టిడిపి సూపర్ డ్రామా మొదలు….జోన్ కూడా హుళక్కే

వహ్వా…….సూపర్……2014 ఎన్నికలకు ముందు నుంచీ టిడిపి, టిడిపి అనుకూల మీడియా చేస్తున్న షో చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. జనాలను అమాయకులను చేస్తూ ఎంత బాగా మోసం చెయ్యొచ్చు అనే పాఠాలు నేర్చుకోవాలనుకున్న ఎవ్వరికైనా ఈ చరిత్ర పాఠాలు కచ్చితంగా బ్రహ్మాండంగా ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు. కాకపోతే జర్నలిజం విలువలన్నింటికీ పాతరేసి ఇష్టారీతిన వార్తలు అందించే మీడియా వ్యవస్థలు ఉండాలి. మనస్సాక్షి, నిజాయితీ అనే మాటలకు అర్థం కూడా తెలియని నేతలు ఉండాలి. ప్రజలు ఎంతకైనా మోసం చెయ్యొచ్చు. అలాగే నిజాయితీపరుడు అని గత కొన్నేళ్ళుగా ముద్ర వేయించుకున్న పవన్ కళ్యాణ్‌లాంటి ఒక ‘నటుడు’ కూడా భజన బృందంలో ఉండాలి.

ఆల్రెడీ ఈ జనాలందరూ కలిసి ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను పూర్తిగా ముంచేశారు. ఇప్పుడిక రైల్వే జోన్ కథ కూడా ముగింపుకు వచ్చేసింది. రైల్వేజోన్ ఇవ్వడం కేంద్రప్రభుత్వానికి ఇష్టం లేదు. అందుకు ప్రత్యేక కారణాలు కూడా ఏమీ లేవు. ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణా, తమిళనాడు, ఒరిస్సా…..ఇంకా అనేక రాష్ట్రాల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి ఆంధ్రప్రదేశ్‌ని ముంచేసినట్టుగానే ఇప్పుడు రైల్వే జోన్ ఇచ్చినా కూడా ఒడిస్సా జనాల మనోభావాలు దెబ్బతింటాయన్నదే ప్రధాన కారణం. ఒడిసాలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న మోడీ, అమిత్ షాలకు ఇప్పుడు ఒరియా ప్రజల ఓట్లు చాలా కీలకం. టిడిపి, టిడిపి అనుకూల మీడియా అండ ఉండగా తెలుగు ఓటర్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం మోడీకి ఎప్పటికీ వచ్చేలా కనిపించడం లేదు.

రైల్వే జోన్ విషయంలో కూడా మోడీకి ఉన్న ఇబ్బందులను టిడిపి నేతలు ముందుగానే గ్రహించినట్టున్నారు. అందుకే రైల్వే జోన్ ఇవ్వమని మోడీని అడగకూడదని టిడిపి ఎంపి రాయపాటి సాంబశివరావు ఓ అమూల్య ప్రకటన చేశారు. రెండు మూడు రోజుల క్రితమే చినబాబు లోకేష్ కూడా ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించకూడదని గొప్పగా చెప్పారు. ఇప్పుడు ఈయన కాంట్రాక్ట్‌లకు ఏం అవసరం వచ్చిందో, లేక చంద్రబాబుకే అవసరమైందో కానీ మోడీని రైల్వేజోన్ అడగకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గొప్ప సందేశం ఇస్తున్నాడు. ప్రత్యేక హోదా వేస్ట్, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయడం వృధా అని కూడా ముందుగా తేల్చేసింది టిడిపి నాయకులే. ఇప్పుడిక రైల్వే జోన్ కథ కూడా అలానే నడిపించేలా ఉన్నారు. రైల్వే జోన్ వళ్ళ ఎన్ని నష్టాలు ఉన్నాయో, రైల్వే జోన్ వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏ స్థాయిలో కుంటుపడుతుందో సవివరంగా చెప్తూ టిడిపి అనుకూల మీడియాలో వరుస కథనాలు రావడమే ఇక ఆలస్యం. ఈ డ్రామాని పసిగట్టి ఈ సారైనా జగన్, పవన్‌లు కాస్త ముందుగా మేల్కొని గట్టి పోరాటం ఏమైనా చేస్తారేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.