భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. కొత్తగా నిర్మిస్తున్న ఇళ్ల ధరలు చుక్కలను తాకుతుండటంతో, సామాన్య , మధ్యతరగతి కొనుగోలుదారులు తమ రూటు మార్చి రీసెల్ మార్కెట్ వైపు మొగ్గు చూపుతున్నారు. తాజా నివేదికల ప్రకారం, గత ఏడాదితో పోలిస్తే రీసెల్ ఇళ్ల విక్రయాలు సుమారు 15 శాతం వృద్ధి చెందాయి. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది.
కొత్త ప్రాజెక్టులలో చదరపు అడుగు ధర గత రెండేళ్లలోనే 20 నుండి 30 శాతం వరకు పెరిగింది. దీనికి తోడు జీఎస్టీ , మెటీరియల్ ఖర్చులు తోడవ్వడంతో కొత్త ఇల్లు కొనడం భారంగా మారింది. అయితే, అదే ప్రాంతంలో ఐదు నుండి పదేళ్ల క్రితం నిర్మించిన రీసెల్ ఇళ్లు కనీసం 20 నుండి 25 తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి. దీనివల్ల కొనుగోలుదారులకు భారీగా నగదు ఆదా అవ్వడమే కాకుండా, పెద్ద విస్తీర్ణం కలిగిన ఇళ్లు దక్కుతున్నాయి.
కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి కనీసం 3 నుండి 5 ఏళ్ల సమయం పడుతుండటం, కొన్నిసార్లు గడువులోగా పూర్తి కాకపోవడం వంటి రిస్కులు ఉంటున్నాయి. దీనికి భిన్నంగా రీసెల్ ఇళ్లలో రెడీ-టు-మూవ్ సౌకర్యం ఉండటం కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది. కొన్న వెంటనే గృహప్రవేశం చేసే అవకాశం ఉండటంతో అటు అద్దె ఆదా అవ్వడమే కాకుండా, బ్యాంకు రుణాలపై వడ్డీ భారం కూడా వెంటనే తగ్గుతుంది.
సాధారణంగా రీసెల్ ఇళ్లు ఇప్పటికే అభివృద్ధి చెందిన కాలనీలు లేదా గెటెడ్ కమ్యూనిటీల్లో ఉంటాయి. అక్కడ పాఠశాలలు, ఆసుపత్రులు, రవాణా సౌకర్యాలు అప్పటికే అందుబాటులో ఉంటాయి. కొత్తగా వెలుస్తున్న వెంచర్లలో ఈ కనీస సదుపాయాలు రావడానికి చాలా కాలం పడుతోంది. అందుకే నేటి రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొత్తది మెరిసేది.. పాతది నమ్మదగ్గది అనే నినాదంతో రీసెల్ మార్కెట్ సరికొత్త జోరును ప్రదర్శిస్తోంది.