తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. బిసీ రిజర్వేషన్లకు తాత్కాలికంగా ఆయినా ఆమోదం పొందడం ఆయన టార్గెట్. ఇప్పటికే ఆర్డినెన్స్ రాజ్ భవన్కు పంపించారు. ఆ ఆర్జినెన్స్ కు ఆమోద ముద్ర వేయించుకుంటే.. తాత్కాలికంగా స్థానిక ఎన్నికల గండాన్ని గట్టెక్కవచ్చని రేవంత్ రెడ్డి అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇందు కోసం బీజేపీ, కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.
అలాగే కులగణనపై కాంగ్రెస్ ఎంపీలకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. చాలా ప్రణాళికా బద్దంగా కులగణన జరిగిందని వివరించనున్నారు. ఈ ప్రజెంటేషన్ లో బట్టి విక్రమార్క కూడా పాల్గొననున్నారు. రాహుల్, ఖర్గేలతోనూ సమావేశం అవుతారు. ఈ కులగణన ఆధారంగా తీసుకు వచ్చిన రిజర్వేషన్ల ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం లభించకపోతే ఏం చేయాలన్నదానిపైనా పార్టీ హైకమాండ్ నుంచి సలహాలు తీసుకోవాల్సి ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికలను తప్పనిసరిగా నిర్వహించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కోర్టుకు హామీ ఇచ్చిన ప్రకారం.. మూడు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంది. ఈ ఎన్నికల నిర్వహణకు రాజకీయపరంగా ఉన్న సమస్య బీసీ రిజర్వేషన్లు . 42 శాతం కల్పించకపోతే విపక్షాలు విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేస్తాయి. దాన్ని ఎదుర్కోవడమే ఇప్పుడు రేవంత్ టాస్క్ గా మారనుంది.
