కుటుంబసభ్యల ఫోన్లను ట్యాపింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఆత్మహత్య చేసుకోవడం మేలు అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సొంత కుటుంబసభ్యుల ఫోన్ కాల్స్ వినాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హాయంలో తన ఫోన్ ట్యాపింగ్ కాలేదని అనుకుంటున్నానని.. ఫోన్ ట్యాపింగ్ అయ్యి ఉంటే సిట్ అధికారులు తనకు నోటీసులు ఇచ్చేవారని గుర్తు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ చట్టవ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కానీ పర్మిషన్ తీసుకుని చేయాలని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలపైనా రేవంత్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్‌పై మొదట ఫిర్యాదు చేసింది RS ప్రవీణ్ అని గుర్తు చేశారు. నిజానికి అసలు మొదట ఫోన్ ట్యాపింగ్ పై కేసు నమోదు కాలేదన్నారు. సామాగ్రి చోరీ కావడంతో వాటిపై దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ అంశం బయట పడిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరుగుతోందని.. సిట్ అధికారులను తాను డిక్టేట్ చేయనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో మొదట ఉంటారని అందరూ అనుకుంటారు. రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేస్తున్నారో కూడా కొన్ని సభల్లో ప్రకటించారు. తన ఫోన్లు..తన కుటుంబసభ్యుల ఫోన్లు అన్నీ ట్యాప్ చేశారని కూడా ఆరోపించారు. అయితే ఇప్పుడు సిట్ తన వాంగ్మూలం నమోదు చేయలేదు కాబట్టి.. ట్యాప్ చేయలేదని అనుకుంటున్నానంటున్నారు. సిట్ నివేదిక వస్తే.. ఏ సాఫ్ట్ వేర్ తో ట్యాపింగ్ చేశారో మొత్తం తెలిసిపోతుందని సీఎం చెబుతున్నారు.