బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలయింది. విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని ఎస్ఈసీని ప్రశ్నించింది. ఏ క్షణమైనా ఇస్తామని ఈసీ తరపు న్యాయవాది చెప్పారు. ఎన్నికల ప్రక్రియలో కోర్టు జోక్యం చేసుకోకూడదంటే..ఎన్నికలు వాయిదా వేసుకోవాలని న్యాయమూర్తి సూచించారు. ఇంత హడావుడిగా రిజర్వేషన్ల జీవో ఇచ్చి నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం ఏముందని కావాలనుకుంటే.. హైకోర్టును మరింత గడువు కోరవచ్చు కదా అని ప్రశ్నించారు.
ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సమయం కోరడంతో తదుపరి విచారణను న్యాయమూర్తి వచ్చే నెల ఎనిమిదోతేదీకి వాయిదా వేశారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన విచారణ కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. గవర్నర్ వద్ద బిల్లులు పెండింగ్ లో ఉన్నప్పుడు జీవోలు ఎలా ఇస్తారని హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఆ బిల్లులకు..ఈ జీవోకు సంబంధం లేదని ఏజీ న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు.
జీవో ఏ విధంగా చూసినా చెల్లుబాటు కాదన్న అభిప్రాయం ఉంది. ఒక వేల ఆ జీవో ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తూ నోటిఫికేషన్ ఇస్తే.. కోర్టు వివాదాల్లో ఇరుక్కుంటుంది. ఆ జీవోపై హైకోర్టు స్టే ఇస్తే.. ఎన్నికల ప్రక్రియ కూడా ఆగిపోతుంది. అలా జరగకూడదంటే ఆ పిటిషన్ పై హైకోర్టు తేల్చే వరకూ నోటిఫికేషన్ ఇవ్వకూడదు. మరి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో స్పష్టత లేదు. రేపటిలోగా నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.