రేవంత్ రాజీనామా..! దానికీ ఓ కారణం ఉందా..?

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ అసెంబ్లీ రద్దు ఖాయమని తేలిన తర్వాత రేవంత్ రెడ్డి రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్‌లో… మధుసూదనాచారి కార్యాలయంలో ఇవ్వడం రాజకీయవర్గాలను కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది. కెసిఆర్ తీరుకు నిరసనగానే రాజీనామా చేసినట్లు.. రేవంత్ రెడ్డి మీడియాకు తెలిపారు. కేసీఆర్ పిచ్చి చేష్టలతో.. తెలంగాణ నష్టపోతోందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ జాతకం బాగాలేకపోతే..రాష్ట్ర ప్రజలు ఏం పాపం చేశారని ఆయన ప్రశ్నిస్తున్నారు. నిజానికి రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరినప్పుడే రాజీనామా చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే అప్పుడు టీడీపీకి రాజీనామా లేఖతో పాటు.. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా లేఖను.. టీడీపీ అధినేత చంద్రబాబుకే ఇచ్చారు. చంద్రబాబు వాటిని టీ టీడీపీ నేతలకు పంపారని ప్రచారం జరిగింది.

కానీ తెలంగాణ టీడీపీ నేతలు వాటిని పట్టించుకోలేదు. స్పీకర్‌కు పంపలేదు. దాంతో.. రేవంత్ రాజీనామా వ్యవహారం అక్కడితో ముగిసిపోయింది. అప్పట్లో ఉపఎన్నిక వస్తుందేమోనని.. టీఆర్ఎస్ కూడా.. సన్నాహాలు చేసుకుంది. మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడ్ని అభ్యర్థిగా ఖరారు చేసుకుని గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది. కానీ… ఆ తర్వాత రేవంత్ రాజీనామా లేఖ వ్యవహారం కనురమరుగయింది. అప్పటి నుంచి రేవంత్ రెడ్డి.. అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. ఎమ్మెల్యేగా జీతభత్యాలు కూడా తీసుకోవడం లేదు. గన్‌మెన్లను కూడా ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అయితే అసెంబ్లీ రద్దు చేయడం ఖాయమని తేలిపోయిన తర్వాత ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయడం ఎందుకన్న ప్రశ్న రాజకీయవర్గాల్లో వస్తోంది. దీనికి కొన్ని కారణాలను రేవంత్ వర్గీయులు చెబుతున్నారు. కేసీఆర్‌ను రేవంత్‌ను రాజకీయంగా టార్గెట్ చేశారు. రేవంత్‌ను ఇబ్బంది పెట్టే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడానికి కేసీఆర్ సిద్ధంగా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఫిరాయింపుల కింద.. రేవంత్‌పై అనర్హతా వేటు వేసే అవకాశం ఉందన్న సమాచారం రావడంతోనే.. రేవంత్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

అసెంబ్లీని రద్దు చేయాలన్న కేబినెట్‌ తీర్మానాన్ని స్పీకర్ ధృవీకించాల్సి ఉంటుంది. స్పీకర్ సంతకం చేసి పంపే తీర్మానాన్ని మాత్రమే గవర్నర్ గుర్తిస్తారు. దానికే ఆమోద ముద్ర వేస్తారు. తీర్మానంపై సంతకం చేసి.. గవర్నర్‌కు పంపే ముందు స్పీకర్.. తన వద్ద పెండింగ్‌లో ఉన్న ఇతర అనర్హతా పిటిషన్లు, రాజీనామా లేఖలపై కచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇలా కొన్ని ఫిర్యాదులు .. స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. రేవంత్ కూడా పార్టీ మారినందున.. ఫిర్యాదుల్లేకపోయినా..స్పీకర్ తన విచక్షణాధికారాలతో…అనర్హతా వేటు వేస్తే.. అది రేవంత్ రాజకీయ జీవితంలో ఓ మచ్చగా ఉండిపోతుంది. ఇలాంటి అవకాశం కేసీఆర్‌కు ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే.. రేవంత్ రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com