తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాన్ఫిడెన్స్ చాలా హై లో ఉంది. ఎంతగా అంటే పక్క రాష్ట్రాలను తక్కువ చేసి.. ఉపయోగం లేని ప్లస్ పాయింట్లను సైతం తమకు అనుకూలం అనుకుంటున్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన పాడ్ కాస్ట్లో అమరాతి గురించి కామెంట్లు చేశారు. మాకు హైదరాబాద్ పెద్ద అనుకూలత అని.. అదే అమరావతి ఏపీకి భారం అని చెప్పుకొచ్చారు. ఎందుకంటే వాతావరణం అంటున్నారు. హైదరాబాద్కు వాతావరణం అనుకూలత అందుని అదే ప్లస్ అని చెప్పుకొచ్చారు.
బహుశా అమరావతికి తుపాన్లు వస్తాయి.. హైదరాబాద్ కు రావని రేవంత్ ఉద్దేశం కావొచ్చు. తుపాన్లు రానిదెక్కడ. ముంబైకి వస్తాయి. కానీ ఆర్థిక రాజధానిగా ఎదిగింది. అమరావతి కంటే హైదరాబాద్ చాలా బెదరని చెప్పేందుకు రేవంత్ ఇలా పోలికలు చూసుకున్నారు. నాయకత్వాన్ని కూడా పోల్చుకోవడం కాస్త విచిత్రంగా ఉంది. చంద్రబాబు చాలా సీనియర్ అని.. లోకేష్ చాలా జూనియర్ అని.. తనకు మధ్య వయసు అని అది కూడా తనకు అడ్వాంటేజ్ అని చెప్పుకచ్చారు.
ఇవన్నీ అభివృద్ధికి, పెట్టుబడులకు ఎలా అనుకూలమో రేవంత్ కే తెలియాలి కానీ.. వాతావరణం, వయసు తో హైదరాబాద్ ను రేవంత్ ఏం రేంజ్ కు తీసుకెళ్తారో చెప్పడం కష్టం. కానీ అమరావతి విషయంలో ఆయన నెగెటివ్ అభిప్రాయం వ్యక్తం చేయడం మాత్రం ఈర్ష్యతోనే. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా తాను అనుకున్న ఫోర్త్ సిటీ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. అలాంటిది చంద్రబాబు వేల ఎకరాలను భూమిని సమీకరించి.. జగన్ ఐదేళ్లు దాన్ని శిథిలం చేసినప్పటికీ.. ఓ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించి నిర్మిస్తున్నారు.
పరిపాలనలో రేవంత్ తన వయసునే గొప్పగా చెప్పుకుంటున్నారు. రాజకీయాల్లో వయసు అనేది కీలకం కాదనేది ఆయన ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో కానీ ఇలా మాట్లాడుతూ పోతే ఆయనకు అధికారగర్వం నెత్తికెక్కిందని అనుకుంటారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికీ వ్యతిరేకత వస్తుంది. దాన్ని వీలైనంత తక్కువగా ఉంచుకోవడమే నాయకుడి కర్తవ్యం. ఇలా అందరినీ వ్యతిరేకం చేసుకుంటే.. రాజకీయంగా నష్టమే జరుగుతుంది.