అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియం లో గెస్ట్ స్పీకర్‌గా పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. మార్చి 27న జరగనున్న ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు, విధాన నిర్ణేతలు , సాంకేతిక నిపుణులతో కలిసి ఆయన వేదికను పంచుకోనున్నారు. ముఖ్యంగా, భారత్ నుండి ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు ఆహ్వానం అందుకున్న ఏకైక నేతగా రేవంత్ రెడ్డి ఉన్నారు.
ఈ సదస్సులో AI as Infrastructure & Compute Power: Impact on Livability & Workforce అనే కీలక అంశంపై ఏర్పాటు చేసిన ప్యానెల్ చర్చలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. కృత్రిమ మేధను కేవలం సాంకేతిక పురోగతిగా కాకుండా, ఒక వ్యూహాత్మక మౌలిక సదుపాయంగా ఎలా పరిగణించాలో ఆయన వివరించనున్నారు. డేటా సెంటర్లు, విద్యుత్ వ్యవస్థలు, ఏఐ కారిడార్ల వంటి మౌలిక వసతులు సమాజ జీవన ప్రమాణాలను, ఉపాధి అవకాశాలను ఎలా ప్రభావితం చేస్తాయనే అంశంపై రేవంత్ రెడ్డి తన విశ్లేషణను ప్రపంచ వేదికపై ఉంచనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ లో భాగంగా నిర్మిస్తున్న ఏఐ సిటీ ప్రాజెక్టుకు దక్కిన అంతర్జాతీయ గుర్తింపుగా ఈ ఆహ్వానమని. రేవంత్ సన్నిహితులు చెబుతున్నారు. భూ కేటాయింపులు, గ్రిడ్ మౌలిక సదుపాయాలు, స్కిల్ డెవలప్మెంట్, నియంత్రణ చట్రాల వంటి అంశాల్లో తెలంగాణ చూపుతున్న చొరవను హార్వర్డ్ నిర్వహణ బృందం ప్రత్యేకంగా ప్రశంసించింది. క్షేత్రస్థాయిలో ఏఐ వ్యవస్థలను ఎలా అమలు చేయాలో తెలంగాణ అనుభవాలు ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా ఉంటాయని హార్వర్డ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఆహ్వానం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది తన వ్యక్తిగత విజయం కాదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల సమిష్టి కృషికి దక్కిన గుర్తింపు అని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి మేధావుల సమక్షంలో తెలంగాణ అభివృద్ధి నమూనాను, తెలంగాణ రైజింగ్ విజన్‌ను వివరించడానికి ఇది ఒక గొప్ప వేదిక అని ఆయన అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను టెక్నాలజీ హబ్‌గా నిలబెట్టాలనే ప్రభుత్వ సంకల్పానికి ఈ ఆహ్వానం మరింత బలాన్ని చేకూర్చిందని ప్రభుత్వం భావిస్తోంది.
