తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన రోజున తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను ఫ్యూచర్ సిటీలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇది పెట్టుబడుల సదస్సుగా కాకుండా.. పలుకుబడి ప్రదర్శించుకునే సభగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, రాహుల్ గాంధీ సహా నాలుగున్నర వేల మందిని ఆహ్వానించాలని నిర్ణయించారు.
పెట్టుబడుల సదస్సుకు నాలుగున్నరేళ్లు వేల మంది అతిథులు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047 రెండు రోజుల సదస్సు డిసెంబర్ 8, 9 భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీలను ఆహ్వానించనున్నారు. అలాగే అన్ని రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, క్రీడా రంగం ప్రముఖులను ఆహ్వానించేదుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 4,500 మందికి ఆహ్వాన పత్రాలను పంపించారు.
హైదరాబాద్ బ్రాండే ప్రధాన అస్త్రం
సమ్మిట్ ప్రధాన లక్ష్యం తెలంగాణను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్‌గా మార్చడం. 2034 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యాన్ని ప్రకటిస్తారు. CURE (కోర్ అర్బన్ రీజియన్), PURE (పెరి-అర్బన్ రీజియన్), RARE (రూరల్ అగ్రికల్చరల్ రీజియన్) మోడల్‌తో రాష్ట్రాన్ని విభజించి, ప్రతి జోన్‌కు పెట్టుబడులు ఆకర్షించాలనే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దానికి ఈ సమావేశం పునాది కావాలని రేవంత్ ఆశ. హైదరాబాద్ అనే బలమైన ఆకర్షణ శక్తి తెలంగాణకు ఉంది. దాన్ని ఉపయోగించుకుని ఇన్ఫ్రా, ఫార్మా, ఆటోమోబైల్, రియల్ ఎస్టేట్ లలో ‘బ్రాండ్ హైదరాబాద్’ను ప్రపంచానికి చూపించాలని రేవంత్ తాపత్రయపడుతున్నారు.
పొలిటికల్ టచ్ ఇస్తే సదస్సు కాన్సెప్ట్‌కు దెబ్బ
అంతా బాగానే ఉన్నా సమ్మిట్ కు పొలిటికల్ పూత పూయడమే ఇబ్బందికరంగా మారుతోంది. అధికారిక కార్యక్రమం కాబట్టి ప్రధాని మోదీని ఆహ్వానించడం వరకూ బాగానే ఉంటుంది.ఆయన వస్తారా లేదా అన్నది చెప్పడం కష్టం. కనీసం రెండు, మూడు నెలల ముందుగానే ఇలాంటి కార్యక్రమాలకు అపాయింట్మెంట్ ఖరారు చేసుకోవాల్సి ఉంది. అయితే రాహుల్ గాంధీ, ఖర్గేలను ఏ హోదాలో ఆహ్వానిస్తారన్నది మాత్రం తెలియదు. ఇలాంటి అధికారిక కార్యక్రమాలు ముఖ్యంగా పెట్టుబడుల సదస్సులో రాజకీయ వాసనలు అసలు కనిపించకూడదు. పూర్తిగా ప్రొఫెషనల్ గా ఉండాలి. మాతో బిజినెస్ చేస్తే.. పక్కా బిజినెస్ వ్యవహారమే అని పారిశ్రామికవేత్తలకు తెలిసేలా చేయగలగాలి. కానీ వేల మందిని పిలిచి బలప్రదర్శన చేయడం ద్వారా లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే అవకాశం ఉంది.
