సినీ కార్మికులకు కలెక్షన్లలో వాటా ఇచ్చే పని అయితే టిక్కెట్ల రేట్ల పెంపుకు ఆమోదం తెలియచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సినీ కార్మికులు అంతా కలసి సీఎం రేవంత్ రెడ్డికి హైదరాబాద్లో అభినందన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెంచే టికెట్ రేట్ లో 20% కార్మికులకు ఇస్తేనే ఇకపై జీవో ఇస్తామని ప్రకటించారు. టికెట్ రేట్లు పెరిగితే నిర్మాతకు డబ్బులు వస్తాయి కానీ కార్మికులకు ఏమీ రాదు..అందుకే ఇకపై టికెట్ రేట్లు పెంచే జీవో ఇవ్వాలంటే 20 శాతం కార్మికులకు ఇవ్వాలన్నారు.
అధికారంతో తన కళ్లు మూసుకుపోలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. సినీ కార్మికులకష్టాలు తెలుసన్నారు. మిమ్మల్ని పట్టించుకోనంత ఎత్తుకు తాను ఎదుగలేదని కార్మికులకు భరోసా ఇచ్చారు. మీ కష్టాలన్నీ తీరుస్తానని చెప్పలేను కానీ.. తన చేతుల్లో ఉన్నంత వరకూ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నటుడు ప్రభాకర్ రెడ్డిని రేవంత్ గుర్తు చేసుకున్నారు. సినీ కార్మికుల ఆత్మబంధువు ప్రభాకర్ రెడ్డి అని..ఆయన కార్మికుల కోసం తన సొంత స్థలం పది ఎకరాలు ఇచ్చారన్నారు.
సినీ కార్మికుల అభినందన సభలో.. టిక్కెట్ రేట్ల ప్రస్తావన తీసుకు రావడం.. కార్మికులకు ఇరవై శాతం వాటా ఇవ్వాలనడం సంచలనంగా మారింది.ఈ ప్రతిపాదన ఎలా కార్యరూపంలోకి వస్తుందో చెప్పడం కష్టమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో ప్రభుత్వం కొన్ని సినిమాలకు.. రేట్లు పెంచుతూ జీవో ఇచ్చినా న్యాయస్థానాల్లో నిలబడలేదు. అయితే ఇలా కార్మికులకు ఇరవై శాతం వాటా ఇస్తే రేట్లు పెంచుకునే చాన్స్ ఇస్తామని చట్టం చేస్తే సమస్యలు ఉండవు.