వైకాపాపై సందేహం ఎందుకు కలుగుతున్నదంటే…

రాజధాని అమరావతి భూముల కొనుగోలు వ్యవహారంలో అడ్డగోలుగా అక్రమాలు జరిగాయనే అనుకుందాం. ఈవిషయం మీద సుమారు పది రోజులకు పైగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు అందరూ పెద్దపెట్టున ఉద్యమిస్తూనే ఉన్నారు. ప్రకటనలు గుప్పిస్తూనే ఉన్నారు. తమ దినపత్రిక సాక్షి ద్వారా విస్తృతమైన ప్రచారాన్ని చేస్తూనే ఉన్నారు. కానీ వైకాపా నాయకుల ఆరోపణల మీద మాత్రం జనంలో ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఒక పార్టీకి చెందిన సుమారు 60 మంది ఎమ్మెల్యేలు ఇంత ఉధృతంగా ఒక అంశాన్ని భుజానికెత్తుకున్నప్పుడు, రాష్ట్రంలో అత్యధిక సర్కులేషన్‌ ఉన్న పత్రికల్లో ఒకటైన సాక్షి.. ఇంతగా వారి పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఆరాటపడుతున్నప్పుడు.. ప్రజల్లో చాలా ఎక్కువ స్పందన రావాలి. కానీ ప్రజల్లో ఎక్కడా అలాంటి స్పందన కనిపించడం లేదు. ప్రజలు పట్టించుకోకపోవడాన్ని గమనిస్తే.. అసలు జగన్‌ అండ్‌ కో ఆరోపణల్లోనే బలం లేదా అనే అనుమానం కలుగుతోంది.

ప్రత్యేకించి.. గుంటూరుజిల్లా మందడంలో అమరావతి ప్రాంత రైతులు బుధవారం నాడు ఒక సమావేశం పెట్టుకున్నారు. తాము అందరూ ఇష్టపడే భూములు ఇచ్చాం, విక్రయించాం అని.. తమ మీద ఎవ్వరూ సానుభూతి చూపించవలసిన అవసరం లేదని అక్కడి రైతులు తేల్చిచెప్పారు. అధికార పార్టీ మీద ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్న ఇలాంటి సమయంలో రైతులు నిర్వహించే సమావేశం ఒకవేళ స్వచ్ఛందం అయినప్పటికీ కూడా తెరవెనుకనుంచి అధికార పార్టీకి చెందిన రాజకీయ శక్తులే దీనిని నిర్వహింపజేసి ఉంటాయని అనుకోవచ్చు. ఇది చాలా సహజం. తెదేపా వారే ఆ సమావేశం ఏర్పాటు చేయించి.. ల్యాండ్‌పూలింగ్‌, లేదా విక్రయించిన రైతుల్లో వ్యతిరేకత లేదని టముకు వేయిస్తున్నారని అనుకుందాం. మరైతే.. అదే తరహాలో.. వైకాపా వారి వాదనకు మద్దతుగా.. భూవిక్రయాలు, వారి మాటల్లో అయితే భూదందాల వలన తాము నష్టపోయాం.. తమను దోచుకున్నారు… అంటూ అక్కడి రైతులనుంచి నామమాత్రపు స్పందన కూడా రావడం లేదు ఎందుకని? సరిగ్గా ఈ అంశమే ప్రజల్ని ఆలోచింపజేస్తున్నది.

ప్రత్యేకించి.. ఏ రైతులైతే.. మంత్రుల బినామీలకు భూములు విక్రయించారని వైకాపా ఆరోపిస్తున్నదో.. ఏ రైతులనైతే మంత్రులు దోచేసుకున్నారని, వేల కోట్ల అన్యాయానికి గురిచేశారని వైకాపా బురద చల్లుతున్నదో.. ఆ రైతుల్లో అయినా ఈ పాటికి రియలైజేషన్‌ వచ్చి వారు పోరాటానికి రోడ్డు మీదకు రావాలి కదా? కానీ, అలాంటిదేమీ జరగడం లేదు.

ఈ సంకేతాలను బట్టి గమనిస్తోంటే.. భూదందాలకు సంబంధించి.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంతగా గొంతు చించుకున్నప్పటికీ.. వారికి స్థానికంగా అమరావతి ప్రాంత రైతుల మద్దతు దక్కితే తప్ప.. పోరాటానికి బలం చేకూరదని అనుకోవాల్సి ఉంటుంది. వైకాపా పోరాటంలో బలం లేదని అనిపిస్తోంది. ప్రజల మద్దతు రాబట్టకుండా, వారిలో ఆలోచన కలిగించకుండా.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.. చంద్రబాబు సర్కారు మీద ఎంతగా బురదచల్లినా నిష్ప్రయోజనమేనని జగన్‌ గుర్తిస్తే బాగుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com