మాస్ మహారాజా రవితేజ వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. తాజాగా విడుదలైన ‘మాస్ జాతర’ రవితేజ డై హార్డ్ ఫ్యాన్స్ ని కూడా చిరాకు పెట్టింది. అంతకు ముందు కూడా రవితేజకు చాలా ఫ్లాపులు ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం కనీసం ఓపెనింగ్స్ కూడా అందలేదు. రవితేజ మళ్లీ ట్రాకులో పడాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఇప్పుడు తన దృష్టిని ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాపై కేంద్రీకరించాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఈ సంక్రాంతికి రిలీజ్ కానుంది.
ఈ సినిమా కోసం రవితేజ పైసా కూడా పారితోషికం తీసుకోవడం లేదని తెలుస్తోంది. సంక్రాంతి న ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా రావాలన్న ఆశయంతో రవితేజ రాత్రి – పగలూ ఈ సినిమా కోసం కష్టపడుతున్నాడట. సంక్రాంతికి సినిమా వస్తే.. ఆ మైలేజీ వేరు. ఈగల్, మాస్ జాతర.. ఈ రెండు సినిమాల్ని రవితేజ సంక్రాంతికే ప్లాన్ చేశాడు. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డాయి. సంక్రాంతికి సినిమా వస్తే.. యావరేజ్ స్టఫ్ కూడా పైసా వసూల్ అయిపోతుంది. కాబట్టి ఎలాగైనా సరే, సంక్రాంతి బరిలో తన సినిమా ఉండాలని రవితేజ భావిస్తున్నాడట. ఆ పట్టుదలతోనే టీమ్ పని చేస్తోంది. ఈ సినిమాకు ఇప్పుడు డబ్బులు తీసుకోకుండా, సినిమా బిజినెస్ అయిపోయిన తరవాత వాటా తీసుకోవాలన్నది రవితేజ ప్లాన్. సంక్రాంతి సినిమా కాబట్టి, బాగా ఆడితే లాభాలు కూడా గట్టిగా వస్తాయి. అప్పుడు పారితోషికం కంటే ఎక్కువే గిట్టుబాటు అవుతుంది. రవితేజ పారితోషికం నిన్నా మొన్నటి వరకూ రూ.25 కోట్ల వరకూ ఉండేది. కానీ వరుస ఫ్లాపులతో కాస్త తగ్గించాల్సివచ్చింది. ‘మాస్ జాతర’కు రూ.15 కోట్ల వరకూ తీసుకొన్నాడని వినికిడి. దాన్ని ఇప్పుడు పక్కన పెట్టాడన్నమాట. నిజానికి రవితేజ పారితోషికం తీసుకోకుండా పని చేయడం చాలా అరుదు. కానీ ఈసారి మాత్రం కాస్త తగ్గక తప్పడం లేదు.


