Rana Naidu Season 2 review
బాబాయ్ అబ్బాయ్ వెంకటేష్, రానా కలసి చేసిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా వెంకీని అభిమానించే ఫ్యామిలీ ఆడియన్స్ ఆ కంటెంట్ చూసి షాక్ అయ్యారు. అయితే ఆ కంటెంట్ గురించి ఐడియా ఉన్న ఆడియన్స్ సిరీస్ ఎలా ఉంటుందో ముందే ప్రిపేర్ అయ్యారు. రానా నాయుడు కోసం అమెరికన్ క్రైమ్ డ్రామా టీవీ సిరీస్ ‘రే డోనోవన్’ని అడాప్ట్ చేసుకున్నారు. సాధ్యమైనంతగా ఇండియనైజ్ చేసి ‘రానా నాయుడు’గా తీసినప్పటికీ, తొలి సీజన్ కంటెంట్ పై చాలా విమర్శలు వచ్చాయి. కథ, పాత్రలలోని బోల్డ్ నెస్ హైలైట్ అయినంతగా ‘నాయుడు’ ఫ్యామిలీ ఎమోషన్ ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదనే చెప్పాలి. ఇప్పుడు సీజన్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ కొత్త సీజన్లో వున్న కంటెంట్ ఏమిటి? ‘నాయుడు’ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యిందా? సీజన్ 2 ప్రేక్షకులకు పంచిన ఎంటర్టైన్మెంట్ ఎంత?
రానా నాయుడు (రానా దగ్గుబాటి) సెలబ్రిటీ ఫిక్సర్. సంఘంలోని ప్రముఖుల లోగుట్లు బయటపడకుండా చేయడం, వాళ్ల సమస్యలు బయట ప్రపంచానికి తెలియకుండా పరిష్కరించడంలో ఘనుడు. ముంబైలో ఓబి మహాజన్ అనే రాజకీయ నాయకుడి వద్ద పని చేసే రానా… ఇక అన్నీ వదిలి ఫ్యామిలీతో హాయిగా సెటిల్ అయిపోవాలని భావిస్తాడు. ఇంతలో రానా కొడుకు కిడ్నాప్ అవుతాడు. కొడుకుని విడిపించుకునే క్రమంలో బాలీవుడ్ లో ఓ ప్రముఖ స్టూడియో ఓనర్ విరాజ్ ఒబెరాయ్ (రజత్ కపూర్) సాయం తీసుకుంటాడు. అయితే విరాజ్, రానా కేవలం తనకోసం పని చేయాలనే కండీషన్ పెడతాడు. కొడుకుని కాపాడే క్రమంలో రావూఫ్ మీర్జా (అర్జున్ రాంపాల్) తమ్ముడిని చంపేస్తాడు రానా. తర్వాత ఏం జరిగింది? తమ్ముడి చావుకి కారణమైన రానాపై రావూఫ్ ఎలాంటి దాడులు చేశాడు? విరాజ్ నుంచి రానాకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? తండ్రి నాగ నాయుడు (వెంకటేష్) కారణంగా రానా ఎలాంటి పరిస్థితులు ఎదురుకున్నాడు? సెలబ్రిటీ సమస్యలని ఫిక్స్ చేసే రానా… తన ఫ్యామిలీ సమస్యలని ఫిక్స్ చేయడానికి ఏం చేశాడనేది తక్కిన కథ.
కొన్ని సిరీస్‌లు సడన్ గా ఆడియన్స్ ని పట్టేస్తాయి. కొన్ని మాత్రం టైం తీసుకుంటాయి. మెల్లమెల్లగా ఎక్కుతాయి. ‘రే డోనోవన్’ కూడా రెండో కేటగిరీకి వస్తుంది. రోగ్ లాంటి తండ్రి, గ్యాంగ్ స్టర్ లాంటి కొడుకు, ఏవో మానసిక సమస్యలతో సతమతమయ్యే తమ్ముళ్లు, భర్తపై విముఖతతో ఎఫైర్ నడిపే భార్య… ఇలా ఒక చిత్ర విచిత్రమైన కుటుంబం కథతో క్రైమ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ‘రే డోనోవన్’ మంచి హిట్ అయ్యింది. సీజన్ కి మించి సీజన్ ఆదరణ పొందింది. రే డోనోవన్ కథని ఇండియనైజ్ చేయడం నిజంగా సాహసమే. అయితే మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా అలాంటి సాహసం చేశారు రానా-వెంకటేష్. మొదట్లో రానా నాయుడుకి విమర్శలు వచ్చినా మెల్లమెల్లగా ఈ సిరీస్ జనాలకు కనెక్ట్ అవుతుందనేది వారి నమ్మకం. నిజంగానే వారి నమ్మకం నిజమైంది. తొలి సీజన్ తో పోల్చుకుంటే కొత్తగా వచ్చిన సీజన్ తో రానా నాయుడు ఫ్యామిలీ ప్రేక్షకులకు చేరువైయిందనే చెప్పాలి.
ఎనిమిది ఎపిసోడ్ల సీజన్ ఇది. ఒక్కో ఎపిసోడ్ నిడివి దాదాపుగా 50 నిమిషాలు. తొలి ఎపిసోడ్ తోనే రానా క్యారెక్టర్ ఆడియన్స్ ని అరెస్ట్ చేయగలిగింది. కిడ్నాప్ తో మొదలైన కథ ఎక్కువ సమయం తీసుకోకుండానే ఆడియన్స్ ని లీనం చేయగలిగింది. ఈ సీజన్లో ఫ్యామిలీ ఎమోషన్ పై దృష్టి పెట్టారు. బయటకు కటువుగా కనిపించే రానా… తమ్ముళ్ల కోసం ఎంతకైనా తెగించే తీరు ఆకట్టుకునేలా ఉంటుంది. రానా, రావూఫ్ మీర్జా, విరాజ్ ఒబెరాయ్ — ఈ మూడు పాత్రల చుట్టూ డ్రామా, యాక్షన్, థ్రిల్, ట్విస్టులు ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తాయి.
ఈ సీజన్లో రానా క్యారెక్టర్ హైలైట్. తన క్యారెక్టర్ని బ్రిలియంట్ గా డిజైన్ చేశారు. ఓటమి అంచు వరకు వెళ్లి గెలిచే తీరు థ్రిల్ పంచుతుంది. రానా క్యారెక్టర్ ఒదిగిపోయాడు. వెంకటేష్ స్క్రీన్ ప్రెజెన్స్ తగ్గింది. అయితే ఈ సీజన్లో ఆ పాత్రను కాస్త పాలిష్ చేసిన అభిప్రాయం కలుగుతుంది. నిజానికి అదొక ఆకతాయి క్యారెక్టర్. ఒరిజినల్ ‘రే డోనోవన్’లో తండ్రి పాత్ర పచ్చి అవకాశవాదం, నోరు తెరిస్తే సెన్సార్ మాటలతో చాలా విచిత్రంగా ఉంటుంది. తొలి సీజన్లో నాగ క్యారెక్టర్ కోసం అదే ఫాలో అయ్యారు. అయితే విమర్శలు రావడంతో దాన్ని తగ్గించేసిన ఫీలింగ్ కలుగుతుంది. రానా భార్య పాత్ర చేసిన సర్వీన్ చావ్లాకు కొన్ని బోల్డ్ సీన్లు ఉన్నాయి. ఆ ట్రాక్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కాస్త ఇబ్బంది. రావూఫ్ గా చేసిన అర్జున్ రాంపాల్ పవర్ఫుల్ విలనిజం పంచాడు. కృతి కర్బంద సర్ప్రైజ్ చేసింది. క్రికెట్ జట్టు కొనుగోలు, వ్యాపారం, పవర్ కోసం ఎంతకైనా తెగించే పాత్రలో కృతి కనిపించిన తీరు బావుంది. నిజంగా ఆమె కెరీర్లో ఇదొక కొత్తరకం పాత్ర. సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, రజత్ కపూర్ తో పాటు మిగిలిన పాత్రలు డీసెంట్ గా ఉన్నాయి.
నెట్‌ఫ్లిక్స్ క్వాలిటీలో రాజీపడలేదు. యాక్షన్ సీన్స్ సినిమా స్కేల్లో తీశారు. మూడో సీజన్‌కు మంచి లీడ్ దొరికింది. నాగ నాయుడు మూడో సీజన్లో విజృంభిస్తాడని హింట్ ఇచ్చారు. ‘రే డోనోవన్’ ఏడు సీజన్ల సిరీస్. సీజన్ 2లో నాయుడు ఫ్యామిలీ కనెక్ట్ అయిన విధానం చూస్తుంటే… ఈ సిరీస్ సక్సెస్ఫుల్ గా కొనసాగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.