తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం రేవంత్ వర్సెస్ హరీష్ రావు పోరు సరికొత్త మలుపులు తిరుగుతోంది నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న కాంగ్రెస్-బీఆర్ఎస్ పోరులో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా మాజీ మంత్రి హరీష్ రావును ఒంటరిని చేస్తున్నారని, అదే సమయంలో కేటీఆర్ పట్ల మృదువైఖరి అవలంబిస్తున్నారన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి చేసే విమర్శలు, విసిరే సవాళ్లు ప్రధానంగా హరీష్ రావుపైనే ఉండటం.. ఈ సీక్రెట్ డీల్ వాదనకు బలాన్ని చేకూరుస్తోంది.
హరీష్ రావుపైనే ఫోకస్.. ఎందుకు?
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణను కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకే పరిమితం చేయడం వెనుక పెద్ద వ్యూహం ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ తేల్చారు. ఈ మూడు బ్యారేజీల వ్యవహారంలో హరీష్ రావు పాత్రను ఎత్తిచూపే అవకాశం ఉండటంతోనే విచారణను అక్కడితో ఆపేశారని, లక్ష కోట్ల అవినీతి జరిగిన మొత్తం ప్రాజెక్టుపై సమగ్ర విచారణ చేస్తే కేసీఆర్ కుటుంబం ఇరుక్కుంటుందనే భయం రేవంత్‌లో ఉందనేది బీజేపీ ప్రధాన ఆరోపణ. హరీష్ రావును రాజకీయంగా దెబ్బతీస్తే, బీఆర్ఎస్ బలహీనపడుతుందని రేవంత్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
కేటీఆర్, కవితలకు రక్షణ కవచం ?
డ్రగ్స్ కేసు, ఫార్ములా-ఇ రేసింగ్ వివాదం, ఫామ్ హౌస్ కేసులు వంటి అంశాల్లో కేటీఆర్ పేరు వినిపించినా.. ప్రభుత్వం ఆ దిశగా కఠిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. కేటీఆర్, కవితల మధ్య రాజీ కుదిర్చేందుకు రేవంత్ రెడ్డి మధ్యవర్తిత్వం వహిస్తున్నారని బండి సంజయ్ చేసిన ఆరోపణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డికి కేటీఆర్ అంటే ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ ఉందని, అందుకే ఆయనను విచారణల నుంచి తప్పిస్తూ, హరీష్ రావును మాత్రం నిరంతరం టార్గెట్ చేస్తున్నారని అంటున్నరు. .
బీజేపీ ఎదుగుదలను అడ్డుకునే ప్లానా?
తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందంతో పని చేస్తున్నాయా అన్న అనుమానాలు కలగక మానవు. రేవంత్ రెడ్డి తన ప్రధాన ప్రత్యర్థిగా హరీష్ రావును ఎంచుకోవడం ద్వారా బీఆర్ఎస్ లోని అంతర్గత విభేదాలను వాడుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ హరీష్ రావును అవినీతి కేసుల్లో ఇరికించగలిగితే, కేటీఆర్ నాయకత్వానికి పోటీ లేకుండా చేయవచ్చని, తద్వారా బీఆర్ఎస్ బలహీనపడి కాంగ్రెస్‌కు లాభిస్తుందని రేవంత్ లెక్కలు వేస్తున్నట్లు సమాచారం. కేటీఆర్ విషయంలో ప్రభుత్వం చూపిస్తున్న మౌనం వెనుక ఏదో మర్మం ఉందనేది మాత్రం సామాన్య ప్రజల్లో కూడా చర్చకు దారితీస్తోంది.


