తెలంగాణ రాజకీయాల్లో ఆధ్యాత్మికతకు, రాజకీయ వ్యూహాలకు విడదీయలేని సంబంధం ఉంది. గత పదేళ్లుగా కేసీఆర్ హయాంలో వైష్ణవ భక్తి పంథా, ముఖ్యంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణం ఒక వెలుగు వెలిగింది. అయితే, రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక రాష్ట్రంలో శైవం ప్రాధాన్యత పెరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం యాదృచ్ఛికమా లేక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిపాదిస్తున్న సరికొత్త రాజకీయ సిద్ధాంతం
కేసీఆర్ వైష్ణవ వైభవం వర్సెస్ రేవంత్ శైవ ముద్ర
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిని దక్షిణాది అయోధ్యగా తీర్చిదిద్దడం వెనుక ఒక బలమైన వైష్ణవ సంప్రదాయం కనిపిస్తుంది. చినజీయర్ స్వామి మార్గదర్శకత్వంలో జరిగిన యజ్ఞయాగాదులు, ఆలయ నిర్మాణం అంతా వైష్ణవ శైలిలోనే సాగింది. దీనికి భిన్నంగా, రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. వందల కోట్ల నిధులతో వేములవాడ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయడం, కొండగట్టు అంజన్న ఆలయానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రేవంత్ తన ఆధ్యాత్మిక పంథాను శైవం వైపు మళ్లించినట్లు స్పష్టమవుతోంది.
రాహుల్ గాంధీ శివతత్వం – రేవంత్ అనుసరణ
ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో తనను తాను శివ భక్తుడిగా అభివర్ణించుకుంటున్నారు. పార్లమెంటులో సైతం శివుని ఫోటోను చూపిస్తూ అభయం గురించి మాట్లాడటం, శివుడు సామాన్యుల దేవుడు, ఆడంబరాలకు దూరంగా ఉండేవాడు” అని చెప్పడం గమనార్హం. హైదరాబాద్ పర్యటనలోనూ ఆయన పరోక్షంగా వైష్ణవ సంప్రదాయంలోని ఆడంబరాలను, బీజేపీ అనుసరించే హిందుత్వాన్ని వేరు చేస్తూ, శైవంలోని వైరాగ్యాన్ని, కరుణను కొనియాడారు. రేవంత్ రెడ్డి కూడా అదే లైన్ లో ప్రయాణిస్తూ, సామాన్య ప్రజలకు దగ్గరగా ఉండే శైవ క్షేత్రాలను అభివృద్ధి చేయడం ద్వారా రాహుల్ గాంధీ సోషల్ ఇంజనీరింగ్ పాలసీని అమలు చేస్తున్నట్లు భావించవచ్చు .
సామాజిక వర్గాల సమీకరణ – రాజకీయ కోణం
శైవం , వైష్ణవం వెనుక లోతైన సామాజిక సమీకరణాలు కూడా ఉన్నాయి. చారిత్రక కోణంలో చూస్తే, శైవం తరచుగా అణగారిన వర్గాలకు, విప్లవాత్మక మార్పులకు ప్రతీకగా నిలిచింది. రేవంత్ రెడ్డి ఈ శైవ క్షేత్రాలను ప్రోత్సహించడం ద్వారా అట్టడుగు వర్గాలకు ఆధ్యాత్మికంగా దగ్గరవ్వాలని చూస్తున్నారు. కేసీఆర్ వైష్ణవ భక్తిని అగ్రవర్ణాల లేదా వ్యవస్థీకృత సంస్థల ప్రాబల్యంగా చిత్రీకరించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది. వేములవాడను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారనే ప్రచారాన్ని రేవంత్ రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకున్నారు. యాదాద్రికి ఇచ్చిన ప్రాధాన్యత వేములవాడకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తూ, అక్కడ భారీ స్థాయిలో నిధులు కేటాయించడం ద్వారా ఉత్తర తెలంగాణ సెంటిమెంట్‌ను తట్టిలేపారు. ఈ ఆధ్యాత్మిక రాజకీయ యుద్ధం వల్ల లాభనష్టాలను అప్పుడే అంచనా వేయలేము కానీ ప్రభావం అయితే ఉంటుందని అనుకోవచ్చు.


