తెలంగాణలో యూరియా సమస్య తీవ్రమైంది. రైతుల కష్టాలు ఊహించనంత ఎక్కువగా ఉన్నాయి. గత కొన్నాళ్లుగా లేని సమస్య ఈ ఏడాది వచ్చింది. అన్ని పార్టీలు ఒకరిపై ఒకరు నిందలేసుకుంటున్నారు. కేంద్రమే యూరియా ఇవ్వాల్సి ఉందని కానీ ఇవ్వడం లేదని తెలంగాణ అంటోంది. కావాల్సినంత యూరియా సరఫరా చేస్తున్నామని.. డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ ఇంకా కేటాయిస్తున్నామని బీజేపీ నేతలంటున్నారు. రెండు పార్టీలు కలిసి నాటకాలాడుతున్నాయని బీఆర్ఎస్ అంటోంది. ఇలా ఎవరికి వారు నిందలు వేసుకుంటున్నారు కానీ పరిష్కారం మాత్రం కనిపించడం లేదు.
యూరియా కోసం రైతుల వెతలు
రైతులకు పంట సాగు ప్రారంభించాలంటే యూరియా లేకపోతే అడుగు ముందుకు పడదు. వ్యవస్థీకృతమైన పంపిణీ వ్యవస్థ ద్వారా సబ్సిడీ ధరలకు రైతులకు యూరియా అందిస్తారు. అయితే ఇది గాడి తప్పింది. వంపిణీ అస్థవ్యస్థంగా మారింది. ఫలితంగా పీఏసీఎస్‌ల ముందు రైతులు పడిగాపులు పడుతున్నారు. చెప్పులు లైన్లో పెట్టి.. ఎపుడు యూరియా బస్తాలు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఈ రోజుల్లో ఇలాంటి పరిస్థితిని ఊహించడం కష్టం. కానీ అలాంటి కష్టాలు మాత్రం వచ్చేశాయి.
తప్పు ఎవరిదైనా బాధ్యత మాత్రం కాంగ్రెస్ సర్కార్ దే !
ఇక్కడ అసలు సమస్య ప్రభుత్వ యంత్రాగం నిర్లక్ష్యానిదే. ఎంత యూరియా అవసరం పడుతుందన్నది సరిగ్గా అంచనా వేసుకోలేపోయారు. ఎంత వస్తుందన్నది కూడా అంచనా లేదు. చివరికి వచ్చిన యూరియాను పంపిణీ చేయడానికీ రూట్ మ్యాచ్ లేదు. అసలు రైతులకు ఎలాంటి సమాచారం లేదు. ఫలితంగానే ఈ పరిస్థితి ఏర్పడింది. కనీసం లైన్లలో నిలబడకుండా.. ఫలానా తేదీన మీకు యూరియా అందుతుంది వచ్చి తీసుకోండి అనే సమాచారం నమోదు చేసుకున్న రైతులకు ఇచ్చేలా ఏర్పాట్లు చేసినా రైతులు ఇలా పడిగాపులు పడేవారు కాదు. ఇక్కడ తప్పు ఎవరిది అన్నది కాదు.. బాధ్యత మాత్రం కాంగ్రెస్ పార్టీపై పడింది. అధికారంలో ఉంది కాంగ్రెస్ కాబట్టి బాధ్యత కూడా తీసుకోవాల్సి ఉంది.
నానో యూరియాపై ఎందుకు చైతన్యం కల్పించలేకపోయారు ?
యూరియా సమస్య ఏర్పడుతుందని తెలిసినప్పుడు.. నానో యూరియాపై ఎక్కువగా అవగాహన కల్పించాల్సి ఉంది. నిజానికి నానో యూరియా అందుబాటులో ఉంది. కానీ రైతులకు దానిపై నమ్మకం లేదు. నానో యూరియా ఇస్తామన్నా వారు తీసుకోవడం లేదు. ఇలాంటి ఉత్పత్తులను విడుదల చేసేటప్పుడు.. అందుబాటులోకి తెచ్చేటప్పుడే.. వాటిపై వినియోగదారులకు నమ్మకం కలిగించేలా చేయడం మార్కెటింగ్ స్ట్రాటజీ. ఓ ఉత్పత్తికి ప్రత్యామ్నాయంగా తీసుకు వస్తున్నప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కనీసం ఆ ప్రయత్నం కూడా నానో యూరియా విషయంలో తీసుకోలేదు.
తప్పుడు ఎవరిది అన్నది రాజకీయాలకు మాత్రమే అవసరం. రైతులకు అవసరం లేదు. రైతులకు కావాల్సింది యూరియా. అది అందించే ఏర్పాట్లను అధికారంలో ఉన్న పార్టీలు చేయాలి. రాజకీయాలు ఎక్కడైనా చేయవచ్చు కానీ రైతుల్ని ఇబ్బంది పెట్టి.. తప్పు మీదంటే మీది అని నిందలేసుకోవడం వల్ల కాదు.