మావోయిస్టు రాజకీయ ఆశల్ని తీర్చేందుకు రేవంత్ రెడ్డి ఆసక్తి చూపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. మార్చి 31లోపు లొంగిపోకపోతే.. తర్వాత శాల్తీలు కనిపించడం కష్టమని క్లారిటీ రావడంతో మావోయిస్టు అగ్రనేతలు ప్రజా జీవితంలోకి వచ్చేస్తున్నారు. మిగతా ఎక్కడైనాలొంగిపోతే .. ఎన్ కౌంటర్ చేస్తారనుకున్నారేమో కానీ.. ప్రశాంతంగా.. తెలంగాణలో లొంగిపోతున్నారు. రివార్డులు తీసుకుని.. కొత్త కొత్త డిమాండ్లు ప్రభుత్వం ముందు పెడుతున్నారు. వారిలో కొంత మందికి రాజకీయ ఆశలుఉన్నాయి. మావోయిస్టు చనిపోదని.. తమకు ప్రజల మద్దతు ఉందని నిరూపించాలనుకుంటున్నారు. లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు ఇలాంటి ప్రకటనలే చేస్తున్నారు. సేఫ్ గా లొంగిపోయేలా చేసినా తెలంగాణ ప్రభుత్వం.. కాంగ్రెస్ తరపున వారికి ప్రజా ప్రాతినిధ్యం కూడా కల్పించే ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
మావోయిస్టుల రాజకీయ ఆశలు
లొంగిపోయిన వారిలో తిప్పిరి తిరుపతి , మల్లా రాజిరెడ్డి వంటి ఉద్ధండులు ఉన్నారు. దేవ్జీ వంటి నేతలు తాము కేవలం విశ్రాంతి కోసం బయటకు రాలేదని, చట్టబద్ధమైన రాజకీయ పోరాటం చేస్తామని స్పష్టంగా ప్రకటిస్తున్నారు. అంటే, అడవిలో తుపాకీతో చేసిన పోరాటాన్ని ఇకపై ప్రజాస్వామ్య వేదికలపై, ఎన్నికల బరిలో కొనసాగించాలనే బలమైన సంకల్పం వారిలో కనిపిస్తోంది. మావోయిస్టు సిద్ధాంతం చనిపోలేదని, ప్రజా మద్దతుతో దానిని నిరూపిస్తామని వారు చెబుతున్న మాటలు వారి ఆలోచనలను బయటపెడుతున్నాయి.
రాజకీయ అవకాశాలు కల్పించేందుకు రేవంత్ ఆసక్తి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తున్నట్లు కనిపిస్తోంది. లొంగిపోయిన నేతలతో సెక్రటేరియట్లో భేటీ కావడం, వారికి భారీ పునరావాస ప్యాకేజీలను అందించడమే కాకుండా, వారిని గౌరవప్రదంగా సమాజంలోకి ఆహ్వానించడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది. భవిష్యత్తులో ఈ మాజీ నేతలకు కాంగ్రెస్ పార్టీ తరపున లేదా ప్రభుత్వ నామినేటెడ్ పదవుల ద్వారా ప్రజా ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
పౌర సమాజం స్పందన ఎలా ఉంటుంది?
ఒకప్పుడు సమాంతర ప్రభుత్వాన్ని నడిపి, హింసాయుత మార్గాన్ని ఎంచుకున్న వారు ఇప్పుడు నేరుగా చట్టసభల్లోకి వస్తామంటే సామాన్య ప్రజలు, ముఖ్యంగా బాధితులు ఎలా స్పందిస్తారనేది ప్రశ్నార్థకం. అయితే, తుపాకీ వదిలి ఓటు అనే మార్గాన్ని ఎంచుకోవడం ప్రజాస్వామ్య విజయంగా ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో, వారు కోరుతున్న భారీ రివార్డులు, కొత్త డిమాండ్ల పట్ల సామాన్య పౌర సమాజంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వారు తప్పనిసరి పరిస్థితుల్లోనే.. ప్రాణాలు వదిలేయడం కన్నా.. బతికి ఉండటమే మంచిదన్న అభిప్రాయంతోనే లొంగిపోతున్నారు కానీ.. వారి సిద్ధాంతాల్లో మార్పులు వచ్చి కాదు. ఆ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్న అభిప్రాయం వినిపిస్తోంది.
