భారతీయులు ఏ దేశంలో ఉన్నా తమ సంపాదనలో పెట్టుబడిగా పెట్టాలనుకుంటే ఎక్కువగా రియల్ ఎస్టేట్‌లోనే పెడతారు. అమెరికాకు ఉద్యోగం కోసం వెళ్లిన వాళ్లు ఎక్కువగా ఇళ్ల కొనుగోళ్లు చేపట్టారు. అయితే ఇప్పుడు ఆ ఇళ్లే సమస్యలుగా మారుతున్నాయి. రిటర్న్స్ లేకపోగా దేశం నుంచి వెనక్కి వెళ్లిపోవాలన్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
హెచ్ వన్ బీ వీసా మీద ఉద్యోగం చేస్తున్న వారు ఒకటికి రెండు ఇళ్లు కొనుగోలు చేశారు. ఒకటి ఉండటానికి మరకొటి రెంట్ కు ఇవ్వడానికి అన్నట్లుగా తమకు వచ్చే ఆదాయాలను వెచ్చించారు. అయితే అమెరికాలో అయినా ఇల్లు కొనాలంటే ఈఎంఐల మీద ఆధారపడాల్సిందే. వచ్చే అద్దె డబ్బులతో ఈఎంఐలు కట్టవచ్చని అనుకున్నారు. ఇప్పుడు అమెరికాలో పరిస్థితి మారిపోయింది. చాలా ఇళ్లు ఖాళీగా ఉంటున్నాయి. సాఫ్ట్ వేర్ రంగం అనిశ్చితితో .. రుణభారం తగ్గించుకుందామని కొన్న ఇళ్లను అమ్మేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికాలో రియల్ ఎస్టేట్ ఇప్పుడు సంక్షోభంలో ఉంది. అందుకే అమ్ముకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు.
ఇల్లు కొనుక్కోవడం.. అదనంగా అద్దెల కోసం మరో ఇంటిని సమకూర్చుకోవడం అనే మైండ్ సెట్ భారతీయుల మైండ్ సెట్ లో స్థిరపడిపోయింది. అమెరికాకు వెళ్లినా అంతే. ఇప్పుడు అమెరికాలో రుణాలు ఇచ్చే సంస్థలు కూడా హెచ్ వన్ బీ ఉన్న వారికి రుణాలిచ్చేందుకు చాలా రూల్స్ పెడుతున్నారు. గ్రీన్ కార్డు ఉంటే తప్ప.. ఆస్తులు కొనుగోలు చేయడానికి రుణం పుట్టించడం కష్టంగా మారుతోంది.
స్వదేశంలో పెట్టుబడులు పెట్టిన వారు కాస్త సేఫ్‌గానే ఉంటున్నారు. కానీ అమెరికాలో ఇళ్లపై పెట్టుబడులు పెట్టిన వారు మాత్రం తమ డబ్బులు తమకు వస్తే చారని.. రుణం లేకపోతే చాలని టెన్షన్ పడుతున్నారు.