సోషల్‌మీడియాలో సీఎం రేవంత్ రెడ్డిపై అసభ్యకరమైన పోస్టులు పెరిగిపోవడంతో కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో శృతి మించి పోస్టులు పెడుతున్నారని.. దీన్ని సహించేది లేదని తాజాగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద దాడులు చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో రేవంత్ రెడ్డిపై పోస్టులు పెడుతున్నారని.. ఈ పోస్టుల మీద కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని వెంకట్ డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డిపై పెట్టిన పోస్ట్ వల్ల తెలంగాణలోని యువత, విద్యార్థుల మనోభావాలు దెబ్బ తిన్నాయన్నారు. తెలంగాణ వ్యాప్తంగా యువత, విద్యార్థులు రోడ్లు ఎక్కి బీఆర్ఎస్ నాయకులపై, కార్యకర్తలపై దాడులు చేస్తామని.. ఈ పోస్టులకు కేటీఆర్‌ను బాధ్యుడిని చేస్తూ అరెస్ట్ చేయాలన్నారు. సందర్భం లేకుండా, సంబంధం లేకుండా దగ్గినా తుమ్మినా రేవంత్ రెడ్డి గారిని ప్రతీ దాంట్లో వేలెత్తి చూపడం ఫ్యాషన్ అయిందని విమర్శించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌కు వెంకట్ ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతానికి సంయమనం పాటించి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పిర్యాదు చేశామని.. ఎంత సంయమనం పాటించిన కూడా మా ఓపికకి, ఓర్పుకు ఒక హద్దు ఉంటదని హెచ్చరించారు. మీ మంచికే చెప్తున్నా….ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. ఇటీవలి కాలంలో రేవంత్ రెడ్డిపై ముప్పేట దాడి జరుగుతోంది. ఏం జరిగినా రేవంత్ కు ముడిపెట్టి.. పోస్టులు పెడుతూండటంతో కాంగ్రెస్ నేతల్లో అసహనం కనిపిస్తోంది.