మ‌రో ప్ర‌ణీత‌ని చేస్తారా? అని త్రివిక్ర‌మ్‌ని అడిగా! – అను ఇమ్మానియేల్‌తో ఇంట‌ర్య్వూ

పాపం… అను ఇమ్మానియేల్ కెరీరేమీ చ‌క్క‌గా సాడ‌గం లేదు. చేతికి మంచి సినిమాలే వ‌స్తున్నాయి. కానీ విజ‌యాలు ద‌క్క‌డం లేదు. అజ్ఞాత‌వాసి, నాపేరు సూర్య‌, ఆక్సిజ‌న్ ఇలా వ‌రుస ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రిస్తున్నాయి. అందుకే అను కూడా జాగ్ర‌త్త‌గా అడుగులేస్తోంది. వ‌చ్చిన ప్ర‌తీ సినిమా ఒప్పుకోవ‌డం లేదు. ప్ర‌స్తుతం ‘శైల‌జా రెడ్డి అల్లుడు’లో నాగ చైత‌న్య స‌ర‌స‌న న‌టించింది. ఇందులో పొగ‌రుబోతు అమ్మాయిగా క‌నిపిస్తోంది. ఈనెల 13న ‘శైల‌జా రెడ్డి…’ విడుద‌ల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా అను ఇమ్మానియేల్‌తో చిట్ చాట్‌.

ఇందులో ఈగో ఉన్న అమ్మాయి పాత్ర అని తెలిసింది.. నిజ జీవితంలోనూ మీరు అంతేనా?

(న‌వ్వుతూ) ప్ర‌తీ ఒక్కరికీ ఎంతో కొంత ఈగో ఉంటుంది. ఈగో లేనివాళ్లంటూ ఎవ్వ‌రూ ఉండ‌రు. నాక్కూడా ఈగో ఉంది. అయితే.. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర‌కు ఉన్నంత కాదు. నాకు కోపం ఎక్కువ‌. అయితే అది ఎవ‌రిపై చూపించాలో వాళ్ల‌పైనే చూపిస్తా. `శైల‌జారెడ్డి అల్లుడు`లో అను అలా కాదు. ఎవ‌రిపైనానా త‌న కోపం, ఈగో చూపించ‌గ‌ల‌దు.

మీ పాత్ర‌లోని ప్ర‌త్యేక‌త‌లేంటి?

ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ త‌ర‌హా పాత్ర చేయ‌లేదు. నా గ‌త చిత్రాలు చూడండి.. చాలా సెటిల్డ్‌గా క‌నిపిస్తా. పెద్ద‌గా డైలాగులు కూడా ఉండ‌వు. ఇందులో అలా కాదు. నాతో చాలా డైలాగులు ప‌లికించారు. లౌడ్‌గా మాట్లాడుతుంటా. నా పాత్ర నుంచి వినోదం కూడా రాబ‌ట్టారు. అది నాకు బాగా న‌చ్చింది.

చైతూతో తొలిసారి చేశారు.. సెట్లో ఎలా ఉండేవాడు?

త‌ను చాలా డీసెంట్‌. మంచి న‌టుడు కూడా. అలాంటి వాళ్ల‌తో ప‌ని చేయ‌డం చాలా సుల‌భం.

ర‌మ్య‌కృష్ణ‌లాంటి సీనియ‌ర్ న‌టి మీకు అమ్మ‌గా చేశారు. ఆమెని చూస్తే ఏమ‌నిపించింది?

ఆమెలో ఏదో తెలియ‌ని ప‌వ‌ర్ క‌నిపించింది. సెట్లో రాగానే అంద‌రిలోనూ ఉత్సాహం క‌లిగేది. మేం సాధార‌ణంగా.. డైలాగుల్ని చ‌దివి, నేర్చుకుని సెట్లో అడుగుపెట్టేవాళ్లం. కానీ ర‌మ్య మేడమ్ అలా కాదు. సెట్‌కి వ‌చ్చాకే డైలాగులు చూసుకునేవారు. కానీ క్ష‌ణాల్లో అర్థం చేసుకుని పాత్ర‌లో లీన‌మైపోయేవారు. ఆమె డైలాగులు చెబుతుంటే నేను అలా చూస్తుండిపోయేదాన్ని. కొన్నిసార్లు నా డైలాగులు కూడా మ‌ర్చిపోయాను.

అందం గురించి గానీ, న‌ట‌న గురించి గానీ మీకేమైనా స‌ల‌హాలు ఇచ్చారా?

అందం గురించి ఏమీ అడ‌గ‌లేదు. న‌ట‌న గురించి, నా కెరీర్ గురించీ ఆమెతో చ‌ర్చించాను. ‘ఈ ద‌శ‌లో గెలుపు ఓట‌ములు మామూలే. అవేం మ‌న చేతుల్లో ఉండ‌వు. వాటి గురించి పెద్ద‌గా ఆలోచించ‌కు’ అన్నారు.

నిజంగానే ఓట‌ముల గురించి ప‌ట్టించుకోరా?

ప‌ట్టించుకోకుండా ఎలా ఉంటాను? నా సినిమా విడుద‌ల అవుతోందంటే చాలా టెన్ష‌న్ ప‌డిపోతాను. కాక‌పోతే ర‌మ్య మేడ‌మ్ చెప్పింది నిజం.. కొన్ని సినిమాలు మ‌న చేతుల్లో ఉండ‌వు.

అజ్ఞాత‌వాసి ప‌రాజ‌యం మిమ్మ‌ల్ని బాధించిందా?

చాలా పెద్ద సంస్థ‌, చాలా పెద్ద ద‌ర్శ‌కుడు, స్టార్ హీరో.. వీళ్ల‌తో చేసే ఏ సినిమాపైనైనా న‌మ్మ‌కాలు ఉంచుకుంటాం. ఆ సినిమాపైనా అలానే ఆశ‌లు పెంచుకున్నా. కానీ ఫ‌లితం రాలేదు.

ఆ సినిమా త్రివిక్ర‌మ్ కోసం చేశారా, ప‌వ‌న్ కోస‌మా?

ఇద్ద‌రి కోసం. నో చెప్ప‌డానికి నా ద‌గ్గ‌ర కార‌ణాలు దొర‌క‌లేదు. అన్నింటికంటే మించి క‌థ విన్నాను. ఆ త‌ర‌వాతే ఒప్పుకున్నాను. నాది రెండో నాయిక పాత్రే కావొచ్చు. కానీ క‌థ‌లో ప్రాధాన్యం ఉంద‌నిపించింది. స్క్రిప్టు విన్న త‌ర‌వాత కూడా ‘నన్ను అత్తారింటికి దారేదిలో ప్ర‌ణీత‌ను చేయ‌రు క‌దా’ అని అడిగాను. ‘లేదు… చాలా మంచి పాత్ర‌’ అని త్రివిక్ర‌మ్ గారు కూడా చెప్పారు. అందుకే ఒప్పుకున్నా.

ఓ క‌థ విని.. మీరే నిర్ణ‌యం తీసుకుంటారా, మీ మేనేజ‌ర్లు, ఇంటి స‌భ్యుల స‌ల‌హాలూ తీసుకుంటారా?

మేనేజ‌ర్లు నా డేట్లు చూస్తారంతే. క‌థ‌లు కాదు. నా నిర్ణ‌యాలు నేనే తీసుకుంటా.

స‌రైన విజ‌యం ఇంకా రాలేద‌న్న బాధ ఉందా?

ఎవ‌రి కెరీర్‌కైనా ఓ మంచి సినిమా చాలు. జాత‌కం మారిపోతుంది. కీర్తి సురేష్ చూడండి.. `మ‌హాన‌టి`తో త‌న‌ని తాను నిరూపించుకుంది. అలాంటి అవ‌కాశం రావాలి. అది వ‌స్తే.. అన్నీ మ‌నం అనుకున్న‌ట్టే జ‌రుగుతాయి.

గీత గోవిందం ఆఫ‌ర్ ముందు మీకే వ‌చ్చింది.. కానీ వ‌దులుకున్నారు. కార‌ణ‌మేంటి?

ఆ స‌మ‌యంలో నా చేతి నిండా సినిమాలున్నాయి. నాపేరు సూర్య – గీత గోవిందం రెండింటిలో ఏ సినిమా చేయాలి? అనే మీమాంశ‌లో… గీత గోవిందం వ‌దులుకున్నా. కానీ.. అందులో ఓ చిన్న పాత్ర చేశా. అది కూడా ద‌ర్శ‌క నిర్మాత‌లు అడిగినందునే.

మిగిలిన భాష‌ల్లోనూ సినిమాలు చేస్తారా?

ఇది వ‌ర‌కు త‌మిళ సినిమా చేశా క‌దా? మిగిలిన భాష‌ల్లోనూ అవ‌కాశాలొస్తున్నాయి. అయితే.. తెలుగులో పూర్తి స్థాయిలో నిరూపించుకున్న త‌ర‌వాతే మిగిలిన భాష‌ల్లో దృష్టి పెట్టాలి. లేదంటే.. దేనికీ న్యాయం చేయ‌లేం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com