రివ్యూ: ఆర్‌డిఎక్స్ ల‌వ్‌

RDX Love Review

తెలుగు360 రేటింగ్‌: 1.5/5

పాయ‌సం మరీ తీయ్య‌గా ఉంటుంద‌ని అందులో చెంచాడు కారం క‌లుపుకోం.. ఆవ‌కాయ ఘాటుగా ఉంటుంద‌ని అందులో తేనె ముంచుకోం.. దేని రుచి దానిదే. వాటిని అలానే ఆస్వాదించాలి. ఆర‌గించాలి.

క‌థ‌లు కూడా అంతే. ఏ క‌థ‌ని ఎలా చెప్పాలో అలానే చెప్పాలి. మ‌న‌సులో ఓ మంచి ఉద్దేశాన్ని దాచుకుని, దాన్ని అలానే చెబితే జ‌నం చూస్తారో, లేదో అని భ‌య‌ప‌డి – కోటింగులు ఇచ్చి, మేక‌ప్పులు పూసి, మేకొవ‌ర్లు చేసి, ప్యాకింగులు పెంచితే – అస‌లు విష‌యం క‌రిగిపోయి, క‌నుమ‌రుగైపోయే ప్ర‌మాదం ఉంటుంది. ‘ఆర్‌డిఎక్స్ ల‌వ్‌’ విష‌యంలో అదే జ‌రిగింది.

ఇది వ‌ర‌కు ష‌కీలా సినిమాలొచ్చేవి. ప‌ద‌మూడు రీళ్ల పాటు – బీ గ్రేడ్ స‌న్నివేశాలు చూపించి – చివ‌రి రీలులో ‘ఇదంతా త‌ప్పు..’ అని సందేశం ఇచ్చి ఇంటికి పంపించేవాళ్లు. ఆ ప‌ద‌మూడు రీళ్ల మ‌సాలాని మాత్ర‌మే మ‌న‌సులో దాచుకుని, సందేశాన్ని గాలికి వ‌దిలేసి ఇంటిబాట ప‌ట్టేవారు ష‌కీలా అభిమానులు.

‘ఆర్‌డిఎక్స్’ చూసినా అదే ఫీలింగ్ క‌లుగుతుంది. సినిమా ప్రారంభంలో మ‌సాలా సీన్లు చాలా ఉంటాయి. చివ‌రి వ‌ర‌కూ అంతే. క్లైమాక్స్ కి ముందు మాత్ర‌మే ఈ మ‌సాలా సీన్ల వెనుక ఉన్న అర్థం ప‌ర‌మార్థం అర్థం అవుతాయి. కాక‌పోతే.. అప్ప‌టికే ఈ సినిమాపై ఓ రక‌మైన ఫీలింగ్ ప్రేక్ష‌కుల‌లోకి ఎక్కేస్తుంది.

మ‌రి దర్శ‌కుడు అనుకున్న పాయింట్ ఏమిటి? దాన్ని ఎలా చూపించాడు? చివ‌రికి ప్రేక్ష‌కుల‌కు అది ఎలా అర్థ‌మైంది?

‘భ‌గీర‌ధ’ గుర్తుంది క‌దా? ర‌వితేజ ఫ్లాప్‌ సినిమాల్లో అదొక‌టి. అందులో రెండు ఊర్ల మ‌ధ్య బ్రిడ్జి వేయించాల‌న్న ఆశ‌యంతో హీరో ప‌ట్నం వ‌స్తాడు. త‌న ఊరిని మోసం చేసిన విల‌న్‌తోనే ఆ బ్రిడ్జి క‌ట్టిస్తాడు. ర‌వితేజ వెర్ష‌న్ ‘భ‌గీర‌ధ‌’ అయితే.. పాయ‌ల్ రాజ్ వెర్ష‌న్ ‘ఆర్‌డిఎక్స్ ల‌వ్‌’. కాక‌పోతే అక్క‌డ ర‌వితేజ ఎంచుకున్న దారి వేరు. ఇక్క‌డ పాయ‌ల్ మార్గం వేరు. ఓ అమ్మాయి త‌న ఊరికి ఉప‌కారం చేయ‌డానికి కంక‌ణం క‌ట్టుకోవ‌డం మంచి పాయింటే. అందులో ఫీల్ ఉంది. కానీ ఈ పాయింట్‌ని క‌థ‌గా మ‌ల‌చి, సీన్లు అల్లి, సినిమాగా మార్చే ప్ర‌య‌త్నంలోనే ద‌ర్శ‌కుడు లేని పోని అడ్డ‌దార్లు వెదుక్కున్నాడు. ఇంత‌టి ఉదాత్త‌మైన పాయింట్‌ని ఇలానే చెబితే జ‌నం చూడ‌రేమో అనుకుని, ‘భ‌గీర‌ధ‌’కి వ‌చ్చిన ఫ‌లిత‌మే త‌న‌కూ వ‌స్తుంద‌ని భ‌య‌ప‌డి – ఆ క‌థ‌ని ‘త్రిబుల్ ఎక్స్‌’ స‌న్నివేశాల మ‌ధ్య ఇరికించేశాడు. అందుకోసం హీరోయిన్ క్యారెక్ట‌రైజేష‌న్‌ని ఎలాప‌డితే అలా రాసుకున్నాడు. దాంతో…. యువ‌త‌రానికి కిర్రెక్కించే హాట్ సీన్లు పుట్టుకొచ్చాయి. కానీ… అవేమీ క‌థ‌ని నిల‌బెట్ట‌లేక‌పోయాయి. స‌రిక‌దా… ఆ క‌థ‌లోని నిజాయ‌తీని ప్ర‌శ్నించేలా చేశాయి. అందుకు ఊత‌మిచ్చిన సీన్లు బోలెడ‌న్ని.

ఉదాహ‌ర‌ణ‌కు…

హీరోయిన్ రోడ్డుపై కండోమ్ ప్యాకెట్స్ పంచుతుంటుంది. ‘మీరెప్పుడైనా అప‌రిచిత వ్య‌క్తుల‌తో శృంగారంలో పాల్గొన్నారా’ అంటూ ఎదురొచ్చిన హీరోని అడుగుతుంది. అంతేకాదు.. కండోమ్ వాడ‌కం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు, వాడ‌క‌పోతే వ‌చ్చే అన‌ర్థాల‌ని వివ‌రిస్తుంది. ఇక్క‌డితో ఆగితే బాగుండును. హెచ్ ఐ వీ నివార‌ణ కోసం ఈ సినిమా కూడా ఇదోదికంగా సాయం చేసింద‌నుకునేవాళ్లం. క‌ట్ చేస్తే.. హీరో అర్థ‌రాత్రి హీరోయిన్ హాస్ట‌ల్ ముందు ప్ర‌త్య‌క్ష‌మైపోయి ‘నా గాళ్ ఫ్రెండ్ ఇప్పుడే త‌న ఇంటికి ర‌మ్మంది. కండోమ్ ప్యాకెట్స్ లేవు. ఎరైంజ్ చేయ‌వా’ అని అడుగుతాడు. ఇక్క‌డ కూడా ఈ సీన్ ఆగ‌లేదు. ఆ వెంట‌నే హీరోయిన్‌, హీరోని బండి ఎక్కించుకుని కండోమ్ ప్యాకెట్ల కోసం రోడ్డు మీద ప‌డుతుంది.

మ‌రో ఆణిముత్యం..

ఓ ఊర్లో భార్య‌ల్ని భ‌ర్త‌లు ప‌ట్టించుకోరు. రాత్రి ఇంటికి ఫుల్లుగా మందితాడి వ‌చ్చి, గుర‌క‌పెట్టి నిద్ర‌పోతారు. దాంతో భార్య‌లు ‘త‌ల్లులు’ అయ్యే అదృష్టాన్ని కోల్పోతారు. అక్క‌డ హీరోయిన్ ఠంగుమ‌ని ప్ర‌త్య‌క్ష్యం అవుతుంది. మ‌ల్లెపూల ఉప‌యోగం, వాత్య్సాయ‌న కామ‌సూత్ర పాఠాలు చెప్పి – ఆడ‌వాళ్ల‌ని ప్రేరేపిస్తుంది. అప్ప‌టికీ మ‌గాళ్లు ఒప్పుకోక‌పోతే… మంచానికి క‌ట్టేసి, బ‌ల‌వంతంగా లోబ‌ర్చుకోమ‌ని స‌ల‌హా ఇస్తుంది. ఫ‌లితంగా ఊర్లోని ఆడ‌వాళ్లంతా మూక‌మ్ముడిగా వాంతులు చేసుకుంటారు.

ఇవ‌న్నీ హీరోయిన్ లోని సేవా దృక్ప‌థాన్ని ఎలివేట్ చేసే సీన్ల‌ని ద‌ర్శ‌కుడు అనుకున్నాడు. కాక‌పోతే అవి కాస్త‌… త్రిబుల్ ఎక్స్ స‌న్నివేశాలుగా మారిపోయాయి. ఇలాంటి మ‌హ‌త్త‌ర దృశ్య కావ్యాలు ఈ సినిమాలో బోలెడ‌న్ని క‌నిపిస్తాయి. అబార్ష‌న్లు చేస్తున్న డాక్ట‌ర్ల‌కు బుద్ది చెప్ప‌డానికి హీరోయిన్ చేసిన స్ట్రింగ్ ఆప‌రేష‌న్ చూస్తే మాత్రం డాక్ట‌ర్ల మ‌నోభావాలు దెబ్బ‌తిన‌డం ఖాయం. ఇవ‌న్నీ చాల‌వ‌న్న‌ట్టు ముమైత్ ఖాన్‌ని రంగంలోకి దింపి లేడీ విల‌నిజం చూపించారు. `గింజ‌..` అంటూ ఓ బూతు ప‌దాన్ని మ‌రోలా వాడుతూ – ప్రేక్ష‌కుల‌లో కావ‌ల్సినంత ఇకారాన్ని తీసుకురావ‌డానికి త‌న‌వంతు స‌హాయం చేసింది.

ఇంతా పోగేస్తే… ఇవ‌న్నీ ఇంట్ర‌వెల్ ముందొచ్చే స‌న్నివేశాలు. విశ్రాంతి త‌ర‌వాత‌… లొకేష‌న్లు మారినా, సేమ్ టూ సేమ్ ఇలాంటి ఇంపాక్ట్‌తోనే చాలా స‌న్నివేశాలు న‌డిచిపోతాయి. హీరోయిన్ వంటిపై ప‌డుతున్న తేనె చుక్క‌ల్ని హీరో నాలుక‌తో… చెరిపేస్తుంటే ఓ ప‌క్క హీరో తండ్రి `నేను కొడుకుని క‌న్నానా, కుక్క‌ని క‌న్నానా, ఆ నాకుడేందిరా` అంటూ డైలాగ్ చెబుతాడు. ఆ స‌న్నివేశం ఎలా సాగిందో అంత‌కంటే ఘోరంగా ఎలా చెబుతాం? చివ‌రికి త‌న ఊరికి ద్రోహం చేసిన ఇద్ద‌రు విల‌న్ల‌కు బుద్ధి చెప్పి, వాళ్ల‌ని హీరోయిన్ జైలుకి పంప‌డంతో క‌థ ముగుస్తుంది. అంటే చివ‌ర్లో ఇచ్చిన పాన్ కోసం.. ఈ సినిమా మొత్తం చూడాల‌న్న‌మాట‌.

ఆర్ ఎక్స్ 100 లో 100 % బోల్డ్‌గా క‌నిపించిన పాయ‌ల్‌… ఈ సినిమాలో 200 % బోల్డ్‌గా క‌నిపించ‌డానికి ప్ర‌య‌త్నించింది. ఆ పాత్ర‌లో అంత‌ డెప్త్ ఉన్నా – దాన్ని తీర్చిదిద్దిన విధానంలో ఎన్నో లోపాలు పండ‌డంతో – అలివేలులోని కేవ‌లం ఒక్క కోణ‌మే ఎలివేట్ అయ్యింది. ఈ సినిమాకి ముందు పాయ‌ల్‌ని `విజ‌య‌శాంతి`తో పోల్చారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అయితే ఆ స్థాయికి వెళ్ల‌డానికి పాయ‌ల్ ఇంకా చాలా దూరం ప్ర‌యాణం చేయాల్సివుంద‌ని ఈ సినిమా చూస్తే అర్థం అవుతుంది. తేజ‌స్‌… హీరో మెటీరియ‌ల్ కాదు. రొమాంటిక్ బోయ్ పాత్ర‌ల‌కు స‌రిపోతాడు. అందుకే అత‌న్ని వాడుకున్నారు. చాలా రోజుల త‌ర‌వాత ముమైత్ ఖాన్ తెర‌పై క‌నిపించింది. ఆదిత్య మీన‌న్ రొటీన్ విల‌నీని స్టైలీష్‌గా ప్ర‌ద‌ర్శించ‌డంలో స‌ఫలం అయ్యాడు.

సాంకేతికంగా గొప్ప మెరుపుల్లేవు. ర‌థ‌న్ నేప‌థ్య సంగీతం కొన్ని చోట్ల బాగుంది. పాట‌లు మెప్పించ‌వు. లో బ‌డ్జెట్ బాధ‌లు తెర‌పై క‌నిపిస్తుంటాయి. క‌థ‌లో బోల్డ్‌నెస్ ఉంటేనే దాన్ని బోల్డ్‌గా చూపించాలి. ఏ క‌థైనా స‌రే, అలా చూపించొచ్చు అనుకుంటే మాత్రం `ఆర్‌డిఎక్స్` బాంబులు సైతం తుస్సుమంటాయి. ఈ విష‌యం భాను శంక‌ర్ తెలుసుకోవాలి. ఏవో కొన్ని బీ గ్రేడ్ సీన్లు తీసి, దాన్ని ట్రైల‌ర్‌లో చొప్పించి, ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్ల వ‌ర‌కూ ర‌ప్పించ‌గ‌ల‌రేమో..? కానీ రెండు సీన్లు గ‌డిచాక, ఆర్‌డిఎక్స్ పేల‌ద‌ని వాళ్ల‌కు ఈజీగానే అర్థ‌మైపోతుంది.

తెలుగు360 రేటింగ్‌: 1.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పట్నుంచి గడ్డం తీసుకోని ఎల్వీ సుబ్రహ్మణ్యం..!

మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణం హఠాత్తుగా గుంటూరులో కనిపించారు. రామ మందిరానికి విరాళాలు సేకరించే ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. గబుక్కున ఆయనను చూసిన వారు చాలా మంది పోల్చుకోలేకపోయారు. ఎవరో స్వామిజీ ప్యాంట్,...

నిమ్మగడ్డ కింకర్తవ్యం..!?

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓ స్ట్రిక్ట్ ఐఏఎస్ అధికారిగా పని చేసుకుంటూ పోతున్నారు. ఓ రాజ్యాంగ వ్యవస్థకు అధిపతిగా తనకు ఉన్న అధికారాలను పక్కాగా ఉపయోగించుకుంటున్నారు. సర్వీస్ రూల్స్...

రేప్ కేసు కూడా పెట్టేసిన ఏపీ పోలీసులు..!

" ఇవన్నీ కాదు కానీ నేను నిన్ను పాడు చేశానని కేసు పెట్టు... నేను కూడా నిజమేనని ఒప్పుకుని జైలుకు వెళ్తా...!" అని ఓ సినిమాలో హిరోయిన్ సిమ్రాన్‌తో కమలహాసన్ అంటాడు....

మళ్లీ దక్షిణాది వాదం అందుకున్న కేటీఆర్..!

తెలంగాణ రాష్ట్ర సమితి బీజేపీపై దూకుడుగా ఉన్న సమయంలో దక్షిణాది వాదం వినిపించేవారు. దక్షిణాది నుంచి పెద్ద ఎత్తున పన్నుల ఆదాయం పొందుతున్న కేంద్రం.. వాటిని మొత్తం ఉత్తరాదిలో ఖర్చు పెడుతోందని...

HOT NEWS

[X] Close
[X] Close