైనికులను పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తుంది. అందుకే. పొరుగు దేశాలైన భారత్ గానీ, మంగోలియా గానీ ఆ సరిహద్దుకు చాలా దూరం ఆగిపోతాయి. అదీ, ఒక దేశం తన భద్రతకు ఇచ్చే ప్రాధాన్యం. దీన్ని చూసైనా మనం పాఠం నేర్చుకోవాలి. పాక్ పదే పదే కాల్పులు జరుపుతోందంటే మన కౌంటర్ అటాక్ బలహీనంగా ఉందని అర్థం.