తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్క్ వ్యూహరచన ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. తన కేబినెట్ సహచరులపై విపక్ష బీఆర్ఎస్ అక్రమ మైనింగ్ ఆరోపణలు చేయడమే తడవుగా, రేవంత్ రెడ్డి ఆ అస్త్రాన్ని తిరిగి వారిపైకే ఎక్కుపెట్టారు. కేవలం ఒక మంత్రిని సమర్థించుకోవడమే కాకుండా, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని మైనింగ్ అక్రమాల చిట్టాను బయటకు తీసేలా సీఐడీ విచారణకు ఆదేశించడం రాజకీయంగా కీలక వ్యూహం.
రేవంత్ రెడ్డి రివర్స్ గేర్ రాజకీయం
సాధారణంగా ప్రభుత్వంపై ఆరోపణలు వస్తే డిఫెన్స్‌లో పడటం చూస్తుంటాం. కానీ రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా బెస్ట్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అనే సూత్రాన్ని నమ్ముకున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు వంటి వారు చేసిన ఆరోపణలను ఆయన బ్లాక్మెయిల్ పాలిటిక్స్ గా కొట్టిపారేశారు. అక్కడితో ఆగకుండా, 2014 జూన్ 2 నుంచి నేటి వరకు జరిగిన అన్ని మైనింగ్ అనుమతులు, ఇసుక క్వారీలు, గ్రానైట్ లీజులపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించి బీఆర్ఎస్ను ఆత్మరక్షణలోకి నెట్టేశారు.
ఇరుక్కున్న బీఆర్ఎస్ అగ్రనేతలు
ఈ విచారణ ప్రకటనతో ముఖ్యంగా కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో మైనింగ్ సామ్రాజ్యాలను ఏలుతున్న బీఆర్ఎస్ కీలక నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్‌కు చెందిన శ్వేత గ్రానైట్స్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు చెందిన గాయత్రి గ్రానైట్స్ కంపెనీలపై ఇప్పటికే ఈడీ నిఘా ఉంది. ఇప్పుడు రాష్ట్ర స్థాయి సీఐడీ విచారణ కూడా తోడైతే, పాత బకాయిలు, రాయల్టీ ఎగవేతలు, ఫెమా ఉల్లంఘనలు అన్నీ ఒకేసారి బయటకు వచ్చే ప్రమాదం ఉంది. ఇది వారిని రాజకీయంగా మౌనంగా ఉండేలా చేయడమో లేదా ఉనికిని కాపాడుకోవడానికి పార్టీ మారేలా ఒత్తిడి చేయడమో జరగవచ్చు.
పొంగులేటికి క్లీన్ చిట్ వ్యూహం?
విపక్షాలు టార్గెట్ చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా ఉన్నారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై విచారణ జరుగుతుందని చెబుతూనే, ఆ సంస్థపై ప్రభుత్వం ఇప్పటికే జరిమానాలు విధించిందని, ఇది తాము స్వతహాగా తీసుకున్న చర్యే తప్ప ఎవరో చెబితే చేసింది కాదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో సమగ్ర విచారణ పూర్తయ్యే నాటికి పొంగులేటికి క్లీన్ చిట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. తద్వారా తన మంత్రిని కాపాడుకుంటూనే, ప్రత్యర్థుల పునాదులను కదిలించేలా ఆయన పావులు కదిపారు.
ఆర్థిక మూలాలపై దెబ్బ – రాజకీయంగా బలహీనత
ఏ రాజకీయ పార్టీకైనా బలమైన నాయకులతో పాటు వారికి ఆర్థికంగా మద్దతు ఇచ్చే వర్గాలు ముఖ్యం. ఇప్పుడు మైనింగ్ మాఫియాపై విచారణ పేరుతో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఆర్థిక మూలాలనే దెబ్బకొడుతున్నారు. గతంలో ఇసుక దోపిడీ వల్ల రాష్ట్ర ఖజానాకు గండి పడింది, ఇప్పుడు మా హయాంలో ఆదాయం 32 శాతం పెరిగింది అని గణాంకాలతో సహా నిరూపించడం ద్వారా ప్రజల్లో కూడా ఒక పాజిటివ్ మైలేజ్ పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇది బీఆర్ఎస్కు వెన్నుదన్నుగా నిలిచే కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలను భయపెట్టేలా ఉంది. ఇది బీఆర్ఎస్ చేసుకున్నదే. రేవంత్ రాజకీయాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చిన సమస్య.
