‘మాస్ జాతర’ ఏ ముహూర్తంలో మొదలు పెట్టారో కానీ, ఆలస్యమవుతూ వస్తోంది. రిలీజ్ డేట్ ప్రకటించడం… సినిమా వాయిదా పడడం ఇదే తంతు. రవితేజ కెరీర్ లో ఇన్నిసార్లు వాయిదా పడిన సినిమా మరోటి లేదేమో? ఈ యేడాది సంక్రాంతికి వస్తుందని చెప్పారు. ఆ తరవాత వేసవికి షిఫ్ట్ అయ్యింది. ఆనక వినాయక చవితి అన్నారు. అది వచ్చి, వెళ్లిపోయింది. ఇప్పుడు దసరా సెలవులూ అయిపోతున్నాయి. మరి మాస్ జాతర ఎప్పుడన్నదే మాస్ మహారాజ్ అభిమానుల ప్రశ్న.
దానికి సమాధానంగా చిత్రబృందం రిలీజ్ ప్రోమో విడుదల చేసింది. రవితేజ – హైపర్ ఆదిలపై సరదాగా ఓ ప్రోమో కట్ చేశారు. హైపర్ ఆది ‘మాస్ జాతర’ రిలీజ్ డేట్ గురించి అడగడం, రవితేజ ఓ డేట్ చెప్పడం, ఆ తరవాత వాయిదా పడడంతో రవితేజ మొహం చాటేయడం.. జబర్ దస్త్ స్కిట్ లా.. అనిపించిందంతా. మధ్యలో నాగవంశీ మేటర్ కూడా వచ్చింది. రవితేజ నాగవంశీకి ఫోన్ చేయడం ‘దుబాయ్ లో ఉన్నావా’ అని సెటైర్ వేయడం… మరింత ఫన్నీగా అనిపించింది. మొత్తానికి వినాయకుడిపై ఒట్టేసి అక్టోబరు 31 న వస్తున్నాం, ఈసారి ఫిక్సు అని మాట ఇచ్చేశాడు మాస్ మహారాజా. వినాయకుడిపై ఒట్టేశాడు కాబట్టి, ఈసారి రిలీజ్ డేట్ ఫిక్సయినట్టే అనుకోవాలి.
రవితేజ సినిమా ప్రమోషన్లకు పెద్దగా అందుబాటులో ఉండడు. పర్సనల్ ఇంటర్వ్యూలు కూడా పెద్దగా ఇవ్వడు. అలాంటిది.. రిలీజ్ ప్రోమో కోసం ఇలాంటి ఓ స్కిట్ చేశాడంటే గ్రేటే. సినిమా జనంలోకి వెళ్లాలంటే ప్రమోషన్లు చాలా అవసరం అని రవితేజ తెలుసుకొన్నాడో, లేదంటే నాగవంశీ బలవంతంపై ఓ స్కిట్ చేయాల్సివచ్చిందో తెలీదు కానీ, మొత్తానికి రవితేజ కూడా ప్రమోషన్ల జమానాలో తానూ భాగం పంచుకోవడానికి ముందుకొచ్చాడు.
