బీసీ రిజర్వేషన్ల బిల్లు లేదా ఆర్డినెన్స్‌లకు ఆమోద ముద్ర వేయించుకోవడానికి ఢిల్లీలోనే పోరాటం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ తరపున కాకుండా ప్రభుత్వం తరపునే ఢిల్లీలో జంతర్ మంతర్ లో ధర్నా చేయాలని నిర్ణయించారు. వచ్చే నెలలో మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులంతా ఢిల్లీలో మకాం వేసి ధర్నాలు, భేటీలు జరపనున్నారు. అయితే ఎన్ని చేసినా రిజర్వేషన్ల బిల్లుకు లేదా ఆర్డినెన్స్‌కు ఆమోదం లభించడం దాదాపుగా అసాధ్యం. కానీ బీజేపీని తప్పు పట్టవచ్చు. దాని వచ్చే లాభం ఎంత అనేది ఆమాత్రం అస్పష్టం.
రాజ్యాంగాన్ని సవరిస్తేనే బీసీ రిజర్వేషన్లు
రిజర్వేషన్ల రాజకీయం చాలా అంటే చాలా జరిగిపోయిన రాజకీయం. దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు పెట్టిన రూల్ ప్రకారం రిజర్వేషన్లు యాభై శాతం దాటకూడదు. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ లిమిట్ కు రిజర్వేషన్లు చేరాయి. కానీ డిమాండ్లు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ రిజర్వేషన్లను ఇవ్వాలంటే.. రాజ్యాంగసవరణ చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. ఏదైనా రాజకీయ పార్టీ రిజర్వేషన్లు ఇస్తామంటే ప్రజలు కూడా నమ్మడం మర్చిపోయారు. అదో జిమ్మిక్ అనుకుంటున్నారు.
42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం.. కేంద్రంలోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తుందని.. అప్పుడు దేశవ్యాప్తంగా కులగణన చేసి జనాభా ప్రాతిపదికన అందరికీ రిజర్వేషన్లు ఖరారు చేస్తామని అనుకున్నారు. కానీ కేంద్రంలో కాంగ్రెస్ రాలేదు. ఇప్పుడు చెప్పినట్లుగా తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాలి. తమ పార్టీ కేంద్రంలో రాలేదు కాబట్టి కష్టమని ప్రజలను కన్విన్స్ చేయాల్సింది పోయి.. పోరాడి సాధిస్తామని రాజకీయం ప్రారంభించారు.
స్థానిక ఎన్నికలను రిస్క్ లో పెట్టుకుని ఏం ప్రయోజనం?
స్థానిక సంస్థలకు పదవి కాలాలు ముగిసిపోయి చాలా కాలం అయింది. వాటికి ఎన్నికలు నిర్వహించాలని కోర్టు కూడా ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం నెలాఖరులోపు రిజర్వేషన్లు ఖరారు చేసి.. ఆ తర్వాత రెండు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంది. కానీ బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఆర్డినెన్స్ వెనక్కి రాకపోవడంతో.. ఆ రిజర్వేషన్లు ఖరారు చేయలేదు. చేయాలని కూడా అనుకోవడం లేదు. అంటే స్థానిక ఎన్నికలు మళ్లీ వాయిదా పడినట్లే. స్థానిక ఎన్నికలు నిర్వహించకపోతే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా ఇబ్బందికరమే. కేంద్రం నుంచి ఆయా సంస్థలకూ రావాల్సిన నిధులూ రావు. స్థానిక ఎన్నికలకు భయపడుతున్నారని విపక్షాలు విమర్శించే అవకాశం ఉంది.
బీజేపీపై నిందలేసి తప్పించుకోవచ్చా ?
తాము నిఖార్సుగా ఉన్నామని.. కులగణన చేపట్టామని …బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని కాంగ్రెస్ బీజేపీని అంటోంది. సాధ్యం కానీ హామీని కాంగ్రెస్ పార్టీ ఇస్తే తాము ఎందుకు అమలు చేయాలని బీజేపీ అనుకుంటుంది.ఈ రాజకీయంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీని నిందించడం ఖాయమే. కానీ ఇది వర్కవుట్ అవుతుందా అన్నదే అసలు ప్రశ్న.