జూబ్లిహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి అటు తన పాలన, పథకాలతో పాటు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే సమస్యలు వస్తాయని పరోక్షంగా సంకేతాలు పంపుతున్నారు. అదే సమయంలో భావోద్వేగపూరితమైన అంశాలను కూడా ప్రచారానికి జోరుగా వాడుకుంటున్నారు. అందులో కీలకమైనవిగా పీజేఆర్ విగ్రహం, ఎన్టీఆర్ విగ్రహం. అమీర్ పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెడతారని.. ఎవరు అడ్డుకుంటారో చూస్తామని సవాల్ చేశారు. అలాగే కృష్ణానగర్ లో పీజేఆర్ విగ్రహం పెడతామన్నారు.
ఖైరతాబాద్ కు ఒకప్పుడు ఎమ్మెల్యేగా పీజేఆర్ వ్యవహరించారు. ఆ సమయంలో అక్కడి పజలకు ఆయన మంచి సేవలు అందించారు. పేదలకు అందుబాటులో ఉండే నేతగా గుర్తింపు పొందారు. ఆయన గుర్తింపు కూడా కొంత మేర ఓట్లు తెచ్చి పెడుతుంది. కానీ ఆయన కుమారుడు బీఆర్ఎస కోసం పని చేస్తున్నారు. ఇక కమ్మ సామాజికవర్గం ఓట్లు.. సెటిలర్ల ఓట్లను ఆకట్టుకునేందుకు ఎన్టీఆర్ జపం చేస్తున్నారు. అమీర్ పేట చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం పెడతానని అంటున్నారు. ఇలాంటి భావోద్వేగ పూరిత అంశాలను రేవంత్ తెరపైకి తెస్తున్నారు
జూబ్లిహిల్స్ ఉఎన్నికలపై చిన్న చాన్స్ కూడా వదులుకోకూడదని రేవంత్ ప్రయత్నిస్తున్న మాట నిజం. నిర్లక్ష్యం ఉండకూడదని.. అనుకుంటున్నారు. దానికి తగ్గట్లుగా అన్ని అస్త్రాలూ ప్రయోగిస్తున్నారు. తానే అభ్యర్థి అన్నంత గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అందుకే.. పీజేఆర్, ఎన్టీఆర్ విగ్రహాల డైలాగులు బయటకు వచ్చాయి. నిజంగా గెలిచేస్తే.. విగ్రహాలు పెడతారా అంటే.. చెప్పడం కష్టమే.