ముంద‌స్తుపై రేవంత్ క‌న్ఫ్యూజ్ చేస్తున్నారా..?

రాష్ట్రంలో ఎన్నిక‌లు ఎప్పుడైనా రావొచ్చు, ఎదుర్కోవ‌డానికి సిద్ధంగా ఉండాలంటూ పార్టీ శ్రేణుల్ని స‌మాయ‌త్తం చేసే ప్ర‌య‌త్నంలో పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఉన్నారు. జిల్లాల నేత‌ల‌తో వీడియో కాన్ఫ‌రెన్సులు నిర్వ‌హిస్తూ… ఎన్నిక‌ల్లో ఎలాంటి వ్యూహాలు అనుస‌రించాల‌నే అంశాల‌పై ఏకంగా చ‌ర్చ‌లు పెట్టేస్తున్నారు. అంతేకాదు, పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రానికి వ‌చ్చి వెళ్లాక‌… టిక్కెట్ల కేటాయింపుల చ‌ర్చ‌లు కూడా మొద‌లైపోయాయి. తెలంగాణ కాంగ్రెస్ లో ముంద‌స్తు ఎన్నిక‌ల హ‌డావుడి బాగానే ఉంది. వాస్త‌వం మాట్లాడుకుంటే… ముంద‌స్తు ఎన్నిక‌ల ప్ర‌స్థావ‌న తెర‌మీదికి వ‌చ్చాక‌నే కాంగ్రెస్ నేత‌ల్లో ఐక‌మ‌త్యం కొంతైనా పెరిగింది! అయితే, రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌లు మ‌రోలా ఉండ‌టం విశేషం. ముంద‌స్తు ఉండ‌ద‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెబుతున్నారు.

ముంద‌స్తు ఎన్నిక‌ల పేరుతో ప్ర‌జ‌ల్ని సీఎం కేసీఆర్ త‌ప్పుతోవ ప‌ట్టిస్తున్నార‌ని రేవంత్ అన్నారు. ఓట‌రు జాబితాల‌ను జ‌న‌వ‌రి నాటికి పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలంటూ కేంద్ర ఎన్నిక‌ల అధికారి, రాష్ట్ర ఎన్నిక‌ల అధికారికి లేఖ రాశార‌న్నారు. కొత్త ఎన్నిక‌ల జాబితాలు ప్రింట్ అయ్యాక‌నే సాధార‌ణ‌లు ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌న్నారు. జ‌న‌వ‌రి వ‌ర‌కూ ఓట‌రు జాబితాలు సిద్ధం కాక‌పోతే… ఈలోగా న‌వంబ‌ర్ లోనో, డిసెంబ‌ర్ లోనో ఎన్నిక‌లు ఎలా నిర్వ‌హిస్తారనే విచిత్రాన్ని తెలంగాణ స‌మాజానికి ముఖ్య‌మంత్రి వివ‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అంతేకాదు, ఇదే స‌మ‌యంలో పీసీపీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కి కూడా రేవంత్ ఓ సూచ‌న చేశారు. ఎన్నిక‌లొస్తాయ‌నే అంశాన్ని ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌భుత్వంపై పోరాటం పెంచే విధంగా పార్టీ శ్రేణుల‌ను సిద్ధం చేయాలన్నారు.

రేవంత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత గంద‌ర‌గోళానికి కార‌ణ‌మౌతున్నాయి. ఎల‌క్ష‌న్స్ వచ్చేస్తున్నాయి, సిద్ధంగా ఉండాలంటూ ఉత్త‌మ్ చెబుతూ ఉంటే… ముంద‌స్తు సాధ్యం కాదంటూ రేవంత్ ఆధారాలు చూపించి మాట్లాడ‌టంతో చ‌ర్చ మొద‌లైంది! దీంతో ప్ర‌భుత్వంపై పోరాటాల‌కు సిద్ధం కావాలా, ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాలా అనే గంద‌ర‌గోళం జ‌రిగింది. ఎన్నిక‌ల పేరుతో కాంగ్రెస్ పార్టీలో ఎట్ట‌కేల‌కు నాయ‌కుల‌ను ఏకతాటిపైకి తీసుకొచ్చే అవ‌కాశం ఉత్త‌మ్ కి వ‌చ్చింది. కానీ, ఇప్పుడు రేవంత్ ఇలా వ్యాఖ్యానించ‌డంతో ప‌రిస్థితి మారేట్టుగా క‌నిపిస్తోంది..! నిజానికి, రేవంత్ త‌ప్పుబ‌ట్టింది ముఖ్య‌మంత్రి కేసీఆర్ విధానాల‌నే. కానీ, ఉత్త‌మ్ అభిప్రాయాన్ని కూడా ఆయ‌న వ్య‌తిరేకిస్తూ సూచ‌న‌లు చేస్తున్న‌ట్టుగా కూడా వినిపిస్తోంది. మొత్తానికి, కాంగ్రెస్ కేడ‌ర్ ను రేవంత్ కొంత క‌న్ఫ్యూజ్ చేస్తున్నార‌నే చెప్పొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com