13B అనే మాధవన్ హీరోగా వచ్చిన సినిమా చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. ఈ టైటిల్ ఊరకనే పట్టలేదు. 13వ అంతస్తు అంటే ఉండే సహజసిద్ధమైన భయం, సెంటిమెంట్ ను ఉపయోగించి ప్రేక్షకుల్ని భయపెట్టి సినిమాను సక్సెస్ చేసుకున్నారు. నిజంగానే ఆకాశహర్మ్యాల్లో ఇప్పుడు 13వ అంతస్తు ఉండదు.
హైదరాబాద్‌లోని నగరంలో ఎక్కడ చూసినా ఆకాశాన్నంటే భవనాలు పుట్టుకొస్తున్నాయి. 30, 40 అంతస్తులు దాటుతున్న టవర్లలో ఒక్క విచిత్రం మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 12వ అంతస్తు తర్వాత నేరుగా 14వ అంతస్తులోకి వెళ్తున్నారు. కొన్ని చోట్ల 14ని కూడా దాటేసి 15తో మొదలు పెడుతున్నారు. పన్నెండు తర్వాత ఏకంగా పదిహేను తో స్టార్టింగ్ చేస్తున్నారు.
మై హోమ్, ప్రెస్టీజ్, లాంకో హిల్స్, ఫినిక్స్, లాడ్జిక్స్ వంటి దాదాపు అన్ని పెద్ద ప్రాజెక్టుల్లోనూ 13వ నంబర్‌ను పూర్తిగా తొలగించారు. కొన్ని చోట్ల 12 తర్వాత 12A, 12B అని పెట్టి మళ్లీ 14తో కొనసాగిస్తున్నారు. కొంత మంది బిల్డర్లు 13, 14 రెండింటినీ స్కిప్ చేసి నేరుగా 15 నుంచి మొదలు పెడుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో కూడా ఈ ట్రెండ్ ఉంది. అమెరికా, యూరప్‌లోని హోటల్స్, ఆఫీసు భవనాల్లో 13వ ఫ్లోర్ దాదాపు ఉండదు. భారత్‌లో ఇది మరింత బలంగా కొనసాగుతోంది. గత ఐదేళ్లలో హైదరాబాద్‌లో వచ్చిన 200కు పైగా హైరైజ్ ప్రాజెక్టుల్లో కేవలం మూడు-నాలుగు మాత్రమే 13వ అంతస్తు అనే నెంబర్ పెట్టాయి.
ఈ 13వ అంతస్తు లేకపోవడం వాస్తు కాదు, శాస్త్రం కాదు, ఇంజనీరింగ్ సమస్య కాదు – పూర్తిగా మనస్తత్వం, మార్కెటింగ్ వ్యూహం మాత్రమే. ఆ 13ను కొనుగోలుదారులు మంచి సంకేతంగా చూడరు కాబట్టి ఆ నెంబర్ పెట్టడం లేదు. కానీ.. పన్నెండు తర్వాత పదిహేను అని నెంబర్ పెట్టినంత మాత్రాన పన్నెండు తర్వాత పదమూడు కాకుండా పోతుందా?. నమ్మకాల ముందు ఇలాంటి లాజిక్కులు పని చేయవు.