2025 చివరి చాప్టర్‌కి వచ్చేశాం. క్రిస్మస్ హడావుడి అయిపోతే.. ఈ యేడాదికి పేకప్ చెప్పేసినట్టే. 2025 ఎవరెవరికి ఏం ఇచ్చింది? అనే లెక్కలు మొదలైపోయాయి. చాలామంది హీరోలకు ఈ యేడాది మధుర జ్ఞాపకం. ఇంకొంతమందికి చేదు విషం. 2025 క్యాలెండర్ ఇయర్లో మూడు సినిమాలు చేసినా ఒక్క హిట్ కూడా నమోదు చేయని హీరో ఎవరైనా ఉన్నారంటే అది మాస్ మహారాజ్… రవితేజ మాత్రమే. ఈ యేడాది రవితేజ నుంచి ‘ఈగల్’, ‘మిస్టర్ బచ్చన్’, ‘మాస్ జాతర’ చిత్రాలొచ్చాయి. ఒక్కటి కూడా బాక్సాఫీసు దగ్గర సరైన ఫలితాన్ని పొందలేకపోయింది. మూడూ డిజాస్టర్లే. ఈ సినిమాలకు కనీసం ఓపెనింగ్స్ కూడా లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ‘మిస్టర్ బచ్చన్’ అయితే భారీ ట్రోలింగ్ కి గురైంది. అంతకు ముందు కూడా రవితేజకు ఫ్లాపులే తగిలాయి. `టైగర్ నాగేశ్వరరావు`, `రామారావు ఆన్ డ్యూటీ` కూడా ఫ్లాపులే. 2024 సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ వచ్చింది. అయితే ఇది సోలో సినిమా కాదు. ఈ హిట్ చిరు ఖాతాలో పడిపోయింది.
2026లో అయినా రవితేజ గట్టిగా కమ్ బ్యాక్ ఇవ్వాలని అభిమానులు ఆశపడుతున్నారు. అది జరుగుతుందా, లేదా? అనేది సంక్రాంతి సీజన్లోనే తేలిపోతుంది. ఈ సీజన్లో రవితేజ నుంచి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమా వస్తోంది. రవితేజ తన మాస్ రూటు మార్చి.. చేసిన క్లాస్ సినిమా ఇది. వినోదానికి పెద్ద పీట వేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా దట్టంగా రంగరించారు. సంక్రాంతికి ఫ్యామిలీ డ్రామాలు బాగా ఆడతాయన్న నమ్మకం ఉంది. దర్శకుడు కిషోర్ తిరుమల స్టైల్ ఆఫ్ మేకింగ్ పై కూడా అభిమానులకు భరోసా వుంది. కాబట్టి ఈ రెండు అంశాలూ… రవితేజకు హిట్ ఇస్తాయని ఆశ పడుతున్నారు అభిమానులు. కాస్త మంచి టాక్ వస్తే, మిగిలిన పని సంక్రాంతి సీజన్ చూసుకొంటుంది. ఇప్పటికే టైటిల్ గ్లింప్స్ బయటకు వచ్చింది. ఓ పాట కూడా విడుదల చేశారు. ఇవి రెండూ పాజిటీవ్ రెస్పాన్స్ ని దక్కించుకొన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయడానికి ఒప్పుకొన్నాడు. ఈ సినిమా కూడా 2026లోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సో… రవితేజ కమ్ బ్యాక్ ఎలా ఉంటుందో డిసైడ్ అయ్యేది 2026లోనే.
