న‌ల్గొండ బ‌రిలోకి రేవంత్ దిగుతున్న‌ది అందుకేనా?

జ‌రుగుతుందో లేదో తెలీదుగానీ, న‌ల్గొండ ఉప ఎన్నిక వ‌స్తుంద‌నే ప్ర‌చారం గ‌తవారం రోజులుగా తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో కీల‌క చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింది. ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డితో ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాజీనామా చేయిస్తార‌నీ, తెరాస‌కు స్వీయ ప‌రీక్ష పెట్టుకుంటార‌నీ, ఉప ఎన్నిక‌లో విజ‌యం సాధించ‌డం ద్వారా తెరాస శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపొచ్చు అనేది ముఖ్య‌మంత్రి వ్యూహమ‌నీ ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనికి తోడుగా ప్ర‌తిప‌క్ష పార్టీలు కూడా న‌ల్గొండ ఉప ఎన్నిక‌కు సిద్ధ‌ప‌డిపోతున్నాయి. న‌ల్గొండ పార్ల‌మెంట‌రీ నియోజ‌క వ‌ర్గంలో కాంగ్రెస్ కు మంచి ప‌ట్టు ఉంద‌నీ, తెరాస‌ను ఓడించ‌డం ద్వారా త‌మ ఆధిప‌త్యాన్ని పెంచుకునే అవ‌కాశం ఉంటుంద‌ని కాంగ్రెస్ నాయ‌కులు పావులు క‌దుపుతున్నారు. తెలుగుదేశం నుంచీ రేవంత్ రెడ్డి పోటీకి సిద్ధ‌మౌతున్న‌ట్టు చెబుతూ ఉండ‌టం విశేషం. త‌న సొంత జిల్లా కాక‌పోయిన‌ప్ప‌టికీ పార్టీ కోసం సాహ‌సోపేత నిర్ణ‌యం తీసుకోబోతున్న‌ట్టు తెలుగుదేశం వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే, న‌ల్గొండ బ‌రిలోకి రేవంత్ పోటీకి దిగ‌డం వెన‌క వేరే వ్యూహం ఉంద‌నేది కూడా వినిపిస్తూ ఉండ‌టం విశేషం!

తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ భ‌విష్య‌త్తు ఏంట‌నేది ప్ర‌స్తుతానికి ప్ర‌శ్నార్థ‌కంగానే ఉంది. చెప్పుకోద‌గ్గ నాయ‌కులెవ్వ‌రూ పార్టీలో లేరు. ఉన్న కొద్దిమందితో పార్టీకి పున‌ర్వైభ‌వం వచ్చే అవ‌కాశం ఉంద‌ని బ‌లంగా చెప్ప‌లేని ప‌రిస్థితి. రాష్ట్రంలో పార్టీకి బ‌ల‌మైన మూలాలు ఉన్నా, కేడ‌ర్ ను పూర్థిస్థాయిలో స‌మాయ‌త్తం చేసే స‌త్తా రాష్ట్ర నాయ‌క‌త్వంలో క‌నిపించ‌డం లేదు. అన్నిటికీమించి, పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు కూడా తెలంగాణ‌లో పార్టీపై ప్ర‌త్యేకంగా దృష్టి సారిస్తున్న‌ట్టుగా కూడా క‌నిపించ‌డం లేదు. ఆయ‌న కేవ‌లం ఆంధ్రాకే ప‌రిమితం అయిపోతున్నారు. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో టీ టీడీపీలో కాస్త బ‌ల‌మైన నాయ‌కుడు ఎవ‌రంటే రేవంత్ రెడ్డి మాత్ర‌మే క‌నిపిస్తూ వ‌స్తున్నారు. అయితే, పార్టీ రానురానూ ఆద‌ర‌ణ కోల్పోతుంటే ఆయ‌న చూస్తూ ఊరుకోరు క‌దా! ఇప్ప‌టికే రేవంత్ రెడ్డి రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై కొన్ని ఊహాగానాలు చ‌క్క‌ర్లు కొట్టాయి. పార్టీకి అతీతంగా సొంతంగా త‌న‌కంటూ కొంత క‌రిజ్మా ఉంది కాబ‌ట్టి, త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు గురించి రేవంత్ ఆలోచించుకునే అవ‌కాశం ఉంద‌నే చెప్పొచ్చు.

న‌ల్గొండ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డం ద్వారా రెండు ర‌కాల ఆలోచ‌న‌ల‌తో రేవంత్ ఉన్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఒక‌టీ.. ఈ ఎన్నిక‌లో తెలుగుదేశం పార్టీకి క‌నీసం ద్వితీయ స్థానం వ‌చ్చినా, 2019 ఎన్నిక‌ల నాటికి పార్టీ కేడ‌ర్ ను బ‌లోపేతం చేస్తే ప్ర‌యోజ‌నం ఉంటుంద‌నే నిర్ణ‌యానికి రావ‌డం! రెండూ.. ఒక‌వేళ అనూహ్యంగా తెలుగుదేశం పార్టీకి ఆద‌ర‌ణ క‌రువైతే, త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు గురించి సీరియ‌స్ గా ఆలోచించాల్సిన త‌రుణం వ‌చ్చింద‌నే నిర్ణ‌యానికి రేవంత్ వ‌చ్చే అవ‌కాశం ఉండొచ్చు. ఇప్ప‌టికే రేవంత్ కు భాజ‌పా నుంచి పిలుపు ఉంద‌నీ, ఆయ‌న ఎప్పుడంటే అప్పుడు ఆ పార్టీలోకి తీసుకుంటార‌నే ప్ర‌చారం ఒక‌టి ఉంది. ఈ వ్యూహంతోనే న‌ల్గొండ బ‌రిలోకి రేవంత్ వ‌స్తున్నార‌నే విశ్లేష‌ణ‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తూ ఉండ‌టం విశేషం. లేదంటే, త‌న‌కు ఏమాత్రం ప‌ట్టు లేని న‌ల్గొండ‌కు రేవంత్ ఎందుకొస్తార‌నీ, ఏ వ్యూహం లేకుండా పోటీకి సై అని ఎందుకు అంటారూ అనే వాద‌న వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com