హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి ఆత్మగా వ్యవహరించిన కాంగ్రెస్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆత్మగా మారారని, కేసీఆర్ పంచన చేరి ప్రాజెక్టులు, కాంట్రాక్టులు చక్కబెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ కేవీపీ కనుసన్నలలో నడుస్తున్నారని చెప్పారు. తెలంగాణలో కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులన్నీ కేవీపీ సూచనలలో భాగమేనన్నారు. రేవంత్ ఇవాళ కొడంగల్‌లో మీడియాతో మాట్లాడారు. చర్లపల్లి జైలునుంచి బయటకొచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడటం ఇదే ప్రథమం. చంద్రబాబునాయుడు పాలమూరు ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకమని టీఆర్ఎస్ నేతలు అసత్యప్రచారం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖలో ఎత్తిపోతల పథకాన్ని నిలిపేయాలని ఎక్కడా రాయలేదని వివరణ ఇచ్చారు. ప్రభుత్వమే ఇవాళ మహబూబ్ నగర్ బంద్‌ను నిర్వహించటం అనాగరికంగా ఉందన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశ్యంతోనే బంద్ పాటించి టీఆర్ఎస్ నేతలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. గతంలో ఎక్కడా ప్రభుత్వాలు బంద్‌కు పిలుపునిచ్చిన సందర్భాలు లేవని చెప్పారు. ప్రాణహిత ప్రాజెక్ట్ కోసం హరీష్ ఆమరణ నిరాహారదీక్ష చేస్తే తాను మద్దతిస్తానని అన్నారు.