రాయపాటి మాట్లాడితే చంద్ర‌బాబుకి కోప‌మా..?

తాను మాట్లాడితే ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకి కోపం వ‌స్తుంద‌ని ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు అన‌డం విశేషం! సీఎంకి కోపం తెప్పించే అంశం అని తెలిసినా కూడా మాట్లాడ‌టం త‌ప్ప‌డం లేదంటూనే విశాఖ రైల్వే జోన్ మీద సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ద‌క్షిణ మ‌ధ్య రైల్వేజోన్ మీద తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన స‌మావేశం నుంచి ఆయ‌న అర్ధంత‌రంగా బ‌య‌ట‌కి వ‌చ్చేశారు. ఆ త‌రువాత‌, మీడియా ముందు త‌న ఆవేద‌న‌ను వెళ్ల‌గ‌క్కారు. విశాఖ రైల్వే జోన్ గురించి ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. ముఖ్య‌మంత్రి చంద్రబాబు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఎన్నిసార్లు భేటీ అవుతున్నా జోన్ ఎందుకు రావ‌డం లేద‌న్నారు.

ఈ అంశంపై ముఖ్య‌మంత్రిగానీ ఇత‌ర టీడీపీ నాయ‌కులుగానీ శ్ర‌ద్ధ తీసుకోవడం లేద‌న్నారు. అంతేకాదు, ఇలాగే ఇంకొన్నాళ్లు గ‌డిస్తే రైల్వే జోన్ అంశాన్ని ప్ర‌జ‌లు మెల్ల‌గా మ‌ర‌చిపోతారని రాయ‌పాటి చెప్పారు. జోన్ రాక‌పోవ‌డానికి కార‌ణం అధికారుల తీరే అన్నారు. చిన్న‌చిన్న ప‌నులు కూడా అధికారుల చేయ‌డం లేద‌నీ, విశాఖ జోన్ రావ‌డం వారికి ఇష్టం లేద‌నీ, వారికే చిత్త‌శుద్ధి ఉంటే ఇప్ప‌టికే అది సాకార‌మ‌య్యేద‌నీ అన్నారు. ప్ర‌తీయేటా పెడుతున్న ఈ స‌మావేశాలు ప్ర‌హ‌స‌నాల్లా మిగిలిపోతున్నాయ‌నీ, భోజ‌నాలు చేసి వెళ్లిపోవ‌డ‌మే జ‌రుగుతోంద‌ని ఎద్దేవా చేశారు.

రాయ‌పాటి ఆగ్ర‌హంలో కొంత అర్థం ఉంది. నిజంగానే, విశాఖ రైల్వే జోన్ విష‌యంలో తెలుగుదేశం స‌ర్కారు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. సాక్షాత్తూ రైల్వే మంత్రే ఆంధ్రా కోటాలో ఎంపీ అయ్యారు. అయినాస‌రే, గ‌డ‌చిన బ‌డ్జెట్ లో విశాఖ జోన్ ఊసెత్త‌లేదు. దాని గురించి చంద్ర‌బాబు స‌ర్కారూ భాజ‌పాని ప్ర‌శ్నించ‌లేదు! ప్ర‌త్యేక హోదా గురించే ప్ర‌శ్నించ‌ని చంద్ర‌బాబు, రైల్వే జోన్ విష‌యాన్ని ఎందుకు సీరియ‌స్ గా తీసుకుంటారు..? సో.. ఇలాంటి అంశం గురించి ఎవ‌రు మాట్లాడినా చంద్ర‌బాబుకు కోపం రావ‌డం స‌హ‌జం.

మ‌రి, ఆ సంగ‌తి తెలిసి కూడా రాయ‌పాటి ఎందుకు మాట్లాడారంటే… ఆయ‌న‌కి చంద్రబాబుపై ఉన్న కోప‌మో అసంతృప్తినో ఈ నెపంతో బ‌య‌ట‌పెడుతున్నారేమో అని కొంత‌మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎందుకంటే, టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వి త‌న‌కే ద‌క్కాలంటూ రాయ‌పాటి ప‌ట్టుబ‌డుతున్న‌ట్టు ఈ మ‌ధ్య‌నే క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే, చంద్ర‌బాబు మ‌న‌సులో మ‌రో ఎంపీ ముర‌ళీమోహ‌న్ ఉన్నార‌ట అని కూడా వినిపించింది! టీడీపీకి తాను ఎంతో చేదోడు వాదోడుగా నిలిచినా కూడా టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వి విష‌య‌మై త‌న గురించి ఎందుకు ఆలోచించ‌డం లేద‌న్న అసంతృప్తి రాయ‌పాటిలో ఉంద‌ని ఆ వ‌ర్గం నుంచే గుస‌గుస‌లు వినిపించాయి. ఆ అసంతృప్తి బ్యాక్ మైండ్ లో ఉంచుకునే ఈ సంద‌ర్భాన్ని, రైల్వే జోన్ హామీని ఇలా రాయ‌పాటి వాడుకున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది. మ‌రి, ఆయ‌న చెప్పిన‌ట్టే చంద్ర‌బాబుకు కోపం వ‌స్తుందో రాదో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.